Share News

కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

ABN , Publish Date - Apr 22 , 2026 | 07:58 AM

ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, ఉద్యోగులందరూ తక్షణమే విధులకు హాజరుకావాలని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (MD) నాగిరెడ్డి పిలుపునిచ్చారు.

కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
Nagireddy RTC MD Statement

హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకూ సమ్మె ఆపే ప్రసక్తి లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, ఉద్యోగులందరూ తక్షణమే విధులకు హాజరుకావాలని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (MD) నాగిరెడ్డి పిలుపునిచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.


నాగిరెడ్డి మాట్లాడుతూ.. ‘కార్మికులు కోరుతున్న డిమాండ్లను ఒకేసారి కాకుండా, ప్రాధాన్యతా క్రమంలో దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కార్మికుల ప్రధాన డిమాండ్లను లోతుగా పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు ఇప్పటికే ఒక ప్రత్యేక కమిటీని నియమించాం. ఈ కమిటీ ఇచ్చే సూచనల మేరకు తదుపరి నిర్ణయాలు ఉంటాయి. కొన్ని కార్మిక సంఘాలు స్వార్థ ప్రయోజనాల కోసం కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారు. అనవసర ఆందోళనలతో సంస్థకు, ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు. సంస్థ ప్రయోజనాలను దృష్ట్యా, ప్రజా రవాణాకు ఆటంకం కలగకుండా కార్మికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.. అంతా విధుల్లో చేరాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది. సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాం. కార్మికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని అన్నారు.


సమ్మె విరమించేది లేదు: ఆర్టీసీ జేఏసీ చైర్మన్

ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సాగుతున్న సమ్మెపై జేఏసీ చైర్మన్ వెంకన్న స్పష్టతనిచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వెంకన్న మాట్లాడుతూ.. ‘మేము అడుగుతున్నవి కొత్త కోర్కెలు కావు. గతంలో ప్రభుత్వం, యాజమాన్యం మాకు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం హామీలను పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. జేఏసీ ముందుంచిన 32 డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగుతుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు, పని గంటల నియంత్రణపై స్పష్టమైన హామీ కావాలి. ప్రజలకు ఇబ్బంది కలిగించడం మా ఉద్దేశ్యం కాదు, ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించడం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కాల్సి వచ్చింది. ప్రభుత్వం కాలయాపన చేయకుండా తక్షణమే స్పందించాలి. హామీలు ఇచ్చి విస్మరించడం వల్ల కార్మికుల్లో అసహనం పెరిగింది. మా హక్కుల సాధన వరకు పోరాటం ఆగదు’ అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

తెలంగాణ నుంచి 8 కొత్త రైళ్లు

అల్లు అర్జున్‌కు ఊరట.. ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 22 , 2026 | 08:13 AM