వెనుజువెలాలో మరోసారి భూ ప్రకంపనలు..
ABN , Publish Date - Jun 27 , 2026 | 07:39 AM
వెనుజువెలా దేశాన్ని వరుస భూకంపాలు కుదిపేస్తున్నాయి. బుధవారం నాడు సంభవించిన రెండు భూకంపాలతో ఆ దేశం అతలాకుతలం అవుతోంది. వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది ఆచూకీ గల్లంతైంది. తాజాగా మరో భూకంపం వెనుజువెలాను కుదిపేసింది.
కరాకస్: వెనుజువెలా దేశాన్ని వరుస భూకంపాలు కుదిపేస్తున్నాయి. బుధవారం నాడు సంభవించిన రెండు భూకంపాలతో ఆ దేశం అతలాకుతలం అవుతోంది. వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది ఆచూకీ గల్లంతైంది. తాజాగా మరో భూకంపం వెనుజువెలాను కుదిపేసింది. దేశ ఉత్తర తీరానికి దూరంగా 4.9 తీవ్రతతో శుక్రవారం నాడు మరో భూకంపం సంభవించింది. ఇది మారకే నగరానికి వాయువ్యంగా 61 కిలోమీటర్ల (36 మైళ్ల) దూరంలో ఏర్పడిందని భూకంపాల పర్యవేక్షణ సంస్థ ఈఎంఎస్‌సీ తెలిపింది. దీని ప్రకంపనలు మారకే, కరాకస్ నగరాలను తాకినట్లు పేర్కొంది.
మరోసారి భూమి కంపించడంతో దేశ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే భారీ విపత్తుతో అల్లాడుతున్న ఆ ప్రాంతంలో ఇది కొత్త ఆందోళనను రేకెత్తించింది. కాగా, బుధవారం నాడు వచ్చిన రెండు భూకంపాలతో దేశవ్యాప్తంగా 920 మంది ప్రాణాలు కోల్పోగా.. 3 వేల మందికి పైగా గాయపడ్డారు. 40 వేలకుపైగా ప్రజల ఆచూకీ తెలియడం లేదు. భారీ భవనాల కింద అనేక మంది చిక్కుకుని ఉన్నారు. ఆస్తులను, సొంతవారిని కోల్పోయిన బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే, తాజా భూప్రకంపనలతో అదనపు ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందా లేదా అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు గత భూకంపాల సందర్భంగా చేపట్టిన సహాయక చర్యలకు తాజా ప్రకంపనలు ఆటంకం కలిగించాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ఇరాన్ కీలక ప్రాంతాలపై విరుచుకుపడిన యూఎస్ సెంట్రల్ కమాండ్..