మళ్లీ పాత రోజుల్లోకి..
ABN , Publish Date - Apr 22 , 2026 | 10:48 AM
ఒకప్పుడు పల్లెల్లో చల్లటి మట్టి కుండలో దాచిన అంబలి, అవ్వ ప్రేమతో కలిపిన సద్దన్నం కేవలం ఆకలిని తీర్చడమే కాకుండా.. ప్రాణాలకు రక్షణనిచ్చే సంజీవనిలా ఉండేవి.
అంబలి, సద్దన్నం, మాల్ట్ డ్రింక్స్‌కు డిమాండ్
నేటి తరాన్ని కాపాడుతున్ననిన్నటి సిరిధాన్యాలు
మారిన జీవన విధానమే కారణం
టిఫిన్ సెంటర్లకు పోటీగా గిరాకీ
దుబ్బాక(మెదక్): ఒకప్పుడు పల్లెల్లో చల్లటి మట్టి కుండలో దాచిన అంబలి, అవ్వ ప్రేమతో కలిపిన సద్దన్నం కేవలం ఆకలిని తీర్చడమే కాకుండా.. ప్రాణాలకు రక్షణనిచ్చే సంజీవనిలా ఉండేవి. నేడు జీవనశైలి మారడంతో అవే సంప్రదాయ ఆహారాలు సరికొత్త వ్యాపార రూపం దాల్చుతున్నాయి. ఆత్మీయంగా అందించే రాగి జావ, ఇప్పుడు రోడ్ల పక్కన స్టాళ్లలో గ్లాసుల్లో విక్రయించడం విశేషం. ప్రస్తుతం దుబ్బాకలో రాగి, కొర్రలు వంటి సిరిధాన్యాలతో తయారయ్యే పానీయాలకు విపరీతమైన గిరాకీ కనిపిస్తోంది.
గతంలో కరువు కాలంలో పేదల ఆకలి తీర్చిన అంబలి కేంద్రాలు నేడు ‘‘మిల్లెట్ డ్రింక్’’ కేంద్రాలుగా రూపాంతరం చెందాయి. సిద్దిపేట, ఉమ్మడి మెదక్ జిల్లా ఉద్యమ కాలంలో అంబలి కేంద్రంలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా ఉండేది. వ్యవసాయ కూలీలకు, నిరుపేదలకు అంబలికేంద్రాల ద్వారా ఆకలి తీర్చేవారు. కమ్యూనిస్టు పార్టీలతోపాటు విప్లవ ఉద్యమపార్టీల అనుబంద సంస్థలు కూడా దశాబ్దకాలం పాటు అంబలి కేంద్రాలను ఏర్పాటు చేసీ, నిరుపేదల ఆకలి తీర్చారు. ఒకప్పుడు కరువు కాలాల్లో అంబలి ప్రాణాధారం. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి అందుబాటులో ఉండే ఈ పానీయం ఆకలి తీర్చడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మళ్లీ వాటికి విపరీతమైన గిరాకీ పెరగడం విశేషం.
ఆరోగ్యంపై పెరిగిన అవగాహన
వేగవంతమైన జీవనశైలి వల్ల తలెత్తుతున్న మధుమేహం, బీపీ, ఊబకాయం వంటి సమస్యల నేపథ్యంలో ప్రజలు మళ్లీ పాత పద్ధతుల వైపు మళ్లుతున్నారు. సద్దన్నంలోని ప్రోబయోటిక్స్, రాగి జావలోని కాల్షియం, ఐరన్, కొర్రల జావలో ఉండే అధిక పీచు పదార్థం (ఫైబర్) ఆరోగ్యానికి రక్షణ కవచాలుగా మారుతున్నాయి. రాగి అంబలి నిజంగా ఒక సంపూర్ణ పౌష్టికాహారం. ఇందులో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకల బలాన్ని పెంచుతుంది. ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సులభమవుతుంది.
ఉపాధికి కేరాఫ్ అడ్రస్
తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల ఈ మిల్లెట్ స్టాళ్లు గ్రామీణ యువతకు, మహిళలకు మెరుగైన ఉపాధిని అందిస్తున్నాయి. టిఫిన్ సెంటర్ల కంటే తక్కువ ఖర్చుతో, పోషకాలతో కూడిన ఆహారం లభిస్తుండటంతో చాలామంది వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. కాలం మారినా ఆహార విలువల ప్రాముఖ్యత మారదని.. సంప్రదాయం వ్యాపారంగా మారినా అది ప్రజారోగ్యానికి మేలు చేకూర్చడం సానుకూల పరిణామమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తల్లిదండ్రులూ.. బీ కేర్‌ఫుల్ !
Read Latest Telangana News and National News