Share News

ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఆర్టీసీ సమ్మె విరమించాలని విజ్ఞప్తి: మంత్రి పొన్నం

ABN , Publish Date - Apr 22 , 2026 | 10:28 AM

రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వంతో నిన్న జరిగిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచే బస్సులను నిలిపివేశారు కార్మికులు. ప్రజా శ్రేయస్సు దృష్ట్య సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఆర్టీసీ సమ్మె విరమించాలని విజ్ఞప్తి: మంత్రి పొన్నం
Ponam Prabhakar appeal

హైదరాబాద్, ఏప్రిల్ 22: రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వంతో నిన్న(మంగళవారం) జరిగిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచే బస్సులను నిలిపివేశారు కార్మికులు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాల్సిందే అంటూ ఆర్టీసీ జేఏసీ సమ్మె సైరన్ మోగించింది. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.


'ఆర్టీసీ సోదరులకు నా కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి సంస్థ పరిరక్షణ, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా.. సమ్మె విరమించాలని విజ్ఞప్తి. సమస్యకు సమ్మె పరిష్కారం కాదు.. నలుగురు అధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. నాలుగు వారాల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించాం. కమిటీల పేరుతో కాలయాపన చేస్తామనడం పొరపాటు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వ్యతిరేకతా లేదు. అవన్నీ వెంటనే పరిష్కారమయ్యే అంశాలు. ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు రెండూ పెండింగ్‌లో ఉన్నాయి. ఈ రెండు అంశాల్లో పలు సాంకేతిక అంశాలు చరించాల్సి ఉంది. అధ్యయనం చేయడానికి నాలుగు వారాల గడువు అడిగాం. ఈ రెండు అంశాలూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దగ్గర చర్చిస్తామని నలుగురు అధికారుల కమిటీకి తెలియజేశాం' అని మంత్రి తెలిపారు.


'ఆర్టీసీ విలీనం ఆలస్యమైనా ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి. గుర్తింపు సంఘాల ఎన్నికల విషయంలో నాయకుల మధ్య అంతర్యుద్ధం నాయకత్వ అంశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడగానే గతంలో పెండింగ్‌లో ఉన్న 2017 పీఆర్సీ క్లియర్ చేశాం. పెండింగ్ డీఏలు లేకుండా క్లియర్ చేశాం. 2013 పెండింగ్ బాండ్స్ క్లియర్ చేశాం. రూ.1205 కోట్లు ఉన్న పీఎఫ్ బకాయిలను రూ.600 కోట్లకు తగ్గించాం. రూ.690 కోట్లు ఉన్న సీసీఎస్ బకాయిలను రూ.300 కోట్లకు తగ్గించాం. ఇవే కాకుండా నెల వారీగా పీఎఫ్, సీసీఎస్‌కి రూ.75 కోట్లు చెల్లిస్తున్నాం. ఉద్యోగులపై పనిభారం పడకుండా ఉండడానికి 4,538 ఉద్యోగాల నియామకాలు భర్తీ త్వరలోనే పూర్తవుతుంది' అని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.


'అలానే సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న 1134 కారుణ్య నియామకాలు చేపట్టాం. గత ప్రభుత్వంలో వివిధ కారణాలతో శాశ్వతంగా సర్వీసు నుంచి రిమూవ్ అయిన వారిలో ఇప్పటి వరకు దాదాపు 250 మందికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అన్ని అంశాలు పరిష్కారం చేస్తాం. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు చేయొద్దు. గత ప్రభుత్వంలో 10ఏళ్లుగా ఆర్టీసీలో ఏం జరిగిందో కార్మికులందరికీ తెలుసు. రోజూ 65 లక్షల మంది ప్రయాణం చేస్తుంటే.. అందులో 45 లక్షల మంది మహిళలే ఉన్నారు. సమ్మె విరమించాలని ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నా' అని మంత్రి అన్నారు.


'మిమ్మల్ని ఎవరూ అడ్డుకోరు. ప్రజాస్వామ్య పద్ధతిలో మీ నాయకులు నిరసన తెలుసుకోవచ్చు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవచ్చు. పేద ప్రజల ప్రయాణాలకు ఇబ్బందులు కలగజేయవద్దు. పేదలకు కార్లలో పోయే స్థోమత లేదు. కాబట్టి ప్రతి ఒక్క ఆర్టీసీ కుటుంబ సభ్యుడికి, కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తరఫున కొట్లాడి సాధించుకుందాం. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. మీ సమస్యల పరిష్కారంపై సానుకూలంగా ఉన్నాం. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దు. నేను విద్యార్థి నాయకుడిని కార్మికులకు అండగా ఉంటా. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు లైఫ్ లైన్ అయిన ఆర్టీసీ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. మీ నాయకులకు నిరసనలు తెలియజేసే హక్కు ఉంది.. మిగతా వారంతా విధుల్లో చేరి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తున్న' అని ఆర్టీసీ కార్మికులకు పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

ఆర్టీసీ బస్సులు బంద్.. మెట్రో రైళ్లు, ఆటోలకు పెరిగిన డిమాండ్..

Updated Date - Apr 22 , 2026 | 10:40 AM