ఈ మ్యూజియం... అత్యుత్తమం...
ABN , Publish Date - Nov 15 , 2026 | 10:00 AM
చరిత్రను కళ్ల ముందుంచే పురావస్తు సంపదకు నిలయం. ఆకట్టుకునే నిర్మాణశైలి, అడుగడుగునా సంస్కృతిని ప్రతిబింబించే కళాసౌధం.
చరిత్రను కళ్ల ముందుంచే పురావస్తు సంపదకు నిలయం. ఆకట్టుకునే నిర్మాణశైలి, అడుగడుగునా సంస్కృతిని ప్రతిబింబించే కళాసౌధం. ఇటీవల ప్రపంచంలోని అత్యుత్తమ మ్యూజియాల జాబితాలో తొమ్మిదో స్థానం దక్కించుకున్న ‘బిహార్ మ్యూజియం’ విశేషాలివి...
జర్మనీకి చెందిన డిజిటల్ మ్యాగజైన్ ‘వర్త్ ఎ జర్నీ’ 2026 సంవత్సరానికిగాను ప్రపంచం లోని 100 అత్యుత్తమ మ్యూజియాల జాబి తాను ఇటీవల విడుదల చేసింది. ఇందులో పాట్నాలోని ‘బిహార్ మ్యూజియం’ తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుంది. ఆసియాలోనైతే మొదటి స్థానంలో నిలిచింది. న్యూయార్క్‌లోని ‘మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్,’ ప్యారి స్‌లోని ‘మ్యూసీ డు లూవ్రే’ వంటి ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియాలను సైతం వెనక్కి నెట్టి తొమ్మిదో స్థానంలో నిలవడం విశేషం.
ఎన్నెన్నో విశేషాలు...
ఈ అత్యుత్తమ మ్యూజియంలో ఏముందో తెలుసా? రాతియుగం నుంచి ఆధునిక కాలం వరకు చరిత్రను కళ్లకు కట్టినట్టు చూడొచ్చు. శిల్పాలు, నాణేలు, తాళపత్ర గ్రంథాలు, జానపద కళాఖండాల ద్వారా చరిత్రను తెలుసుకోవచ్చు. 2015లో ప్రారంభమైన ఈ మ్యూజియం ప్రాచీన భారతీయ వారసత్వాన్ని... ఆధునిక ప్రపంచ నిర్మాణశైలితో అనుసంధానిస్తూ రూపుదిద్దుకుంది.
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ ఫుమిహికో మాకీ, ముంబైకి చెందిన ఓప్లిస్ ఆర్కిటెక్ట్స్‌తో కలిసి ఈ మ్యూజియాన్ని రూపొందించారు. మొత్తం క్యాంపస్ 13 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. భారతదేశ ప్రాచీన లోహశాస్త్ర సంప్రదాయాలను గుర్తు చేసే విధంగా చేపట్టిన ఈ పర్యావరణహిత నిర్మాణం ఓ అద్భుతం. ఇందులో ఉన్న పురావస్తు సంపదలో అత్యంత ముఖ్యమైనది దిదార్‌గంజ్ యక్షి శిల్పం. ఈ శిల్పం మౌర్యుల కాలానికి చెందినది. వేల ఏళ్లు గడిచినా శిల్పం మెరుపు చెక్కు చెదరకపోవడం విశేషం. దీంతో పాటు కుర్కిహార్‌కు చెందిన అరుదైన కాంస్య విగ్రహాలు, చారిత్రక గ్రంథాలు, శతాబ్దాల నాటి బౌద్ధ శిల్పాలు కూడా ఇక్కడ ఉన్నాయి.
పిల్లల కోసం ప్రత్యేకంగా...
ఈ మ్యూజియంలో పిల్లల కోసం ప్రత్యేక గ్యాలరీ ఉంది. ఇందులో జానపద కళలు, సంస్కృతి, విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన అంశాలను ప్రదర్శిస్తుంటారు. పిల్లలు ప్రతీ విషయాన్ని ఆసక్తితో తెలుసుకునేలా ఈ గ్యాలరీని రూపొందించారు. వన్యప్రాణులు, చరిత్ర, కళలు, సంస్కృతి, అన్వేషణ వంటి విభిన్న అంశాలను పిల్లలు ఆసక్తిగా తెలుసుకునేందుకు ఇక్కడ అవకాశం ఉంది. చిన్నారుల్లో కొత్తవిషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాసను పెంపొందించడం ఈ గ్యాలరీ ప్రత్యేకత. మ్యూజియాన్ని చూసిన సందర్శకులు అక్కడే ఉన్న రెస్టారెంట్‌లో బిహారీ సంప్రదాయ వంటకాల రుచిని ఆస్వాదించొచ్చు. ఇక మ్యూజియం నిర్మాణశైలి కూడా సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఇండోర్ గ్యాలరీలు, విశాలమైన ప్రాంగణాలు, పచ్చని తోటలతో సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది.
వడపోత తర్వాతే ర్యాంకింగ్
‘వర్త్ ఎ జర్నీ’ సంస్థ వివిధ దేశాల్లోని పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన ర్యాంకింగ్ జాబితాను ప్రచురిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సేకరించిన డేటాను విశ్లేషించి ప్రత్యేక అల్గారి థమ్ ఆధారంగా ఈ ర్యాంకింగ్స్‌ను రూపొం దిస్తుంది. తొలుత ఎంపిక చేసిన మ్యూజియా లను సంస్థ ప్రతినిధులు ప్రత్యక్షంగా సంద ర్శించి పరిశీలిస్తారు. క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించిన అంశాలు ప్రారంభ ర్యాంకింగ్స్‌కు భిన్నంగా ఉంటే, తిరిగి సర్దుబాటు చేసి తుది ర్యాంకులను నిర్ణయిస్తారు.
ఈసారి మెక్సికోకు చెందిన ‘మ్యూసియో నేషనల్ డి ఆంత్రో పాలజియా’ మ్యూజియం మొదటి స్థానాన్ని దక్కించుకుంది. మెక్సికో నగరంలో ఉన్న ఈ మ్యూజియంలో మానవశాస్త్రం, దేశంలోని ప్రాచీన నాగరి కతలకు సంబంధించిన విశేషాలు చూడొచ్చు. స్పెయిన్‌లోని ‘మ్యూసియో డెల్ ప్రాడో’ రెండో స్థానంలో నిలవగా, డెన్మార్క్‌లోని ‘లూసియానా మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్’ మూడో స్థానాన్ని, రష్యాలోని ‘స్టేట్ హెర్మిటేజ్ మ్యూజియం’ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఇలాంటి మహా మ్యూజియాల సరసన బిహార్ మ్యూజియం నిలవడం మనకు గర్వకారణమే కదా.
ఈ వార్తలు కూడా చదవండి:
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
శ్రీవారి రూపాన్ని గీసిన తొలి చిత్రకారుడు కన్నుమూత
Read Latest AP News And Telangana News And International News And Telugu News