Share News

పేపర్‌, ఫ్యాబ్రిక్‌ లైట్లతో ఇంటికి కొత్త అందం!

ABN , Publish Date - Nov 15 , 2026 | 09:10 AM

‘ఆ షాపింగ్‌ మాల్‌కి వెళ్లావా, లోపల లైట్ల అమరికను చూడడానికైనా అక్కడికి వెళ్లాలి’, ‘ఆ హోటల్‌లో యాంబియన్స్‌ భలేగా ఉంటుంది.

పేపర్‌, ఫ్యాబ్రిక్‌ లైట్లతో ఇంటికి కొత్త అందం!
Fabric Lighting

‘ఆ షాపింగ్‌ మాల్‌కి వెళ్లావా, లోపల లైట్ల అమరికను చూడడానికైనా అక్కడికి వెళ్లాలి’, ‘ఆ హోటల్‌లో యాంబియన్స్‌ భలేగా ఉంటుంది. రకరకాల లైట్లతో భలే లుక్‌ తెచ్చారు,’ ‘నేనైతే ఆ స్వీట్‌ షాపు పైకప్పునకు వేలాడదీసిన లైట్లను చూడడానికే వెళుతుంటాను.’. సుబోధ్‌ వాళ్ల ఇంటినంతా రీమోడలింగ్‌ చేశాడు, గోడల థీమ్‌తో పోటీపడేలా ప్రతీ గదిలో లైట్లను అమర్చారు... మునుపెన్నడూ లేనంతగా ఈమధ్య అందరి మాటల్లో లైట్లకు సంబంధించిన మాటలు దొర్లుతున్నాయి. పేపర్‌, ఫ్యాబ్రిక్‌లతో రూపొందిస్తున్న కొత్త దీపాల మాయ ఇది.

ఎప్పుడో పండగలు, వేడుకల సమయాల్లో ఇంటిని అలంకరించుకోవడం పాత పద్ధతి. ఇప్పుడు ఇల్లు ఎప్పుడైనా ఆర్ట్‌ డైరెక్టర్‌ సెట్టింగ్‌లా కళకళలాడాలని అందరూ కోరుకుంటున్నారు. కస్టమైజ్డ్‌ సోఫాలు కుషన్లు, కర్టెన్లు, డిజైనర్‌ తలుపులూ, కిటికీలు, షోకేస్‌ ఆర్టికల్స్‌... ఇంకా లైట్లు, ల్యాంపులు. అన్నీ ఓకే కానీ లైట్లు, ల్యాంపుల్లో కూడా డిజైనర్‌ రకాలా అంటే ఆధునిక గృహాలంకరణ శాస్త్రం ఎంతో అవసరం అని చెబుతోంది.


అభిరుచికి తగ్గట్టుగా...

ఇంట్లో లైట్లు అనగానే సీసా బుడ్డి బల్బులు, పొడవాటి ట్యూబ్‌లైట్లు గుర్తుకు వస్తాయి. కానీ ఇప్పుడు ఆధునిక ఇళ్లలో వీటి స్థానంలో ఆర్ట్‌ పీసులు వచ్చేశాయి. విచ్చుకున్న గులాబీ రేకుల మధ్యలో బల్బు, పుట్టగొడుల్లాంటి ఆకారంలో లైట్లు, ఇంకా తేనెతుట్టె, ముత్యాలు, పువ్వులు, ఆకులు.. ఇలా ఒకటేమిటి ఎన్నో అందమైన ఆకారాల్లో. ఇనుము, గాజుతో పాటు రకరకాల ఆకృతుల కోసం పేపర్‌, ఫ్యాబ్రిక్‌లను ఉపయోగించి నేడు సరికొత్తగా దీపాలను రూపొందిస్తున్నారు.


book3.jpgవాస్తవానికి లైటింగ్‌ ప్రపంచంలో పేపర్లు, ఫాబ్రిక్‌లను వాడడం ఎప్పటి నుంచో ఉంది. కార్తీకమాసంలో బాల్కనీల్లో కార్తీక దీపాల్ని వేలాడదీయడం చాలామంది ఇళ్లల్లో చూస్తుంటాం. రంగురంగుల వస్త్రంపై ఎంబ్రాయిడరీ చేసిన బుట్టల్లో ఎలక్ట్రిక్‌ దీపాలను వెలిగించడం ఎప్పటి నుంచో ఉంది. అయితే ఆధునిక డిజైనర్లు ఇంకాస్త ఎక్కువగా ఆలోచించి ఊహలకు అందని అలంకరణల దివ్వెలను తీసుకువస్తున్నారు. దీనికి హస్తకళలు, ఆధునిక సాంకేతిక నైపుణ్యం, వస్త్ర నిర్మాణంతో ప్రయోగాలే కారణం. దీని వల్ల దీపాలు కూడా శిల్పాకృతుల్లా మారుతున్నాయి. ప్రకృతి సిద్ధమైన ఆకృతుల్లోంచి వీటిని రూపొందిస్తున్నారు. అందుకే లైటింగ్‌కు కళలకూ మధ్య భేదమే లేదనిపిస్తుంది. ఈ సంప్రదాయేతర దీపాకృతుల వల్ల గదుల లుక్‌ మారడమే కాదు, వెలుగులు అవసరం మేర పరుచుకుని, నూతనత్వం ప్రస్ఫుటం అవుతోంది. అభిరుచులకు తగినట్లుగా చాలామంది తమ ఇళ్లను ఈ సృజనాత్మక కొత్త కాంతులతో నింపేస్తున్నారు.


ప్రకృతే స్ఫూర్తి

విశాలమైన హాలు లేదా వరండాలో పైకప్పు నుంచి తేనెతుట్టె లాంటి దీపాకృతి లోంచి వెలుగులు పడుతుంటే... మీ సోఫాల పక్కన పుట్టగొడుల్లాంటి దీపాలు రకరకాల రంగుల్లో, సైజుల్లో ఉంటే... మెట్ల పక్కన వింతైన దీపాలు... అలాగే ప్రతీ బెడ్‌రూమ్‌ గోడలు, పైకప్పు మీద ఇలాంటి అందమైన విశేష ఆకృతుల దీపాలను తీర్చిదిద్దితే... ఎంత అందంగా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. లైట్లు అంటే వెలుతురు, నీడే కాదు... కళ కూడా కలిస్తే ఇలాంటి అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. ఈ ఆకృతులన్నింటికీ స్ఫూర్తి ప్రకృతే అని వేరే చెప్పక్కర్లేదు. ప్రకృతిలోని ఆకులు, మొలకలు, పుట్టగొడుగులు, సాలె గూళ్లు, పూలగుత్తి.. తదితరాలను లైట్‌ డిజైనర్లు సవివరంగా అధ్యయనం చేస్తారు. వాటి పెరుగుదల, పనితీరును అర్థం చేసుకుని వివిధ దీపాకృతులను అలా తయారు చేయడానికి పూనుకుంటున్నారు.


ఈ దీపాల తయారీలో నేడు పేపర్‌, ఫ్యాబ్రిక్‌ ప్రధాన వనరులుగా మారాయి. కారణం దీపాల స్వరూపమే. కచ్చితమైన ఆకృతుల కోసం సహజసిద్ధమెన అరటి ఫైబర్‌, పేపర్‌, వాషి పేపర్‌, జ్యూట్‌, చెరకుతో పాటు రా సిల్క్‌, పాప్లిన్‌ ఫైబర్‌లను కూడా ఉపయోగిస్తున్నారు. ఇలా వివిధరకాల ఫైబర్‌ల వల్ల విశేషమైన ఆకృతులు తీసుకు వచ్చేందుకు కృషిచేస్తున్నారు. మౌల్డింగ్‌, లేయరింగ్‌, వీవింగ్‌, ఫ్యాబ్రిక్‌ మౌంటింగ్‌, క్రోషెట్‌, మాక్రోమ్‌ లాంటి పద్ధతులతో దీపాకృతుల్లో ప్రయోగాలు చేస్తున్నారు. ఫ్యాబ్రిక్‌ లైటింగ్‌లో ఆకృతులే ప్రధానమైనవి. కలప, మెటల్‌ మాత్రమే కాకుండా మరింత విభిన్నమైన ఆకృతుల దీపాలను కోరుకుంటున్నారు. అందుకే డిజైనర్లు వివిధ వస్త్రాలపై ఎంబ్రాయిడరీలు, హస్త కళల అచ్చులను కూడా ముద్రిస్తూ ప్రత్యేకమైన దీపాలను రూపొందిస్తున్నారు.

 Fabric Lighting


ఈ దీపాలు కేవలం దీపాలు కాదు. రాత్రి పూట లైట్లు వేసినప్పుడు అద్భుతమైన లోకాన్ని ఆవిష్కరిస్తాయి. అదే లైట్లు వేయని ఉదయం వేళల్లో ఇంటి అందాన్ని శోభాయమానంగా మారుస్తాయి. ఇంట్లోనా లేక ఏదైనా ఉద్యానవనంలో వున్నామా అన్నట్టుగా విస్మయపరుస్తాయి. అంటే రాత్రి వెలుగులు, పగలు సొబగులు అన్న మాట. ఈ అలంకరణ దీపాల వల్ల ఇలా రెండు విధాలుగా ఉపయోగాలు ఉన్నాయన్న మాట. అందుకే నేడు దీపాలు ఇంటి అలంకరణలో విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రతీ ఒక్కరూ తమ ఇళ్లల్లో ఇలాంటి వెలుగుల కోసమే ప్రయత్నిస్తున్నారంటే అతిశయోక్తికాదు.

అందుకే ఈ విలక్షణమైన లైట్లకు ఆన్‌లైన్‌లో ఆర్డర్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. లైట్స్‌ ఇచ్చే కాంతుల్లో ఇంత కాలం జీవించాం. లైట్‌ వేస్తే ఇల్లంతా కాంతిమయం అవుతుంది. కానీ ఆ లైట్ల వెలుగుల్లో జీవితాన్ని ఆస్వాదించాలని, కొత్త అనుభూతిని సొంతం చేసుకోవాలనే స్పృహ ఇప్పుడిప్పుడే మొదలైంది. నేడు ఈ ఆధునిక కాంతులు ఆయా వ్యక్తుల అభిరుచులను చెప్పకనే చెప్పే ఓ అందమైన ప్రకటన. కాదంటారా?


సురక్షితమా ? కాదా?

దీపం అంటేనే వెలుగు, దాంతో పాటు వేడి ఉంటుందని మనకు తెలుసు. మరి ఇంతటి వేడి పదార్థాలను కాగితం, వస్త్ర అమరికల్లో బంధించడం ఎంత వరకు సమంజసం. ప్రమాదాల అంచు వరకూ వెళ్లడమే కదా అనే వాళ్లూ లేకపోలేదు. అయితే విద్యుత్‌ భాగాలు, పదార్థాల ఎంపిక, ఉష్ణ నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, వివిధ దీపాలను తయారుచేసి, వాటిని పరీక్షించిన తరవాతే మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు. కాబట్టి ఇవి సురక్షితమైనవేనని పేర్కొంటున్నారు. పైగా వీటి నిర్వహణ కూడా ఎంతో సులభం. తడిగుడ్డలతో తుడిచే అవసరం లేదు. పొడి గుడ్డ లేదా బ్రష్‌తో వీటి మీద పడే దుమ్మూ ధూళిని తుడిచేయవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

శ్రీవారి రూపాన్ని గీసిన తొలి చిత్రకారుడు కన్నుమూత

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 15 , 2026 | 09:34 AM