ఘోర రోడ్డు ప్రమాదం.. స్పందించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
ABN , Publish Date - Mar 26 , 2026 | 08:14 AM
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలో టిప్పర్, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని 13 మంది మృతిచెందారు. ఈ ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అమరావతి, మార్చి 26: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలో టిప్పర్, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని 13 మంది మృతిచెందారు. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్, బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే సంబంధిత అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై సమాచారం అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం నిర్మల్ నుంచి ఏపీలోని నెల్లూరుకు వెళ్తున్న హరికృష్ణ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగినట్లు సీఎంకు జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో 20 మందిని తక్షణమే వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని వివరించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
'రాయవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం తీవ్రంగా కలచివేసింది. టిప్పర్- ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలవడం బాధాకరం. క్షతగాత్రులకు అవసరమైన వైద్యసాయంపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. మృతుల కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా' అని మంత్రి లోకేశ్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
రైల్వే స్టేషన్‌లో నకిలీ పాముతో యువకుడి హల్‌చల్.. వీడియో వైరల్
రోజుకు 8000 ట్యాంకర్లు..