హెచ్ విటమిన్ చేసే మాయ ఏమిటి?
ABN , Publish Date - Nov 15 , 2026 | 12:57 PM
విటమిన్ హెచ్ అంటే ఏమిటి? ఇది ఏయే ఆహార పదార్థాల్లో లభిస్తుంది?
విటమిన్ హెచ్ అంటే ఏమిటి? ఇది ఏయే ఆహార పదార్థాల్లో లభిస్తుంది?
కృతి, హైదరాబాద్
బీ కాంప్లెక్స్ విటమిన్లలో ఒకటైన బయోటిన్‌నే విటమిన్ హెచ్ అని కూడా అంటారు. మనం తీసుకునే ఆహారంలోని కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, మాంసకృత్తులను శరీరానికి అవసరమైన శక్తిగా మార్చడంలో బయోటిన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే చర్మం, జుట్టు, గోళ్ల ఆరోగ్యాన్ని కాపాడటానికి, శరీరంలోని కణాల సాధారణ పనితీరుకు సహాయపడుతుంది. బయోటిన్ గుడ్డు పచ్చసొన, బాదం, వేరుశనగ, ఆక్రోట్ (వాల్‌నట్స్), పొద్దుతిరుగుడు గింజలు, సోయాబీన్స్, పప్పులు, చిలగడదుంప, బ్రకోలీ, పుట్టగొడుగులు లాంటి ఆహారాల్లో లభిస్తుంది. కాలేయం లాంటి అవయవ మాంసాల్లో కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా సమతుల్యమైన ఆహారం తీసుకునే వారిలో బయోటిన్ లోపం చాలా అరుదు. బయోటిన్ లోపం ఉన్నప్పుడు జుట్టు పలుచబడటం, చర్మంపై దద్దుర్లు రావడం, గోళ్లు బలహీనపడటం లాంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే ఈ లక్షణాలు ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు. కాబట్టి జుట్టు రాలుతోందని లేదా గోళ్లు విరుగుతున్నాయని సొంతంగా బయోటిన్ మాత్రలు వాడకూడదు. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలి. ముఖ్యంగా అధిక మోతాదులో బయోటిన్ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల కొన్ని రక్త పరీక్షల ఫలితాలను తప్పుగా చూపించే అవకాశం ఉంది.
నాకు 40 ఏళ్లు. నా హిమోగ్లోబిన్ స్థాయులు తక్కువగా ఉన్నాయని చెప్పారు. హిమోగ్లోబిన్ పెరగడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి?
వసుంధర, చిత్తూరు
హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటానికి రక్తహీనత, పోషకాహారలోపం, కాలేయ సంబంధ వ్యాధులు, మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు, గర్భం దాల్చడం కారణాలు కావచ్చు. హిమోగ్లోబిన్ బాగా తక్కువగా ఉన్నప్పుడు కేవలంఆహారంలో మార్పులతో దానిని పెంచడం సాధ్యం కాదు. మందులు (సప్లిమెంట్లు)వాడాలి. అయితే మందులతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే హిమోగ్లోబిన్ మళ్లీ తగ్గకుండా ఆరోగ్యకరంగా స్థిరపడేలా చూసుకోవచ్చు. సాధారణంగా హిమోగ్లోబిన్ పెరగడానికి ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. మాంసాహారులైతే కోడి, చేపలాంటివి వారానికి కనీసం మూడుసార్లు తీసుకుంటే తగినంత ఐరన్ లభిస్తుంది. శాకాహారులైతే అన్నిరకాల పప్పులు, నల్ల శనగలు, అలసందలు, ఉలవలు, సోయా బీన్స్, చిక్కుళ్లు మొదలైన గింజలను రోజూ తీసుకోవాలి. ఇంకా ప్రతిపూటా తోటకూర, పాలకూర, గోంగూరలాంటి ఆకుకూరలు తప్పనిసరి. పైన చెప్పిన ఆహారంలో ఐరన్‌తో పాటుగా ఫోలిక్ యాసిడ్ కూడా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ శాతం ఆరోగ్యకరంగా మెరుగవడం సాధ్యమవుతుంది. ఐరన్ సప్లిమెంట్లు తీసుకుంటున్నట్లయితే వాటిని ఉదయాన్నే పరగడుపునే తీసుకోవాలి.
ఓట్స్‌లో ఉండే పోషక విలువలు ఏమిటి? చిన్నపిల్లలకు కూడా ఓట్స్ పెట్టవచ్చా? వాటిని ఏ వయసు నుంచి, ఎలా ఇవ్వాలి?
శీతల్, ఆదిలాబాద్
ఓట్స్‌లో పిండి పదార్థాలు, పీచు పదార్థం, కొంతమేర మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే బీటా-గ్లూకాన్ అనే కరిగే పీచు పదార్థం రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ (ఔఈఔ) స్థాయులను తగ్గించడంలో, రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉండటానికి సహాయపడుతుంది. అలాగే కడుపు నిండిన భావనను ఎక్కువసేపు కలిగించి ఆకలిని నియంత్రిస్తూ బరువు నియంత్రణలోనూ తోడ్పడుతుంది. ఓట్స్‌లో థయామిన్ (విటమిన్ ఆ1), మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్ లాంటి పోషకాలు లభిస్తాయి. వీటిని జావ, ఉప్మా, కిచిడీ, రొట్టెల రూపంలో తయారు చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా ఓట్స్ పెట్టవచ్చు. సాధారణంగా ఆరు నెలల వయసు నుంచి అనుబంధ ఆహారంలో భాగంగా, బాగా ఉడికించి మెత్తగా చేసిన ఓట్స్‌ను తక్కువ పరిమాణంలో ఇవ్వవచ్చు. అయితే ఓట్స్ మాత్రమే కాకుండా పిల్లల ఎదుగుదలకు అవసరమైన మాంసకృత్తులు, ఐరన్, ఇతర పోషకాలు అందేలా పప్పులు, కూరగాయలు, పండ్లులాంటి వివిధ ఆహారాలనూ చేర్చాలి. చక్కెర, ఉప్పు కలపకుండా సాధారణ ఓట్స్‌ను ఎంచుకోవడం మంచిది.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.com కు పంపవచ్చు)
ఈ వార్తలు కూడా చదవండి:
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News