విజయవాడలో విషాదం.. హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య
ABN , Publish Date - Aug 06 , 2026 | 11:26 AM
విజయవాడ కానూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. హైదరాబాద్‌కు చెందిన 19 ఏళ్ల వైష్ణవి హాస్టల్ గదిలో ఉరివేసుకుని మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు..
విజయవాడ, ఆగస్టు 6: నగరంలోని కనూరు ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన 19 ఏళ్ల వైష్ణవి అనే విద్యార్థిని.. హాస్టల్ గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విజయవాడలోని ఒక ప్రముఖ కోచింగ్ సెంటర్‌లో విద్యనభ్యసించడానికి వచ్చిన వైష్ణవి, స్థానిక హాస్టల్‌లో ఉంటోంది. ఆమె మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ కుమార్తె ఇలా అర్ధాంతంగా తనువు చాలిస్తుందని ఊహించలేకపోయామని కన్నీరుమున్నీరయ్యారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందడానికి కేవలం రెండు రోజుల ముందు వైష్ణవి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడింది. తనను త్వరగా ఇంటికి తీసుకెళ్లాలని, తాను అక్కడ ఉండలేకపోతున్నానని వారిని వేడుకున్నట్లు సమాచారం. ఆ సమయంలో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పెనమలూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు వేగవంతం చేశారు. వైష్ణవి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకోవడానికి ఆమె మొబైల్ ఫోన్ కాల్ డేటా, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
కర్నూలు బస్సు ప్రమాదం కేసు.. జిల్లా ఎస్పీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
నీట్ శిక్షణ పొందుతున్న హైదరాబాద్ వాసి బలవన్మరణం
Read Latest Telangana News And Telugu News