Share News

ఆర్టీసీ బస్సులు బంద్.. మెట్రో రైళ్లు, ఆటోలకు పెరిగిన డిమాండ్..

ABN , Publish Date - Apr 22 , 2026 | 08:04 AM

హైదరాబాద్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులు మెట్రో రైళ్ల వైపు మళ్లారు. దీంతో మెట్రో రైళ్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది.

ఆర్టీసీ బస్సులు బంద్.. మెట్రో రైళ్లు, ఆటోలకు పెరిగిన డిమాండ్..
Telangana RTC Strike

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ సహా మెుత్తం 32 హామీలు నెరవేర్చాలని ఆర్టీసీ జేఏసీ సమ్మెకు దిగింది. రాష్ట్రవ్యాప్తంగా బస్సులను డిపోలకే పరిమితం చేశారు టీజీఎస్ ఆర్టీసీ కార్మికులు. డిపోల ఎదుట బైఠాయించి డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేస్తున్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకూ నిరసన విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. నలుగురు ఐఏఎస్ అధికారుల కమిటీతో మంగళవారం సాయంత్రం దాదాపు నాలుగు గంటల పాటు ఆర్టీసీ జేఏసీ నాయకులు చర్చించారు. సమస్యల పరిష్కారానికి నాలుగు వారాల గడువు కావాలని అధికారులు చెప్పడంతో చర్చలు విఫలమయ్యాయంటూ జేఏసీ సమ్మె సైరన్ మోగించింది. అయితే, నేడు మరోమారు వారి మధ్య చర్చలు జరుగనున్నాయి.


మెట్రో రైలు, ఆటోలకు ఫుల్ డిమాండ్..

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల ఆర్టీసీ బస్సులు బంద్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రోజూ బస్సుల్లోనే 25 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా బస్సులు నిలిచిపోవడంతో దాదాపు వారంతా మెట్రో రైళ్ల వైపు మళ్లారు. దీంతో మెట్రో రైళ్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ నగరవ్యాప్తంగా మెట్రోస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇసుక వేస్తే రాలనంత మందితో అన్ని స్టేషన్లు నిండిపోయాయి. మెట్రో రైల్ మూడు కారిడార్ల పరిధిలోనూ ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. మరోవైపు ఆటోలకు సైతం డిమాండ్ పెరిగింది. బస్టాండ్లలో ఎంత సేపు ఎదురు చూసినప్పటికీ బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ఆటోల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.


మరోవైపు కార్మికుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. ఉద్యోగులు విధులకు హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితం.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు..

11 గంటల నుంచి ఆ ఏరియాల్లో కరెంట్ కట్

Updated Date - Apr 22 , 2026 | 08:13 AM