నగర శివారులే అడ్డాలు!
ABN , Publish Date - Aug 06 , 2026 | 09:59 AM
ఉదయం లేవగానే చంటిపిల్లలకు పట్టించే పాలు మొదలుకొని టీ పొడి, బియ్యం, నూనె, కారం, శనగపిండి, నెయ్యి, మసాలాల వరకు కల్తీనే.
ప్రాసెసింగ్ యూనిట్ల పేరుతో దందా
యథేచ్ఛగా మార్కెట్లోకి సరఫరా చేస్తున్న కేటుగాళ్లు
ప్రజల ప్రాణాలతో చెలగాటం
పోలీసుల దాడులతో వెలుగులోకి..
హైదరాబాద్ సిటీ: ఉదయం లేవగానే చంటిపిల్లలకు పట్టించే పాలు మొదలుకొని టీ పొడి, బియ్యం, నూనె, కారం, శనగపిండి, నెయ్యి, మసాలాల వరకు కల్తీనే. యూరియాతోపాలు, పన్నీర్, ఇటుకపొడితో కారం, కెమికల్స్‌తో మసాలా దినుసులు, పసుపులో సింథటిక్ కలర్, టీపొడిలో కొబ్బరి పీచు డస్టు, మిరియాలలో బొప్పాయి గింజలు, అల్లం వెల్లుల్లి పేస్టులో ఆలు, అరటి గుజ్జు ఇలా ఒకటేమిటి. ప్రజలు రోజూ వాడే నిత్యావసర వస్తువులన్నీ కల్తీమయంగా మారిపోతున్నాయి.
ప్రస్తుతం కల్తీ వస్తువులు మార్కెట్‌ను ముంచెతుత్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ ఫుడ్ అడాలే్ట్రషన్ సర్వేలైన్స్ టీమ్స్ (హెచ్ ఫాస్ట్), జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల ప్రత్యేక డ్రైవ్‌లో టన్నుల కొద్దీ నకిలీ ఆహార పదార్థాలు పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజుల క్రితం మసాలా దినుసుల్లో సైతం అత్యంత విషపూరితమైన రసాయనాల మిక్సింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మైలార్‌దేవ్‌పల్లి, బాలాపూర్ పోలీస్ స్టేషన్ల పరిఽధిలో దాడులు చేసి ఏకంగా 25 టన్నుల కల్తీ మసాలాలు సీజ్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
హైదరాబాద్ నుంచే అధిక సరఫరా
ప్రస్తుతం నిత్యావసర వస్తువులన్నీ ఎక్కువగా హైదరాబాద్ నుంచే సరఫరా అవుతున్నాయి. దేశ విదేశాల నుంచి దిగుమతి అయ్యే బేగంబజార్ వంటి మార్కెట్ నుంచి నాసిరకం వస్తువులు తెలుగు రాష్ట్రాలతోపాటు.. ఇతర నగరాలకు సరఫరా అవుతున్నాయి. కొంతమంది కేటుగాళ్లు ఇతర ప్రాంతాల నుంచి నాసిరకం వస్తువులును కొనుగోలు చేసి నగర శివారుల్లో షెడ్లు వేసి ఆ వస్తువులను వివిధ రకాల కెమికల్స్‌తో ప్రాసెసింగ్ చేసి, బ్రాండెడ్ కవర్లలో ప్యాక్ చేసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు వాటిని వినియోగించి అనేక రోగాల బారినపడుతున్నారు. అక్రమ సంపాదనకు అలవాటుపడిన కల్తీగాళ్లు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు.
మారుమూల షెడ్లలో..
నగర శివారు ప్రాంతాలైన పహాడీషరీఫ్, జల్‌పల్లి, శ్రీరాంనగర్ కాలనీ, మీర్‌పేట, నాదర్‌గుల్, బడంగ్‌పేట, హయత్‌నగర్, పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, కందుకూరు, ఘట్కేసర్, కీసర, మేడిపల్లి, మేడ్చల్, బాలానగర్, శంషాబాద్, రాజేంద్రనగర్, జీడిమెట్ల, మైలార్‌దేవ్‌పల్లి, శంకర్‌పల్లి, చేవెళ్ల, షాబాద్, పటాన్‌చెరు తదితర ప్రాంతాలను కల్తీ కేటుగాళ్లు తమ అడ్డాగా మార్చుకున్నారు. ఆయా ప్రాంతాల్లో పోలీసుల కంటపడకుండా చిన్న షెడ్డులు, రూములు ఏర్పాటు చేసి కల్తీ పదార్థాలను ప్రాసెసింగ్ చేసి ఎలాంటి అనుమతులు లేకుండా మార్కెట్‌కు తరలిస్తున్నారు.
కల్తీ పదార్థాల తయారీ ఇలా..
కల్తీ పాలు : కల్తీపాలను యూరియా, నూనె, క్రిమసంహారక మందులతోపాటు క్యాస్టిక్ సోడా, అమ్మోనియం వంటి రసాయనాలను కలిపి తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
పనీర్, నెయ్యి : పాలు లేకుండా యూరియా, వనస్పతి వంటి పదార్థాలను వినియోగించి పన్నీర్‌ను తయారు చేస్తున్నారు. పామాయిల్, ఆవుమీగడ, గేదె మీగడ, డాల్డా కలిపి కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నారు.
అల్లం వెల్లుల్లి పేస్టు : నాసిరకం అల్లం, వెల్లుల్లితో పాటు అల్లం, వెల్లుల్లి నుంచి తీసిన పొట్టును ఒకరోజంతా నీటిలో నానపెడుతున్నారు. ఆ తర్వాత దాన్ని మిషన్‌లో వేసి మెత్తటి పేస్టులా చేసి దానికి టైటానియం డై ఆక్సైడ్, సిట్రిక్ యాసిడ్, అలుగడ్డ, అరటి గుజ్జును కలిపి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్నారు. ఇటీవల హెచ్ ఫాస్టు పోలీసులు 27 టన్నులకు పైగా కల్తీ పేస్ట్‌ను సీజ్ చేశారు.
కారం : బూజుపట్టిన మిరపకాయలు శీతల గోదాముల నుంచి కొనుగోలు చేస్తారు. వాటిని మరపట్టించి చెక్కపొడి, నూనె, ఇటుక పొడి, రైస్ మిల్లుల నుంచి సేకరించిన మెత్తని తౌడుకు కొన్ని రసాయనాలు కలిపి కల్తీకారాన్ని తయారు చేస్తున్నారు.
పసుపు : నకిలీ పసుపు కొమ్ములకు కొంత పచ్చని కలర్‌ను మిక్సింగ్ చేస్తున్నారు.
టీ పొడి : నగరంలో అనేక బ్రాండ్‌ల టీపొడిని కల్తీ చేస్తున్నారు. ఒకసారి వాడి వడగట్టిన టీపొడిని సేకరించి దాన్ని ఎండబెట్టి, దానికి రెడ్ కలర్ కోటింగ్ వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కొబ్బరి పీచును ఎండబెట్టి కొన్ని రెడ్ కలర్ వేసి టీపొడిలో మిక్సింగ్ చేసి బ్రాండెడ్ కవర్ల్‌లో ప్యాక్ చేసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఇటీవల నకిలీ 1340 రెడ్ లేబుల్ ప్యాకెట్లు, 100 తాజ్ మహల్ ప్యాకెట్లు దొరికాయి.
బియ్యం : పేద ప్రజల నుంచి, రేషన్ దుకాణాదారుల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న మిల్లర్లు.. వాటిని తిరిగి మిల్లులో పాలిష్ చేయించి వాటికి కొద్ది మొత్తంలో సన్న బియ్యాన్ని కలిపి మిక్సింగ్ చేసి సూపర్ ఫైన్ సన్న బియ్యంగా అమ్ముతున్నారు.
మసాలాలు : ఫ్యాబ్రిక్ డై, రైస్‌బ్రాన్ ఆయిల్‌తో ఆవాలు.. సింథటిక్ రంగులతో లవంగాలు, పారిశ్రామిక రంగులతో వాము, షాజీరా వంటి మసాలాలను తయారు చేస్తున్నారు. యూపీ, మధ్యప్రదేశ్‌తో పాటు.. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న మసాలాల్లో నాసిరకం వాటిని కొనుగోలు చేసి, వాటికి డేంజరస్ కెమికల్స్‌ను చేర్చి ప్రాసెసింగ్ చేస్తున్నారు. అత్యాఽధునిక టెక్నాలజీని వినియోగించి స్వచ్ఛమైన మసాలాలు(లవంగాలు, ఆవాలు, యాలకులు, మిర్యాలు, మెంతులు, నువ్వులు) నుంచి ఎసెన్షియల్ ఆయిల్స్‌ను తీస్తున్నారు. అవి ఏమాత్రం చెడిపోకుండా ఆయిల్‌ను తీస్తున్నట్లు తెలిసింది.
నూనెలు : కొవ్వులు, పారిశ్రామిక వ్యర్థాలను ఉపయోగించి నూనెను తయారు చేస్తున్నారు. ఒకసారి వాడిన నూనెను సేకరించి దాన్ని రిఫైన్ చేసి కొద్దిగా పామాయిల్‌ను చేర్చి బ్రాండెడ్ ప్యాకింగ్ చేసి చిన్న చిన్న దుకాణాలకు తరలిస్తున్నారు. అప్పట్లో నకిలీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న సుమారు 100 స్థావరాలపై పోలీసులు దాడుల చేశారు.
కల్తీకాటుకు రోగాలు
కల్తీ ఆహార పదార్థాలతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కాలేయం, క్యాన్సర్, జీర్ణకోశ, మూత్రపిండాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. కల్తీ పాలు తాగుతున్న చిన్న పిల్లలు ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతుంటారు. కల్తీ టీపొడి వాడటం వల్ల జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటున్నట్లు వైద్యులు చెప్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కంటిపాప జాగ్రత్త.. చిన్నారుల్లో మయోపియా ముప్పు
Read Latest AP News And Telangana News And International News And Telugu News