Share News

30 ఏళ్లకే కంటి చూపు సమస్య!

ABN , Publish Date - Mar 26 , 2026 | 09:34 AM

కంటి శుక్లాల సమస్య ఒకప్పుడు 50-60 ఏళ్ల వయసు వ్యక్తుల్లో కనిపించేంది. కానీ ఇప్పుడు 30 ఏళ్లకే దీని బారిన పడుతున్నారు. ఇటీవల ఎర్లీ ఆన్‌సెట్‌ క్యాటరాక్ట్‌ (చిన్న వయసులోనే వచ్చే శుక్లాలు) కేసులు ఎక్కువగా పెరిగాయి.

30 ఏళ్లకే కంటి చూపు సమస్య!

  • ఇటీవల పెరిగిన ఎర్లీ ఆన్‌సెట్‌ క్యాటరాక్ట్‌ కేసులు

  • ఐటీ ఉద్యోగుల్లోనే ఎక్కువ.. ముగ్గురిలో ఇద్దరికి

  • స్క్రీన్లకు అతుక్కుపోవడం, ఆరోగ్య సమస్యలే కారణం

హైదరాబాద్‌ సిటీ: కంటి శుక్లాల సమస్య ఒకప్పుడు 50-60 ఏళ్ల వయసు వ్యక్తుల్లో కనిపించేంది. కానీ ఇప్పుడు 30 ఏళ్లకే దీని బారిన పడుతున్నారు. ఇటీవల ఎర్లీ ఆన్‌సెట్‌ క్యాటరాక్ట్‌ (చిన్న వయసులోనే వచ్చే శుక్లాలు) కేసులు ఎక్కువగా పెరిగాయి. నగరంలో చాలా ఆస్పత్రుల్లో కంటి శుక్ల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారిలో యువత సంఖ్య ఎక్కువగా ఉండడం సమస్య తీవ్రతను తెలుపుతోంది.


డిజిటల్‌ యుగం.. కంటి మీద ఒత్తిడి

డిజిటల్‌ యుగంలో మన జీవితాలు సగం స్ర్కీన్‌లకే అంకితమైపోతున్నాయి. ఉద్యోగం, వినోదం కోసం మాత్రమే కాదు, పక్క గదిలోని వ్యక్తితో మాట్లాడాలన్నా మొబైల్‌ ఫోన్‌ ఆన్‌ చేయకుండా ఉండలేకపోతున్నారు. డిజిటల్‌ ఐ స్ట్రెయిన్‌ లాంటి సమస్యలు ఐటీ ఉద్యోగుల్లో అధికంగా కనిపిస్తున్నాయి. ఆ రంగంలోని ఉద్యోగుల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఎర్లీ ఆన్‌సెట్‌ క్యాటరాక్ట్‌ కేసులు దశాబ్దకాలంతో పోలిస్తే ఇప్పుడు 15-20కి పెరిగాయి.


కంప్యూటర్‌ స్క్రీన్లకు ఎర్లీ ఆన్‌సెట్‌ క్యాటరాక్ట్‌కు సంబంధం ఉందని చెప్పలేం కానీ, రోజుకు 9-10 గంటలపాటు కంప్యూటర్‌ స్ర్కీన్‌లకు అతుక్కుపోవడంతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు కారణంగా చెప్పొచ్చంటున్నారు డాక్టర్‌ రవి. విటమిన్‌ లోపంతోపాటు ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌, సీవీడీ, పొగతాగడం, మద్యం అధికంగా సేవించడం వంటివి కూడా కంటి సమస్యలకు కారమణమని చెబుతున్నారు క్యాటరాక్ట్‌ సర్జన్‌ డాక్టర్‌ నీరజ.


city5.2.jpgకారణాలను గుర్తించండి

ఇటీవల చిన్న వయసులోనే క్యాటరాక్ట్‌ రావడానికి యువీ కిరణాల బారిన పడటం కూడా ఓ కారణమే. ఆఫీసుల్లోని కృత్రిమ కాంతితో ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ లక్షణాలు పెరిగే అవకాశాలుంటాయి. నిద్రలేమి, హార్మోన్ల అసమతుల్యత కూడా సమస్యే. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులతోపాటు కంప్యూటర్‌ ఎక్కువగా వినియోగించే వారు అధిక సమయం స్ర్కీన్‌లకు కదలకుండా అతుక్కుపోవడం వల్ల రక్త సరఫరాతోపాటు ఆక్సిజన్‌ సరఫరా సరిగా జరగదు. దీని వల్ల క్యాటరాక్ట్‌ నెమ్మదిగా పెరుగుతుంది. కళ్లు మసగ్గా కనిపించడం, రాత్రి పూట కాంతిని సరిగా చూడలేకపోవడం, స్ర్కీన్‌పై ఏకాగ్రత పెట్టలేకపోవడం, తరచుగా కళ్ల జోళ్లను మార్చాల్సి రావడం వంటివి ఉంటే వెంటనే జాగ్రత్త పడాల్సి ఉంటుంది.


ఇవి పాటించండి

  • ప్రతి 20 నిమిషాల తరువాత 20 అడుగుల దూరంలోని ఏదైనా వస్తువును 20 సెకన్లపాటు చూస్తే కళ్లకు విశ్రాంతి లభించడంతోపాటు కళ్లమీద ఒత్తిడి కూడా తగ్గుతుంది.

  • ఐటీ రంగాల్లోని వారు నీలి కాంతిని అడ్డుకునే లెన్స్‌ను ధరించడం లేదంటే స్ర్కీన్‌ ఫిల్టర్లను వాడటం వల్ల హెచ్‌వీఏ కాంతి ప్రభావం తగ్గించుకోవచ్చు.

  • డిజిటల్‌ ఉపకరణాలను ఓ చేతి దూరంలో ఉంచి చూడటం మంచిది. అలాగే సరైన వెలుతురులో ఉండటం వల్ల గ్లేర్‌ కూడా తగ్గుతుంది.

  • విటమిన్‌ సీ, ఈ ల్యుటెన్‌, జియాక్సింథిన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే కంటి లోపలి ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో సహాయపడుతుంది.


వెలుతురులో పనిచేయాలి

తగిన వెలుతురులో పనిచేయడం, లేదంటే చదవడం వల్ల డిజిటల్‌ ఐ స్ట్రెయిన్‌ తగ్గుతుంది. 20-20-20 రూల్‌ అనుసరించడం చాలా మంచిది. ప్రిస్కిప్షన్‌ లేకుండా మందులను, విచ్చలవిడిగా స్టెరాయిడ్స్‌ వాడొద్దు. క్యాటరాక్ట్‌ సమస్య ఉంటే డాక్టర్‌ను వెంటనే సంప్రదించాలి.

- అనుభ రాఠీ, కన్సల్టెంట్‌ ఆప్తమాలజిస్ట్‌, ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌


ఈ వార్తలు కూడా చదవండి:

సీఎం రేవంత్‌ కేరళ పర్యటన రద్దు

ఏప్రిల్‌ 1 నుంచి చికెన్‌ షాపులు బంద్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 26 , 2026 | 09:56 AM