ప్రయాణికుల సజీవ దహనంపై దిగ్భ్రాంతి.. రాయవరానికి బయలుదేరిన హోం మంత్రి
ABN , Publish Date - Mar 26 , 2026 | 08:51 AM
మార్కాపురం సమీపంలో రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ నేపథ్యంలో ఘటన జరిగిన ప్రదేశానికి హోం మంత్రి అనిత హుటాహుటిన బయలుదేరారు.
అమరావతి, మార్చి 26: మార్కాపురం సమీపంలో రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు సజీవ దహనమైన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడితోపాటు ఆయన కేబినెట్ సహచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి కావడం అత్యంత విషాదకరమని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ దుర్ఘటనలో పలువురు సజీవదహనం కావడంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తక్షణమే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా ఉన్నతాధికారులను మంత్రి అదేశించారు.
ఈ ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందగానే.. హుటాహుటిన విజయవాడ నుంచి రాయవరానికి హోం మంత్రి అనిత బయలుదేరారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని బాధిత కుటుంబాలకు ఈ సందర్భంగా మంత్రి అనిత భరోసా ఇచ్చారు. ఈ ప్రమాద ఘటన కారణంగా చేపట్టిన సహాయక చర్యలను మంత్రి అనిత ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.
ఆ వార్తలు కలచివేస్తున్నాయి: మంత్రి రాంప్రసాద్
ఈ ప్రమాదంలో పలువురు సజీవదహనం కావడం చాలా బాధాకరమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రోడ్డు ప్రమాదాల వల్ల నిండు ప్రాణాలు కోల్పోవడం చాలా విషాదకరమన్నారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు సేకరించాలని వారికి సూచించారు. మృతుల సంఖ్య పెరగ వచ్చంటూ వస్తున్న వార్తలు తనను కలచివేస్తున్నాయని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
డ్రైవర్లు ప్రయాణాల్లో నిబంధనలు పాటించాలి: మంత్రి సవిత
రాయవరం వద్ద ప్రమాద ఘటనలో మృతుల ఆత్మలకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. 13 మంది ప్రయాణికులు సజీవ దహనం కావడంపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కటుంబాలకు అండగా ఉంటామన్నారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు సేకరించి.. వాటిని వారి బంధువులకు తెలియపర్చాలని మార్కాపురం జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశించినట్లు తెలిపారు. ప్రయాణాల్లో నిబంధనలు పాటించాలని డ్రైవర్లకు సూచించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలంటూ బస్సు డ్రైవర్లకు స్పష్టం చేశారు. బస్సుల్లో ప్రయాణికులను జాగ్రత్తగా గమ్యస్థానాలకు చేర్చేలా చూడాలని వారిని మంత్రి సవిత కోరారు.
బాధితులకు సహాయ చర్యలు ముమ్మరం చేయాలి: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
సజీవ దహనం ఘటన తీవ్ర ఆవేదనకు గురి చేసిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలకల క్వారీల వద్ద టిప్పర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని జిల్లా అధికారులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. ఘటనాస్థలిలో బాధితులకు సహాయ చర్యలు ముమ్మరం చేయాలని మంత్రి సూచించారు.
ప్రభుత్వం అండగా ఉంటుంది: గొట్టిపాటి రవికుమార్
ఈ ప్రమాద ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంపై సమాచారం అందింన వెంటనే అధికారులు, స్థానిక ఎమ్మెల్యేతో మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను మంత్రి గొట్టిపాటికి అధికారులు వివరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బస్సులో ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారకరమన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన తన సానుభూతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని మంత్రి గొట్టిపాటి తెలిపారు.
అత్యంత విషాదకరం: మంత్రి ఆనం
టిప్పర్‌ను ఢీకొట్టడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి కావడం అత్యంత విషాదకరమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో పలువురు సజీవదహనం కావడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తక్షణమే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను అదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలను పూర్తిగా పరిశీలించి నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.
బాధితులకు భరోసా కల్పించాలి: మంత్రి సత్యకుమార్
మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని.. అందుకోసం వారు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వైద్య నిపుణులను పంపించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. బాధితులకు భరోసా కల్పించాలని ఉన్నతాధికారులకు మంత్రి సత్య కుమార్ సూచించారు.
ఆయా కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి: టీజీ భరత్
రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం ఎంతో బాధ కలిగించిందని టీజీ భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కలచివేసింది: మంత్రి అచ్చెన్నాయుడు
మార్కాపురం జిల్లాలో బస్సు ప్రమాదంపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులు సజీవ దహనం కావడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి: పీవీఎన్ మాధవ్
మరికొద్దిసేపటికి స్వస్థలాలకు చేరుకోవాల్సిన ప్రయాణీకులు సజీవ దహనం కావడం మాటలకు అందని విషాదమని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తెలిపారు. క్షతగాత్రులకు సహకారం అందించాలని ప్రకాశం జిల్లా బీజేపీ నేతలను ఆదేశించామన్నారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని.. వారి కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నదిలో పడిన బస్సు.. 23 మంది మృతి
ప్రకాశం జిల్లా రాయవరం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
For More AP News And Telugu News