అయ్యో రామా!
ABN , Publish Date - Jun 27 , 2026 | 06:12 AM
అయోధ్య రాముడి హుండీకే కన్నం వేశారు. రామ భక్తులు భక్తితో సమర్పించుకున్న సొమ్ములను కాజేశారు. ‘ఇంటి దొంగలు’ విచ్చలవిడిగా రెచ్చిపోయారు. అయోధ్య రామాలయానికి ఇచ్చిన నగలు, వెండి...
అయోధ్య ఆలయంలో దొంగలు పడ్డారు
కెమెరాల కళ్లుగప్పి కోట్లు కొల్లగొట్టారు
దోచుకున్న సొమ్ము టాయ్‌లెట్లలో దాచారు!
కౌంటింగ్ గదిలోనే సిబ్బంది చౌర్యం
అక్రమాలు తెలిసినా పట్టించుకోని ట్రస్టు
ప్రధాన కార్యదర్శి రాయ్ సన్నిహితుడు టిన్నూ
కీలక సూత్రధారి.. సిట్ నివేదికలో వెల్లడి
8 మంది అరెస్ట్.. రూ.79 లక్షలు స్వాధీనం
ట్రస్టుకు రాయ్, మిశ్రా రాజీనామా
లఖ్‌నవూ, జూన్ 26: అయోధ్య రాముడి హుండీకే కన్నం వేశారు. రామ భక్తులు భక్తితో సమర్పించుకున్న సొమ్ములను కాజేశారు. ‘ఇంటి దొంగలు’ విచ్చలవిడిగా రెచ్చిపోయారు. అయోధ్య రామాలయానికి ఇచ్చిన నగలు, వెండి ఇటుకలు, భూరి విరాళాల మాయంపై ఇప్పటికే పలు ఆరోపణలు వెలువడుతుండగా.. ఆలయంలోనే జరిగిన హుండీ, విరాళాల సొమ్ము స్వాహా సంగతులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బయటపెట్టింది. శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు అత్యంత సన్నిహితుడైన టిన్నూ యాదవ్ ఇందులో కీలక సూత్రధారి అని తేల్చింది. అతడితో పాటు 8 మందిని గురువారం రాత్రి అరెస్టుచేసి.. శుక్రవారం కోర్టు ముందు హాజరుపరచింది. ‘సిట్’ ప్రాథమిక నివేదిక ప్రకారం.. రామాలయంలో విరాళాల లెక్కింపు గదిలోనే సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఎవరూ గమనించకుండా హుండీల నుంచి నగదు మాయం చేశారు. అలా దోచుకున్న డబ్బును టాయ్‌లెట్లలో దాచిపెట్టి, ఆ తర్వాత వీలు చూసుకుని తమతోపాటు తీసుకెళ్లి పంచుకునేవారు. ఇంకా... విరాళాల సొమ్ము వంద నోట్ల చొప్పున కట్టలుగా కట్టిన తర్వాత... ప్రతి కట్టలో అదనంగా మరిన్ని నోట్లు కుక్కేవారు. బ్యాంకుకు తీసుకెళ్లేటప్పుడు ఆ కట్టల నుంచి అదనపు నోట్లు తీసేసుకునేవారు. ఈ క్రమంలో సీసీ కెమెరాల కళ్లూ కప్పారు. ఒక ఉద్యోగి సీసీటీవీ కెమెరాకు అడ్డంగా నిలబడేవాడు. అదే సమయంలో మరో ఉద్యోగి నోట్ల కట్టల నుంచి డబ్బు మాయం చేసేవాడు. వాస్తవానికి బ్యాంకుల్లో జమచేసిన నిధుల వివరాలపై ఆరా తీస్తుండగా.. డబ్బు దొంగతనంపైనా ఆలయ ట్రస్టు అధికారులకు అనుమానం వచ్చింది. విరాళాల పెట్టెల్లో డబ్బు తగ్గడం వీరు గుర్తించారు. రూ.500 నోట్ల పెట్టెల్లో రూ.6-7 లక్షలు తగ్గడం గమనించారు. కొన్ని వారాల పాటు ఇలా జరిగినట్లు తేలింది. అనుమానం పెరగడంతో విరాళాలు లెక్కించే గదిలో రహస్య కెమెరాలు అమర్చారు. వాటిలో వారంపాటు రికార్డయిన దృశ్యాలను పరిశీలించినప్పుడు ఈ వివరాలు తెలిశాయి.
ఆది నుంచీ అదే...
2024లో అయోధ్య మందిర ద్వారాలు తెరచినప్పటి నుంచి... అంటే ఆలయ ప్రారంభోత్సవం జరిగిననాటి నుంచే ఈ రాకెట్ నడుస్తున్నట్లు సిట్ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ ఏడాది ఏప్రిల్ 27 నుంచి ఈ నెల 5వ తేదీ మధ్య కనీసం 70 దొంగతనాలు జరిగినట్లు పసిగట్టింది. నిందితులు టిన్నూ యాదవ్, సుభాష్ శ్రీవాస్తవలను విచారిస్తుండగా.. పలువురు బ్యాంకు అధికారుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. రూ.7.5 కోట్ల వరకు డబ్బు తస్కరణకు గురైనట్లు చెబుతున్నా.. దొంగిలించిన సొమ్ము చాలా ఎక్కువే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అరెస్టయిన 8 మందిలో చంపత్ రాయ్ సన్నిహితుడు రాంశంకర్ ‘టిన్నూ’ యాదవ్, అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుశ్ మిశ్రా, అవినాశ్ శుక్లా, మనీశ్ యాదవ్, కరుణేశ్ పాండే, రాంశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ ఉన్నారు. దర్యాప్తు సందర్భంగా సిట్ వీరి నుంచి రూ.79.85 లక్షలు స్వాధీనం చేసుకుంది.
సిఫారసులతో ఉద్యోగాలు..
సిట్ కేసు నమోదుచేసిన 8 మందిలో ఆరుగురు ఆలయ సిబ్బందే. పైగా విరాళాల డబ్బు లెక్కించే బాధ్యత వారిదే. చంపత్‌రాయ్ సన్నిహితుడు టిన్నూ యాదవ్ నివాసంలో రూ.10 లక్షల నగదు దొరికింది. విరాళాలు లెక్కించేవారిలో అత్యధికులు సిఫారసులతో ఉద్యోగాలు సంపాదించినవారేనని తేలింది. చంపత్ రాయ్‌కు టిన్నూ యాదవ్ డ్రైవర్‌గానూ పనిచేశాడు. తన బంధువైన మనీశ్ యాదవ్‌కు ఉద్యోగం ఇప్పించడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే అనుకల్ప్ మిశ్రా తన బావమరిది లవ్‌కుశ్‌కు ఉద్యోగం ఇప్పించాడు. విరాళాల లెక్కింపులో ఆలయ అధికారులు, ట్రస్టు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సిట్ పేర్కొంది. లెక్కింపు సిబ్బంది ప్రతి రోజూ ఇంటికెళ్లేటప్పుడు వారిని తనిఖీ చేయడం లేదు. అలాగే దొంగిలించిన సొమ్మును అవినాశ్ శుక్లా నేరుగా తన బ్యాంకు ఖాతాలో జమచేసినట్లు వెల్లడైంది. ఈ దొంగతనాలు విరాళాలకే పరిమితం కాలేదు. భక్తులు ఇచ్చిన నగలను సైతం నిందితులు మాయం చేశారు. వీటిలో చెవిరింగులు, ముక్కుపుడకలు, గాజులు, కాలిపట్టీలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం కుట్ర వెనుక టిన్నూ యాదవ్, సుభాష్ శ్రీవాస్తవ కీలక పాత్రధారులని సిట్ తేల్చింది. విరాళాల సొమ్ము మాయమవుతోందని తెలిసినా ఆలయ ట్రస్టు సమర్థ చర్యలు తీసుకోలేదని సిట్ పేర్కొన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా శుక్రవారం తమ పదవులకు రాజీనామా చేశారు.
పెద్దవాళ్లను రక్షిస్తున్నారు: అఖిలేశ్
సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్, పీసీసీ అధ్యక్షుడు అజయ్ రాయ్ సీఎం యోగి ప్రభుత్వంపై శుక్రవారం విరుచుకుపడ్డారు. పలుకుబడి కలిగిన వ్యక్తులను రక్షించాక ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారని అఖిలేశ్ ఆరోపించారు. సిట్ మాటున ఆధారాలన్నీ తొలగించారని.. పట్టుకోవలసిన పెద్దపెద్ద వాళ్లను వదిలేశారని ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. సిట్ నివేదికను ముందుగానే సిద్ధం చేసి.. దానికనుగుణంగా దర్యాప్తు చేసినట్లు కనబడుతోందన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో చిరుద్యోగుల పేర్లు మాత్రమే చేర్చారని.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న, ఆలయ నిర్మాణం, ట్రస్టు కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న చైర్మన్ నృపేంద్ర మిశ్రా, చంపత్ రాయ్, గోపాలరావు, అనిల్ మిశ్రాల పేర్లు మాత్రం లేవని ఆక్షేపించారు. కాగా.. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేవారెవరినీ ఉపేక్షించేది లేదని సీఎం యోగి తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి
విగ్ కారణంగానే కేతన్ హత్య.. తండ్రి ఏమన్నారంటే..