‘మతం’ చిక్కుల్లో జగన్!
ABN , Publish Date - Mar 29 , 2026 | 01:22 AM
పరాభవ నామ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి అనుకూలంగా లేదని వైసీపీ నిర్వహించిన ఉగాది పంచాంగ పఠనం కార్యక్రమంలో సిద్ధాంతి చెప్పారు. సాధారణంగా రాజకీయ...
పరాభవ నామ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి అనుకూలంగా లేదని వైసీపీ నిర్వహించిన ఉగాది పంచాంగ పఠనం కార్యక్రమంలో సిద్ధాంతి చెప్పారు. సాధారణంగా రాజకీయ పార్టీలు నిర్వహించే పంచాంగ పఠనాల్లో పాల్గొనే సిద్ధాంతులు ఏ రోటి కాడ పాట ఆ రోటి కాడ పాడతారన్న అభిప్రాయం ఉంది. అంటే ఆయా పార్టీలను, వాటి అధినేతలను పొగుడుతూ పంచాంగ పఠనాలు సాగుతూ ఉంటాయి. ఇందుకు భిన్నంగా వైసీపీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధాంతి మాత్రం జగన్‌రెడ్డికి ఈ ఏడాది గ్రహబలం అనుకూలంగా లేదని చెప్పారు. సదరు సిద్ధాంతి చెప్పిన దాంట్లో నిజం ఎంత ఉందో తెలియదుకానీ, ఆయన చెప్పిన దానికి అనుగుణంగా రెండు పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ రెండు పరిణామాలూ జగన్‌రెడ్డికి రాజకీయంగా అంతో ఇంతో నష్టం కలిగించేవే! మతపరమైన, కుటుంబపరమైన వివాదాలు జగన్‌రెడ్డిని చుట్టుముడుతున్నాయి. ఈ వివాదాల్లోంచి జగన్‌రెడ్డిని బయటపడేసేందుకు ఆయన మద్దతుదారులు తమ వంతు ప్రయత్నాలు మొదలెట్టారు. జగన్‌రెడ్డిలో మచ్చుకైనా కనిపించని గుణాలను ఆయనకు ఆపాదించే దుస్సాహసాలు చేస్తున్నారు. దాతృత్వంలోగానీ, కుటుంబ విలువలను పాటించడంలోగానీ వర్తమాన రాజకీయాలలో జగన్‌రెడ్డికి మరొకరు సాటిరారని ప్రచారం చేస్తున్నారు. దాతృత్వంలో కర్ణుడు కూడా జగన్‌తో సరితూగలేరని చాటిచెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా నయం, సకల గుణాభిరాముడు ఆ శ్రీరామచంద్రుడు కూడా జగన్ ముందు దిగదుడుపే అని చెప్పే ప్రయత్నం చేయలేదు. అయితే సిద్ధాంతి చెప్పినట్టుగా జగన్‌రెడ్డికి గ్రహస్థితి అనుకూలంగా లేదని భావించేలా ఆయన తల్లి విజయలక్ష్మి తాజాగా ఒక లేఖ విడుదల చేశారు. తాను సంతకం చేసిన సదరు లేఖ ఒరిజినల్ కాదని వైసీపీ వాళ్లు ప్రచారం చేసే అవకాశం ఉన్నందున ఆమె తన లేఖను నోటరీ చేయించారు. ఇదొక అరుదైన సంఘటన! విజయలక్ష్మి విడుదల చేసిన ఆ లేఖలో ఆస్తుల పంపకం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. 2009లో రాజశేఖరరెడ్డి మరణించేవరకు తమకు ఉన్న ఆస్తులు అన్నీ కుటుంబ ఆస్తులేనని ఆమె ఆ లేఖలో స్పష్టం చేశారు. ఆస్తుల పంపకం జరగలేదని, మొత్తం ఆస్తులను జగన్, షర్మిల పిల్లలు నలుగురికీ సమానంగా పంచాలన్నది రాజశేఖరరెడ్డి ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. ఇది వైఎస్ ఆదేశమని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని వైసీపీలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి కూడా చెబుతుండేవారు. ‘ఆస్తులన్నీ జగన్ పేరిట పెడితే ఎలా? షర్మిలకు అన్యాయం జరగకూడదు’ అని రాజశేఖరరెడ్డి తనతో అనేవారని ఆయన చెప్పారు. ‘ముందు ఇలాగే కానివ్వండి–అన్నీ సర్దుకున్నాక జగన్ నుంచి షర్మిలకు గిఫ్ట్‌గా ఆస్తులను బదిలీ చేయిస్తాను’ అని తాను రాజశేఖరరెడ్డికి నచ్చజెప్పానని కూడా విజయసాయిరెడ్డి చెప్పేవారు. అన్నా చెల్లెళ్ల మధ్య కుదిరిన ఎంవోయూ ప్రకారం అందులో పేర్కొన్న ఆస్తులన్నీ షర్మిలకు చెందాలని, నిజానికి ఎంవోయూలో షర్మిలకు పంచిన ఆస్తులు తక్కువేనని, బెంగళూరు సమీపంలోని యలహంకలోని భూమి కూడా షర్మిలకే చెందుతుందని విజయలక్ష్మి తేల్చి చెప్పారు.
ఆస్తుల పంపకం విషయంలో జగన్‌రెడ్డి ఇప్పటివరకు తన మేనల్లుడు, మేనకోడలికి అన్యాయం చేశాడని, ఎప్పటికైనా వారికి న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నానని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. ‘ఆస్తుల పంపకం జరగనే లేదు. షర్మిలకు ఇచ్చామని చెబుతున్న ఆస్తుల వంటివి జగన్‌రెడ్డి పేరిట కూడా ఉన్నాయి. ఇది ఆస్తి పంపకం కాదు. నిజం ఏమిటో నా దేవుడికి, నా కొడుక్కి కూడా తెలుసు’ అని ఆమె అన్నారు. గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరెవరు అని జగన్‌రెడ్డి మద్దతుదారులను ఆమె ప్రశ్నించారు. ‘మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయం! అసత్యాల ప్రచారం మానుకోవాలని రాజశేఖరరెడ్డి భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను’ అని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. కుటుంబ విలువలు, దాతృత్వంలో జగన్‌రెడ్డి తనకు తానే సాటి అయితే ఈ ఆస్తుల వివాదం ఎందుకు ఉత్పన్నం అవుతున్నది అన్న ప్రశ్నకు సమాధానం కావాలి కదా!
అప్పుల నుంచి ఆస్తులదాకా...
నిజానికి 2004లో రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చే నాటికి ఆ కుటుంబానికి ఇన్ని ఆస్తులు లేవు. ‘‘సండూరు పవర్ ప్రాజెక్టుకోసం 5 కోట్ల రూపాయలు కావాలని జగన్‌రెడ్డి అడుగుతున్నాడు– ఎలా సర్దుబాటు చేయాలో తెలియడం లేదు’’ అని పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాజశేఖరరెడ్డి తన వద్ద చెప్పుకున్నారని రాజంపేట ఎంపీగా ఉండిన సాయిప్రతాప్ ఒక సందర్భంలో చెప్పారు. ఈ సందర్భంగా ఇంకో విషయమూ చెప్పుకోవాలి. 2004లో ఎన్నికలు ముగిసిన తర్వాత రాజశేఖరరెడ్డి ఢిల్లీలో సోనియాగాంధీని కలిశారు. ఆ తర్వాత బొత్స సత్యనారాయణతో మాట్లాడుతూ, ‘ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రిని కాలేకపోతే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవలసి వస్తుంది’ అని రాజశేఖరరెడ్డి తన ఆవేదనను వెలిబుచ్చారు. అంటే ఇప్పుడు వివాదంలో ఉన్న ఆస్తులేవీ అప్పుడు లేవు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే ఆ కుటుంబానికి ఆస్తులు కొండల్లా పెరిగాయి. అవే ఆస్తులు ఇప్పుడు కుటుంబంలో చిచ్చు పెడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖరరెడ్డి అవినీతి గురించి చెన్నయ్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో కాన్సులర్‌గా పనిచేసిన డేవిడ్ హాపర్ అమెరికా ప్రభుత్వానికి పంపిన ఈ మెయిల్స్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అప్పట్లో సంచలనం సృష్టించిన వికీలీక్స్ వల్ల ఈ వ్యవహారం వెలుగుచూసింది. 2007 అక్టోబర్‌లో డేవిడ్ సదరు ఈ మెయిల్స్ పంపారు. నీటిపారుదల, గృహ నిర్మాణ రంగాలలో అవినీతి తారా స్థాయికి చేరిందని, ఈ అవినీతి వల్ల ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయాలను ఆమెరికా కంపెనీలు తీసుకోకపోవడం ఉత్తమమని డేవిడ్ స్పష్టం చేశారు. ‘భారతదేశంలో ప్రజలకు అవినీతి అలవాటైపోయింది. రాజకీయ నాయకుల అవినీతిని ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాల నుంచి తమకు ఉచితాలు అందితే చాలు అనుకొనే స్థితిలో ఉన్నారు. ఉచితాల కారణంగా రాజశేఖరరెడ్డి అవినీతిపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు.
రాజశేఖరరెడ్డి ఈ విషయాన్ని బలంగా నమ్మడం వల్లనే అవినీతికి హద్దూ అదుపూ లేకుండా పోతున్నది’ అని డేవిడ్ సెప్టెంబర్‌లో పంపిన మరో ఈ–మెయిల్‌లో పేర్కొన్నారు. ఈ విషయాలను తెలుసుకున్న అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్ నిర్ఘాంతపోయారని వికీలీక్స్ పేర్కొంది. రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అవినీతితో తనకు ఏమి సంబంధం అని జగన్‌రెడ్డి సీబీఐ అధికారులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ప్రస్తావించడం గమనార్హం! దాదాపు ఇరవై ఏళ్ల క్రితం అమెరికా కాన్సులర్ తన లేఖలో పేర్కొన్నట్టు మన దేశంలో రాజకీయ నాయకుల అవినీతిని ప్రజలు పట్టించుకోవడం లేదు. పట్టించుకొనే పరిస్థితే ఉంటే అవినీతి మార్గాలలో అంతులేని సంపదను పోగేసుకున్న జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగలరా? అయితే, ఎప్పటికైనా పాపం పండుతుంది అని అంటారు. ఇప్పుడు అవే అక్రమ ఆస్తుల కోసం కుటుంబ సభ్యులు వీధి పోరాటాలకు, న్యాయ పోరాటాలకు దిగారు.
ఇవీ జగన్ విలువలు...
ఇక్కడ రాజశేఖరరెడ్డి గురించి ఒక విషయం చెప్పుకోవాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థికి ఫలానా మొత్తాన్ని సమకూర్చవలసిందిగా తన సహచరుడికి చెప్పారు. ఆ సహచరుడు అంత మొత్తమా? అని నోరు వెళ్లబెట్టగా, మనమేమైనా మట్టి పనులు చేసి సంపాదించామా? అని రాజశేఖరరెడ్డి అన్నారట! అంటే, అడ్డదారుల్లో పోగేసుకున్న సొమ్ము విషయంలో రాజశేఖరరెడ్డి ఉదారంగా ఉండేవారన్నమాట! ఈ ఉదారత చెల్లికి ఆస్తుల పంపకం విషయంలో జగన్‌రెడ్డిలో లోపించడమే వివాదానికి కారణం! అవినీతిని ప్రజలు పట్టించుకోవడం లేదన్నది వాస్తవమే అయినా కుటుంబ విలువలు, దాతృత్వం విషయంలో జగన్‌రెడ్డి నైజాన్ని ప్రజలు ఆమోదించడం లేదు. అతనేమిటో తెలిసిపోవడం వల్లనే గత ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితం చేశారు. సంక్షేమ పథకాల మాటున అవినీతిని కప్పిపుచ్చుతున్నప్పటికీ కుటుంబంలో తలెత్తిన వివాదాలు మాత్రం జగన్‌రెడ్డికి రాజకీయంగా నష్టం చేశాయి. జగన్‌రెడ్డిలో ఉదార మనస్తత్వం ఉండి ఉంటే వేల కోట్ల సంపదను నేనొక్కడినే ఏం చేసుకుంటాను అని భావించి చెల్లికి పంచి ఇచ్చేవారు. ఇందుకు విరుద్ధంగా తన మనుషులతో ఆస్తుల గురించి మాట్లాడిస్తున్నారు. ‘కుటుంబపరమైన విభేదాలతో వైసీపీ నాయకులకు ఏం సంబంధం?’ అన్న షర్మిల ప్రశ్నలో హేతుబద్ధత ఉంది. కుటుంబ గొడవలతో పాటు వివేకానంద రెడ్డి హత్య ఉదంతం కూడా జగన్‌రెడ్డి నిజ స్వరూపాన్ని ప్రజల ముందు ఉంచింది. అయినా విలువలు, విశ్వసనీయత గురించి జగన్‌రెడ్డి గొప్పలు చెప్పుకొంటూనే ఉంటారు.
మతం... అభిమతం!
ఈ కుటుంబ కథాచిత్రాన్ని కాసేపు అటుంచితే, మతపరమైన అంశాలు కూడా జగన్‌రెడ్డిని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జగన్‌రెడ్డి హిందూ మతానికి వ్యతిరేకం అన్న భావన మెజారిటీ హిందువులలో ఏర్పడటంతో ఆయన రాజకీయ ప్రత్యర్థులు రంగంలోకి దిగి ఆయనను క్రైస్తవ మతవాదిగా ప్రచారం చేయడం మొదలెట్టారు. దీని నుంచి బయటపడటానికై గతంలో ఎన్నడూ లేని విధంగా సతీసమేతంగా జగన్ గుళ్లూ గోపురాలూ తిరుగుతున్నారు. ఉగాది పండుగరోజు పంచాంగ పఠనం కార్యక్రమంలో పాల్గొన్న జగన్‌రెడ్డి భార్య భారతిరెడ్డి కొత్తగా పాపిట సిందూరం పెట్టుకున్నారు. ఇలా పాపిట్లో సిందూరం పెట్టుకోవడం ఫక్తు హిందూ సంప్రదాయం. రాజకీయ అవసరాలకోసం మనసుకు ఇష్టం లేని పనులు చేయాల్సిన కష్టం భారతి రెడ్డికి రావడం విషాదం. తమ నాయకుడికి హిందువులు దూరం కాకూడదన్న ఉద్దేశంతో జగన్‌రెడ్డి దంపతులు గుళ్లకు వెళ్లిన ఫొటోలను ముద్రించిన కరపత్రాలను ఆయన బంటులు పంపిణీ చేస్తున్నారు. మన దేశంలో హిందూ– ముస్లింల మధ్య ఘర్షణలు జరగడం తెలిసిందే. హిందూ– క్రైస్తవుల మధ్య ఘర్షణలు జరిగిన సంఘటనలు పెద్దగా లేవు. ఆంధ్రప్రదేశ్‌లో హిందువులు, క్రైస్తవుల మధ్య సఖ్యత ఉండేది. జగన్‌రెడ్డి రాజకీయ రంగప్రవేశం తర్వాత క్రైస్తవులు, ముఖ్యంగా దళిత క్రైస్తవులు ఆయనకు ఓటు బ్యాంకుగా మారారు. అధికారంలో ఉన్నప్పుడు దళిత క్రైస్తవులను జగన్‌రెడ్డి తన రాజకీయ ప్రయోజనాలకోసం గరిష్ఠంగా వాడుకున్నారు. దళిత పాస్టర్లు కూడా జగన్‌రెడ్డి తరపున రాజకీయ ప్రచారాలు నిర్వహించేవారు. ఇప్పటికీ జగన్‌రెడ్డి పర్యటనల సందర్భంగా కొందరు దళిత క్రైస్తవుల హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో క్రైస్తవులకి, మిగతా రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా కూటమి పార్టీలకు మధ్య అంతరం అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు జగన్‌రెడ్డికి అశనిపాతం అయింది. మిగతా అన్ని మీడియా సంస్థలు ఈ తీర్పును ప్రధాన వార్తను చేసి ప్రచురించగా, జగన్‌రెడ్డి సొంత మీడియాలో మాత్రం ఆ తీర్పుకు తగిన చోటు లభించలేదంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జన్మతః దళితులు అయినవారు క్రైస్తవ మతం స్వీకరిస్తే ఎస్సీలుగా హక్కులు, ప్రయోజనాలు పొందలేరని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే ఎస్సీలుగా హక్కులు పొందుతారని స్పష్టం చేసింది. దళితులు ఆరాధ్య దైవంగా భావించే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బౌద్ధ మతం స్వీకరించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువమంది దళితులు క్రైస్తవ మతం స్వీకరించి ఆచరిస్తున్నారు. అయితే రిజర్వేషన్లతో పాటు సంబంధిత చట్టాల కింద ఇతర ప్రయోజనాలు పొందేందుకు తాము క్రైస్తవులమని అధికారికంగా ప్రకటించుకోవడం లేదు. శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు తాను హిందువునే అని నిండుసభ సాక్షిగా ప్రకటించుకోవడమే ఇందుకు నిదర్శనం. దళితులు తమను తాము క్రైస్తవులుగా ప్రకటించుకుంటే బీసీలుగా మారిపోతారు. ఆ కోటా కిందే రిజర్వేషన్లు పొందుతారు. ఈ కారణంగానే, ఏసు మాత్రమే నిజమైన దేవుడు అని ప్రకటించుకుంటూనే తాము హిందువులమని చెప్పుకుంటున్నారు. పేరులో క్రిస్టియానిటీ కనిపిస్తున్నప్పటికీ రికార్డులలో హిందువులుగానే చలామణి అవుతున్నారు.
ఇప్పటివరకు ఇది జగన్‌రెడ్డికి అనుకూలించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో తాము హిందూమతాన్నే ఆచరిస్తున్నామని రుజువు చేసుకోవాల్సిన అగత్యం క్రైస్తవులకు ఏర్పడింది. అంతేకాదు, విచ్చలవిడి మత మార్పిడులకు ఈ తీర్పు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది.
ద్వంద్వ ప్రయోజనాలు...
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వేలమంది పాస్టర్లు ఉన్నారు. వీరిలో అత్యధికులు జన్మతః దళితులే. వీరందరూ ప్రభుత్వం నుంచి ప్రతి నెలా పారితోషికం పొందుతున్నారు. ప్రభుత్వం నుంచి పారితోషికాలు పొందుతున్న దళిత పాస్టర్లకు ఇప్పుడు తంటా వచ్చి పడింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం నుంచి పారితోషికం పొందుతున్నవారు దళిత హోదాను కోల్పోతారు. ఈ సమస్యను అధిగమించాలంటే వారు తాము పాస్టర్లం కాము, మాకు ప్రభుత్వ పారితోషికం వద్దు అని ప్రకటించుకోవాలి. దళితులకు లభించే ప్రయోజనాలు ముఖ్యమా? తాము విశ్వసించే ఏసు ప్రభువు ముఖ్యమా? అని తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాస్టర్లు మాత్రమే కాదు, క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్న ఇతర దళితులకు కూడా ఇప్పుడు చిక్కులు తప్పవు. రిజర్వేషన్ల కింద ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నవారు, ఇదివరకే పొందినవారు, ఎన్నికలలో దళిత కోటా కింద సీట్లు పొందినవారు కూడా తాము క్రైస్తవులం కాము అని రుజువు చేసుకోవాల్సి రావొచ్చు. ఫలానా వ్యక్తి క్రైస్తవమతం ఆచరిస్తున్నప్పటికీ దళిత కోటా కింద ప్రయోజనాలు పొందుతున్నారని ఎవరైనా సవాలు చేస్తే చిక్కులు తప్పవు. మత మార్పిడులకు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక చట్టం చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నవేళ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కొత్త చట్టానికి మార్గం సుగమం చేసింది. ఇప్పటివరకు ఇష్టమైన మతాన్ని ఆచరిస్తూ కూడా తనది ఫలానా మతం అని చెప్పుకోకుండా గుట్టుగా దళిత కోటా ప్రయోజనాలు పొందుతున్న వారికి ఇకపై ఇక్కట్లు తప్పవు. దళిత కుటుంబాలలో జన్మించిన వాళ్లు ఇస్లాం మతం స్వీకరించిన సందర్భాలలో దళిత ప్రయోజనాలను వదులుకుంటున్నారు. తాము ముస్లిం అని ప్రకటించుకుంటున్నారు. దళిత క్రైస్తవుల విషయంలోనే ఇందుకు విరుద్ధంగా జరుగుతున్నది. క్రైస్తవులలో కులం లేనందున దళిత ప్రయోజనాలు పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
జగన్ మాటేమిటో...
మత మార్పిడి చేసుకున్న దళితులే కాదు– ఇతర కులస్తులు కూడా గుళ్లూ గోపురాలకు వెళ్లరు. తీర్థప్రసాదాలను స్వీకరించరు. జన్మతః క్రైస్తవులైన తెల్లవాళ్లు హిందూ దేవాలయాలకు నిరభ్యంతరంగా వెళతారు. తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హిందూ మతమే తమ మతమని చెప్పుకోవలసిన స్థితి దళిత క్రైస్తవులకు ఏర్పడింది.
అంబేడ్కర్ బాటలో దళితులు బౌద్ధ మతాన్ని స్వీకరించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉత్పన్నమయ్యే పరిణామాలు జగన్‌రెడ్డికి ఎలా ప్రతికూలం కాబోతున్నాయో చూద్దాం. జగన్ బలం దళిత క్రైస్తవులే అన్నది బహిరంగ రహస్యం. ఇకపై దళిత క్రైస్తవులపై రాజకీయ ప్రత్యర్థి పార్టీల నిఘా ఉంటుంది. పాస్టర్లు ఇప్పటికే అడకత్తెరలో పోకల్లా మారిపోయారు. గ్రామాలలో వైసీపీ తరపున బలంగా నిలబడి మద్దతు ఇచ్చే దళిత క్రైస్తవులపై రాజకీయ ప్రత్యర్థులు నిఘా పెడతారు. ఫలానా వాళ్లు క్రైస్తవం ఆచరిస్తున్నారని రుజువు చేయగలిగితే వాళ్లు దళిత ప్రయోజనాలు కోల్పోతారు. ఈ అస్త్రం జగన్ మద్దతుదారులైన దళిత క్రైస్తవుల పాలిట శరాఘాతం వంటిది. ప్రస్తుతం జగన్‌రెడ్డి వెంట ఉన్న అనేకమంది దళిత నాయకులు ఇప్పుడున్నంత క్రియాశీలంగా ఇకపై వ్యవహరించలేరు. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన అనేకమంది దళిత కోటా కింద రాజకీయ పదవులు అనుభవిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం అన్ని స్థాయిల్లో ఉంటుంది. ఈ కారణంగా జగన్ మద్దతుదారులు మునుపటిలా వీరంగం వేయలేరు. పరాభవ నామ సంవత్సరం జగన్‌రెడ్డికి కలసి రాదని సిద్ధాంతి ఏ ప్రాతిపదికన చెప్పారో తెలియదుగానీ, జరుగుతున్న పరిణామాలు ఆ దిశగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మతం కీలకం కాబోతున్నది. జగన్‌రెడ్డికి వ్యతిరేకంగా హిందువులను సంఘటితం చేయాలని కూటమి పార్టీలు తలపోస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందు జగన్‌రెడ్డిని ప్రజలు క్రైస్తవుడిగా పరిగణించలేదు. రాజశేఖరరెడ్డి తాను క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నట్టు పెద్దగా బయటకు తెలియకుండా జాగ్రత్తపడేవారు. దీంతో ఆయన క్రైస్తవుడని ఎవరూ భావించేవారు కారు. జగన్‌రెడ్డి ఇందుకు భిన్నంగా తనను తాను క్రైస్తవుడిగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఆయన మద్దతుదారులుగా ఉంటున్న దళిత క్రైస్తవులు కూడా తమను తాము క్రైస్తవులుగా ప్రకటించుకుంటారా? లేక హిందువులుగా చలామణి అవుతూ రహస్యంగా క్రైస్తవాన్ని ఆచరిస్తారా? అన్నది వేచి చూడాలి. సుప్రీంకోర్టు తీర్పు జగన్‌రెడ్డికే కాదు– ఆయన మద్దతుదారులకు కూడా కష్టం తెచ్చిపెట్టింది. అయినా తన పాదయాత్ర మొదలయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిరోజూ సినిమా చూపిస్తానని జగన్‌రెడ్డి హెచ్చరిస్తున్నారంటే, శాంతిభద్రతల విఘాతానికి కుట్రలు పన్నుతున్నారన్న అనుమానాలు రావడం సహజం. భయపడుతూ గడపాల్సిన మనిషే భయపెట్టేందుకు ప్రయత్నించడం ఆశ్చర్యంగా ఉంది. జగన్‌రెడ్డిలో సుగుణాలు మచ్చుకైనా లేకపోగా, భయపెట్టడంలో మాత్రం ఆయన తనకు తానే సాటి అని రుజువు చేసుకుంటున్నారు. అయితే గ్రహబలం అనుకూలంగా లేనందున ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవచ్చు.
ఆర్కే
ఇవీ చదవండి:
చిన్నారుల కోసం 'తొలి ముద్ద' పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
మెట్రో స్వాధీన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం