Share News

నల్లని మచ్చలు పోవాలంటే...?

ABN , Publish Date - Mar 29 , 2026 | 12:29 PM

నా వయస్సు 70 సంవత్సరాలు. నాకు చాలా సంవత్సరాలుగా రెండు బుగ్గలమీద నల్లని పెద్దపెద్ద మచ్చలు ఉన్నాయి.

నల్లని మచ్చలు పోవాలంటే...?

నా వయస్సు 70 సంవత్సరాలు. నాకు చాలా సంవత్సరాలుగా రెండు బుగ్గలమీద నల్లని పెద్దపెద్ద మచ్చలు ఉన్నాయి. అవి రాను రాను ఇంకా నల్లబడుతున్నాయి. నాకు హెయిర్‌ డై వాడే అలవాటు ఉంది. దయచేసి ఆ మచ్చలు తగ్గటానికి పరిష్కారం సూచించండి.

- హనుమంతరావు, సికింద్రాబాద్‌

చర్మంపై, ముఖ్యంగా ముఖంమ్మీద నల్లటి మచ్చలు వివిధ కారణాల వల్ల రావొచ్చు. వయస్సు పెరుగుతున్న కారణంగా, హార్మోన్‌ అసమతుల్యతల వల్ల, ఎక్కువ సూర్యరశ్మికి గురికావడం లేదా హెయిర్‌ డై లాంటి కెమికల్స్‌ వల్ల కూడా పిగ్మెంటేషన్‌ పెరిగే అవకాశం ఉంటుంది. వేసవిలో సూర్యకాంతి ఎక్కువగా తగలడం వల్ల మచ్చలు మరింత నల్లబడవచ్చు. చర్మ ఆరోగ్యం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. బయటకు వెళ్లి వచ్చిన వెంటనే ముఖాన్ని సాధారణ నీటితో లేదా మృదువైన సబ్బుతో కడుక్కోవడం మంచిది. దుమ్ము, కాలుష్యం చర్మంపై ఎక్కువసేపు ఉండకూడదు. తగినంత నీరు తాగాలి.


ఆహారంలో పండ్లు, ఆకుకూరలు; క్యారెట్‌, బీట్‌రూట్‌ వంటి కూరగాయలు; పప్పులు లాంటి ప్రోటీన్‌ పదార్థాలు తీసుకోవాలి. చక్కెర, నూనెలు ఎక్కువగా ఉన్న పదార్థాలు తగ్గించడం మంచిది. మచ్చలు క్రమంగా పెరుగుతున్నా లేదా రంగు మార్పులు వేగంగా వస్తున్నా తప్ప కుండా చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడం మంచిది. సరైన పరీక్షలతో కారణాన్ని గుర్తించి తగిన సూచనలుఇస్తారు. ప్రతి ఆరోగ్య సమస్యకూ వంటింటి చిట్కాలు సమాధానం కాదు. అవసరాన్ని బట్టి తగిన వైద్యం సమయానికి తీసుకోవడమే శ్రేయస్కరం.


పార్కిన్సన్స్‌ వ్యాధి లక్షణాలను నియంత్రించేందుకు ఆహారపు జాగ్రత్తలేమైనా ఉపయోగపడతాయా?

- సుబ్బలక్ష్మి, వరంగల్‌

పార్కిన్సన్స్‌ ఉన్నవారికి మలబద్దకం వచ్చే అవకాశం ఎక్కువ. దీన్ని నివారించడానికి ఆహారంలో ఎక్కువగా పీచుపదార్థాలు, నీళ్లు ఉండేలా చూసుకోవాలి. ఉదయం అల్పా హారంలో, మధ్యాహ్నం భోజనంలో ప్రొటీన్లు చాలా తక్కువగా తీసుకోవాలి. రోజుకు అవసరమైన ప్రొటీన్లను రాత్రి భోజనంలోనే తీసుకుంటే మంచిది. ఉదయం అల్పాహారంగా అటుకులు లేదా అన్నం లేదా బియ్యం లేదా సగ్గుబియ్యంతో చేసిన ఆహారం తీసుకోవడం ద్వారా ప్రొటీన్లు నియంత్రించొచ్చు. పాలు, పెరుగు, మజ్జిగ లాంటివి సాయంత్రం లేదా రాత్రి భోజనం సమయంలో లేదా నిద్రకు ముందు తీసుకుంటే మంచిది. మధ్యాహ్నం భోజనంలో కూడా తేలికగా ఉండే ఆకుకూరలు, కాయగూరలు, అన్నంతో తీసుకోవాలి.


ఉదయం, మధ్యాహ్నం పప్పును తీసుకోకపోవడం మంచిది. బీన్స్‌, సోయా లాంటివి తగ్గించడం లేదా పూర్తిగా మానెయ్యడం చేయాలి. ఒకవేళ తీసుకున్నా రాత్రి భోజనంలో మాత్రమే తీసుకోవాలి. బరువు తగ్గిపోతున్నట్టు అయితే ఆహారంలో వెన్న, నెయ్యి లాంటి శక్తినిచ్చే పదార్థాలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. అరటిపండు, మెత్తగా ఉన్నటు వంటి ఖర్జూరాలు ఎప్పుడైనా తీసుకోవచ్చు. నీళ్లు తాగడం మర్చిపోయే అవకాశం ఉన్నందున ప్రతి పూట భోజనంలో సూప్‌ కానీ రసం కానీ ఉండేలా చూసుకుంటే ఆ రూపంలో కూడా మరిన్ని నీళ్లు తీసుకోవచ్చు. ఆపిల్‌, జామ వంటి కొన్ని రకాల పండ్లు తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాటి బదులు పళ్లరసాలు తీసుకోవచ్చు. పళ్లరసాలు కేవలం శక్తికోసమే కాక, దాని ద్వారా వచ్చే నీరు కూడా ఉపయోగపడుతుంది.


నల్ల బియ్యం (బ్లాక్‌ రైస్‌) తింటే మంచిదని అంటున్నారు. ఈ నల్లబియ్యంలోని పోషక విలువలు తెలియచేయండి.

- సుమ, తిరుపతి

book7.2.jpgఈమధ్య కాలంలో మార్కెట్‌లో మామూలు తెల్ల బియ్యానికి ప్రత్యామ్నాయాలుగా పలు రంగుల బియ్యం... బ్రౌన్‌ రైస్‌, బ్లాక్‌ రైస్‌, పర్పుల్‌ రైస్‌, రెడ్‌ రైస్‌ వంటివి కూడా లభిస్తున్నాయి. ఇందులో, అన్నిటికంటే ముదురు రంగులో ఉండే బ్లాక్‌ రైస్‌లో వివిధ రకాలైన పోషకాలు మిగతా రకాల బియ్యంలో కంటే ఎక్కువగా ఉంటాయి. బ్లాక్‌ రైస్‌లో ఉండే ఆంథోసైయనిన్లు అనేవి యాంటీఆక్సిడెంట్లుగాను, శరీరంలో ఉన్న కణజాలాల వాపును నియంత్రించే పదార్థాలుగాను కూడా పనిచేస్తాయి. దీనివల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గడమే కాక మంచి కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశం కూడా ఉంది. అధిక కొలెస్ట్రాల్‌ మూలాన రక్తనాళాల్లో ఏర్పడే గడ్డలను కూడా తగ్గించి గుండె ఆరోగ్యానికి ఈ ఆంథోసైయనిన్లు చాలా ఉపయోగపడతాయి.


బ్లాక్‌ రైస్‌లో ఉండే పీచు పదార్థం మన ఆహారంలోని పిండి పదార్థాల శోషణను నియంత్రించి రక్తంలో చక్కర స్థాయిని కూడా నియంత్రించగలవు. బ్లాక్‌ రైస్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం పలు రకాల కాన్సర్‌ల నుంచి కూడా రక్షణ పొందవచ్చు. ఈ ఆంథోసైయనిన్లు శరీరంలోని కణజాలంలో ఇన్సులిన్‌ రెసిస్టన్స్‌ను తగ్గించి, రక్తంలోని చక్కెరను అదుపులో ఉంచి, డయాబెటీస్‌ రాకుండా కాపాడుతుంది. మద్యపానం వలన లేదా ఆహారంలో అధికంగా కొవ్వులు తీసుకోవడం వల్ల వచ్చే ఫ్యాటీ లివర్‌ డిసీస్‌ నుంచి కూడా నల్ల బియ్యంలోని పోషకాలు రక్షణ కల్పిస్తాయి. ఇన్ని రకాల ఉపయోగాలున్న ప్పటికీ నల్ల బియ్యంలో కూడా మామూలు బియ్యం లాగానే పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అధిక మోతాదుల్లో తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది. పరిమిత పరిమాణాల్లో నల్లబియ్యం ఎవరైనా వాడడానికి అనువైనవి.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.com కు పంపవచ్చు)


ఈ వార్తలు కూడా చదవండి:

‘మతం’ చిక్కుల్లో జగన్‌!

ఎస్ఐఆర్ వర్సెస్ అల్లర్లు.. బెంగాల్‌లో వేడెక్కిన ఎన్నికల ప్రచారం

Read Latest Telangana News and National News

Updated Date - Mar 29 , 2026 | 12:29 PM