తల్లిదండ్రులూ.. బీ కేర్‌ఫుల్ !
ABN , Publish Date - Apr 22 , 2026 | 09:43 AM
తల్లిదండ్రులూ... మీ పిల్లలు ఏం చేస్తున్నారో గమనిస్తున్నారా? పని ఒత్తిడిలో పడి వారిని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఉన్నత చదువుల కోసం పట్టణాలకు పంపిస్తున్నామని మీరు సంబరపడుతుంటే.. కొందరు విద్యార్థులు మాత్రం దారి తప్పి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
మీ పిల్లల భవితవ్యం మీ చేతుల్లోనే
దారితప్పుతున్న యువత
చదువు సాకుతో పట్టణానికి వచ్చి వ్యసనాల ఊబిలోకి..
నిబంధనలకు విరుద్ధంగా గదులిస్తున్న లాడ్జీ నిర్వాహకులు
పిల్లల స్నేహితులు, ఫోన్ వినియోగంపై నిఘా ఉంచాలని నిపుణుల హెచ్చరిక
గజ్వేల్(మెదక్): తల్లిదండ్రులూ... మీ పిల్లలు ఏం చేస్తున్నారో గమనిస్తున్నారా? పని ఒత్తిడిలో పడి వారిని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఉన్నత చదువుల కోసం పట్టణాలకు పంపిస్తున్నామని మీరు సంబరపడుతుంటే.. కొందరు విద్యార్థులు మాత్రం దారి తప్పి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గజ్వేల్ పట్టణంలో మారుతున్న సామాజిక పరిస్థితులు భయాందోళన కలిగిస్తున్నాయి. చదువు కోసమని గ్రామాల నుంచి పట్టణానికి వస్తున్న యువతలో కొందరు క్లాసులకు డుమ్మా కొట్టి విచ్చలవిడి వ్యవహారాలకు పాల్పడుతున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్కులు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు గంజాయి, డ్రగ్స్ వంటి ప్రాణాంతక వ్యసనాలకు బానిసలవుతున్నారు. చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ వారిని తప్పుడు దారిలోకి నెడుతోంది. అనవసరమైన చాటింగ్‌లు, కాల్స్‌తో చిక్కుల్లో పడుతున్నారు. ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు టాప్ ర్యాంకులు సాధిస్తుంటే, అబ్బాయిలు వెనుకబడిపోవడం గమనార్హం.
నిబంధనలు గాలికి.. లాడ్జీల కక్కుర్తి!
గజ్వేల్ పట్టణంలోని పలు లాడ్జీలు నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే చూస్తూ మైనర్లు, మేజర్లన్న తేడా లేకుండా గదులను అద్దెకు ఇస్తున్నారు. ఎలాంటి గుర్తింపు కార్డులు అడగకుండా, రిజిస్టర్లలో వివరాలు నమోదు చేయకుండా యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ మైనర్‌కు గది ఇచ్చిన కేసులో లాడ్జీ నిర్వాహకుడిపై కేసు నమోదు కావడం ఈ దుస్థితికి అద్దం పడుతోంది. ఒకవైపు కొందరు దారితప్పుతుంటే, మరికొందరు పట్టుదలతో చదువుతూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. గజ్వేల్‌లోని ఒక కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థికి 470కి గానూ 468 మార్కులు, రెండో సంవత్సరం విద్యార్థినికి 1000కి 995 మార్కులు రావడం వారి క్రమశిక్షణకు నిదర్శనం. ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నిపుణుల సూచనలివే
పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రులు ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల మొబైల్ ఫోన్ వినియోగంపై నిఘా ఉంచాలి. వారు ఎవరితో స్నేహం చేస్తున్నారో, ఖాళీ సమయాల్లో ఎక్కడికి వెళ్తున్నారో గమనించాలి. అప్పుడప్పుడు అకస్మాత్తుగా కళాశాలకు వెళ్లి అధ్యాపకులతో మాట్లాడాలి. ముఖ్యంగా ఎస్‌ఎ్‌ససీ, ఇంటర్, డిగ్రీ వయసులో పిల్లల ప్రవర్తనపై అత్యంత శ్రద్ధ వహించాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News