వీకెండ్ థెరపీ.. ఉపశమనం కోసం వెల్‌నెస్ సెంటర్లకు
ABN , Publish Date - Jun 27 , 2026 | 08:40 AM
వారానికి ఐదు రోజులు అలసి సొలిసిన మనసులు వారాంతాలలో పబ్‌లు, షికార్లు అంటూ తిరగడం అతి సాధారణం కావొచ్చేమో కానీ, ఇటీవలి కాలంలో ఆ ధోరణి కొంత మారింది.
వారాంతాలలో తప్పనిసరంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు..
సగటున రూ.4వేల ఖర్చు
హైదరాబాద్ సిటీ: వారానికి ఐదు రోజులు అలసి సొలిసిన మనసులు వారాంతాలలో పబ్‌లు, షికార్లు అంటూ తిరగడం అతి సాధారణం కావొచ్చేమో కానీ, ఇటీవలి కాలంలో ఆ ధోరణి కొంత మారింది. శరీరాన్ని పునరుత్తేజం చేసుకోవడానికి స్పా, వెల్‌నెస్ సెంటర్‌లకు వెళ్తున్నారు. డీప్ టిష్యూ మసాజ్‌తో కండరాలను తేజోమయం చేసుకుంటూనే, ఫుట్ రిఫ్లెక్సాలజీతో ఇన్‌స్టెంట్ రిలాక్సేషన్ పొందుతున్నారు. కొద్ది నెలలుగా ఆయుర్వేద శిరోధార మొదలు ఆధునిక హ్చాట్ స్టోన్ థెరపీ, స్వీడిష్ మసాజ్‌ల వరకూ నగరవాసులు ట్రై చేసేస్తున్నారు. వారానికి 1500 నుంచి నాలుగు వేల రూపాయల వరకూ ఖర్చూ చేస్తున్నారు.
రీసెట్ కావాలంటే..
కార్పొరేట్ ఉద్యోగులు రోజుకు 9-10 గంటలు ల్యాప్‌టా్‌పలతో కుస్తీ పడుతుండటం వల్ల మూడు పదుల వయసులోనే మెడనొప్పులు, నడుమ నొప్పులు, భుజాలు పట్టేయడం లాంటి సమస్యలెన్నో వస్తున్నాయి. హాస్పిటల్స్‌కు వెళ్లడంకంటే వెల్‌నెస్ రికవరీ సెంటర్లకు వెళ్లడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఇదిగో ఈ కారణం చేతనే ఐటీ కారిడార్‌తో పాటుగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి ప్రాంతాలలోని పలు వెల్‌నెస్, స్పాసెంటర్లు విపరీతమైన రద్దీతో నడుస్తున్నాయి. వారాంతాలలో కొన్ని సెంటర్లలో అపాయింట్‌మెంట్ దొరకడం కూడా కష్టంగా ఉంటోంది.
ఇటీవలి కాలంలో మైండ్ స్పేస్, గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి ప్రాంతాలలో క్విక్ హెడ్, ఫుట్ మసాజ్ సేవలకు డిమాండ్ పెరిగిందని కేవలం అరగంటలో పూర్తయ్యే ఈ సేవలతో ఉద్యోగులు ఒత్తిడి తగ్గించుకోగలుగుతున్నాని నిపుణులు చెబుతున్నారు. రిలాక్సేషన్ కోసం మాత్రమే కాకుండా బరువు తగ్గడానికి, యాంటీ ఏజింగ్ ట్రీట్‌మెంట్స్ కోసం కూడా ప్రత్యేకంగా వెల్‌నెస్, మెడికల్ స్పా సేవలను వినియోగించుకుంటున్నారు. అరగంట కోసమే 1000-1800 రూపాయలను చెల్లించడానికి ఐటీ ఉద్యోగులు సిద్ధమవుతున్నారని పలు స్పా సెంటర్ల ప్రతినిఽధులు చెబుతున్నారు. ఈ ఆదరణ కారణంగానే ఇండియాలో వెల్‌నెస్, స్పా మార్కెట్ విలువ 18,500 కోట్లు ఉంటే, హైదరాబాద్ వాటా 1800-2200 కోట్ల రూపాయలుగా ఉండొచ్చని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
సంపన్నుల నుంచి సామాన్యులకు...
వెల్‌నెస్ అంటే గతంలో విలాసంగానే చూసేవారు. ఆ ధోరణి ఇటీవలి కాలంలో పూర్తిగా మారిపోయింది. నిద్ర సరిగా పట్టకపోవడం, మెడ, భుజాలు పట్టేయడం, మానసిక ప్రశాంతత లేకపోవడం వంటి సమస్యలకు స్పా సేవలను వినియోగించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం ఇటీవలి కాలంలో ఎక్కువ మంది వెల్‌నెస్, స్పా సేవలకు జై కొడుతున్నారు. ఇదే విషయమై నగరంలో పలు హోటల్స్‌లో వెల్‌నెస్ స్పా సెంటర్‌లను నిర్వహిస్తున్న ఓ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ వెల్‌నెస్ అంటే గతంలో సంపన్నులకు మాత్రమే అనే అపోహలో జనం ఉండేవారు. కానీ, ఇటీవలి కాలంలో ఈ సేవలను అందరూ వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. స్పాతో వెల్‌నెస్ ఎలా సాధ్యమవుతుందంటే డీప్ టిష్యూ మసాజ్ లేదంటే ఆయుర్వేద థెరపీల వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. రక్తప్రసరణ మెరుగవుతుంది.’ అని చెప్పుకొచ్చారు.
కార్యాలయాల్లో వెల్‌నెస్ కార్యక్రమాలు
ఇటీవలి కాలంలో పలు కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగుల ఆరోగ్యానికి అమిత ప్రాధాన్యతనిస్తూ 2-3 నెలలకోమారు వెల్‌నెస్ కార్యక్రమాలను చేస్తున్నాయి. నిష్ణాతుల సలహాలు, సూచనలు అందేలా చేస్తున్నాయి, ఇంకొన్ని కంపెనీలు ఈ కార్యక్రమాలకు ఇంకాస్త అదనపు ప్రయోజనాలను సైతం జోడిస్తూ స్పా కూపన్‌లను కూడా అందిస్తున్నాయి. ఉద్యోగి హోదాను బట్టి నెలకు రెండు వేల రూపాయల నుంచి 20వేల రూపాయల కూపన్‌లు అందిస్తున్నాయి. అందుకు కారణం ఐటీ తరం ఇప్పుడు మందులు వాడటంకంటే సహజ పద్ధతులతో బాడీని డిటాక్స్ చేసుకోవడం ఉత్తమమని నమ్ముతున్నారని జూబ్లీహిల్స్‌లోని ఓ స్పా ప్రతినిధి తెలిపారు.
డీప్ టిష్యూ మసాజ్: దీనివల్ల నడుమ నొప్పి, మెడనొప్పి వంటివి తగ్గుతాయి. కనీసం ఓ గంట నుంచి రెండు గంటల పాటు చేసే ఈ మసాజ్‌కు రూ.2500 నుంచి 6వేల రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు.
ఫుట్ రిఫ్లెక్సాలజీ: ఇన్‌స్టెంట్ రిలీఫ్ కావాలనుకునే వారు దీనిని చేయించుకుంటున్నారు. శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరిచి ఒత్తిడిని వెంటనే దూరం చేస్తుంది. రూ.1000 నుంచి 2200 రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు.
స్వీడిష్ మసాజ్: మొదటిసారి స్పాకు వెళ్లే వారికి అనువైనది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది. ప్రారంభఽ ధర 3300 రూపాయల నుంచి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం ధరలు పెరిగాయ్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 9.30 నుంచి కరెంట్ కట్
Read Latest AP News And Telangana News And International News And Telugu News