Share News

నిమ్స్‌లోనూ ఇన్సూరెన్స్‌ చికిత్సలు!

ABN , Publish Date - Jun 27 , 2026 | 07:09 AM

నిమ్స్‌లో ప్రైవేటు ఆరోగ్య బీమా పథకాల కింద చికిత్సలను అందించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌ వెల్లడించారు.

నిమ్స్‌లోనూ ఇన్సూరెన్స్‌ చికిత్సలు!

  • పలువురు రోగులు నగదు రహిత సేవలను కోరుతున్నారు .. అందుకు అవకాశాలను పరిశీలిస్తున్నాం

  • ఇకపై 2 రోజుల్లోనే మెడికల్‌ రిపోర్టులు

  • ఎమర్జెన్సీ విభాగంపై ప్రత్యేక శ్రద్ధ

  • ఓపీలో కౌంటర్ల సంఖ్య పెంపు

  • నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌

హైదరాబాద్‌ సిటీ/నిమ్స్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): నిమ్స్‌లో ప్రైవేటు ఆరోగ్య బీమా పథకాల కింద చికిత్సలను అందించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌ వెల్లడించారు. చాలా మంది రోగులు నగదు రహిత చికిత్సల్లో భాగంగా ప్రైవేటు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను నిమ్స్‌లో కూడా వర్తింపజేయాలని కోరుతున్నారని, ఈ నేపథ్యంలోనే దానిపై దృష్టి పెట్టామన్నారు. ప్రస్తుతం నిమ్స్‌లో ఇన్సూరెన్స్‌ కింద చికిత్సలను అందించే విధానం లేదు. నిమ్స్‌ డైరెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ దేవరాజ్‌.. ఆసుపత్రిలో చేపట్టాల్సిన పనులు, తమ ప్రాధాన్యాల గురించి శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరించారు. సిటీస్కాన్‌, ఎంఆర్‌ఐ, అలా్ట్రసౌండ్‌ వంటి పరీక్షల రిపోర్టులు ఇవ్వటానికి ప్రస్తుతం ఏడు రోజుల వరకు సమయం పడుతుందని.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని.. 48 గంటల్లో పరీక్షలు పూర్తి చేసి, మెడికల్‌ రిపోర్టులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రివ్యూ కౌంటర్‌ను ఏర్పాటు చేసి డాక్టర్లు సాయంత్రం వరకు అక్కడే ఉండే విధంగా చూస్తున్నామని, దీనివల్ల మెడికల్‌ రిపోర్టు వచ్చిన రోజునే రోగులు డాక్టర్‌ను సంప్రదించే అవకాశం ఉంటుందని తెలిపారు. మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ వంటి పరీక్షలను కూడా త్వరలో ప్రవేశపెడతామని చెప్పారు. ఎమర్జెన్సీ విభాగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, ఎప్పటికప్పడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని డాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌ వివరించారు. కొన్ని విభాగాల్లో పడకలు ఖాళీగా ఉంటున్నాయని, కోలుకొని 2-3 రోజుల్లో డిశ్చార్జి అయ్యే రోగులను ఆ విభాగాలకు తరలిస్తున్నామని, దీని వల్ల రోగుల రద్దీ ఎక్కవగా ఉండే కీలక విభాగాలపై భారం తగ్గుతుందన్నారు. ఔట్‌పేషంట్‌ విభాగంలో రద్దీ దృష్ట్యా.. కౌంటర్ల సంఖ్యను పెంచామని, సిబ్బందిని పెంచుతున్నామని తెలిపారు.


రోగుల డిశ్చార్జి తర్వాత బిల్లింగ్‌ విషయంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నిమ్స్‌లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే గ్రామీణ రోగులకు సేవలు అందించేందుకు వలంటీర్లను నియమిస్తున్నామని, ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తే వాటి సేవలు కూడా వినియోగించుకుంటామని తెలిపారు. దేశవ్యాప్తంగా నిమ్స్‌కు మంచి గుర్తింపు ఉందని, ఆ ప్రతిష్ఠను కాపాడేలా తమ పనితీరు ఉంటుందని డాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌ స్పష్టం చేశారు. ఆసుపత్రి గౌరవానికి మచ్చ తెచ్చేలా ఎవరు వ్యవహరించినా కఠినంగా వ్యవహరిస్తామని, విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.


ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం

సీఎం రేవంత్‌రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని డాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌ చెప్పారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభిస్తోందని, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి నిధులు బాగానే మంజురు అవుతున్నాయని, ఆరోగ్యశ్రీ నుంచి కొద్దిగా బకాయిలు ఉన్నాయని, అవి కూడా దశలవారీగా విడుదలవుతున్నాయని తెలిపారు. కొత్త భవనం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సనత్‌నగర్‌ టిమ్స్‌ ప్రారంభం కాగానే కొన్ని సర్జరీలు అక్కడ చేయాలని ఆలోచిస్తున్నామని, అలాగే నిమ్స్‌లో అవయమార్పిడి సర్జరీలను పెంచుతామని డాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌ వెల్లడించారు.

Updated Date - Jun 27 , 2026 | 07:10 AM