టెక్నాలజీపై న్యాయవాదులకు పట్టుండాలి
ABN , Publish Date - Nov 15 , 2026 | 05:19 AM
న్యాయశాస్త్రంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపైనా పట్టు సాధించాలని న్యాయ విద్యార్థులు, న్యాయవాదులకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచించారు.
నిస్సహాయుల పక్షాన నిలబడి సత్యాన్ని సమర్థించాలి
న్యాయవిద్యార్థులు, న్యాయవాదులకు మాజీ రాష్ట్రపతి కోవింద్ సూచన
ఆంధ్రా వర్సిటీలో జస్టిస్ కె.రామస్వామి స్మారకోపన్యాసం
విశాఖపట్నం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): న్యాయశాస్త్రంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపైనా పట్టు సాధించాలని న్యాయ విద్యార్థులు, న్యాయవాదులకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ న్యాయ కళాశాల శనివారం ఉదయం విశాఖ బీచ్‌రోడ్డులోని కన్వెన్షన్ హాలులో జస్టిస్ కె.రామస్వామి స్మారకోపన్యాస కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ‘డిజిటల్ యుగంలో న్యాయవాద వృత్తి-అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌కు కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిస్సహాయుల పక్షాన నిలబడుతూ, భయం లేకుండా సత్యాన్ని సమర్థిస్తూ, న్యాయ వెలుగులు అందరిపై ప్రకాశవంతంగా, సమానంగా ప్రసరించేలా చూడాలని న్యాయవిద్యార్థులు పిలుపునిచ్చారు.
జస్టిస్ కె.రామస్వామి జీవిత ప్రయాణం, ఆయన చేసిన కృషి న్యాయ వ్యవస్థకు ముఖ్యమైన నైతిక దిక్సూచిగా నిలుస్తాయన్నారు. ప్రస్తుతం డిజిటల్ సాధనాలు, ఏఐ జీవితంలోని ప్రతి రంగాన్ని సమూలంగా మారుస్తున్నాయన్నారు. జిల్లా కోర్టులోని సాధారణ న్యాయవాదికి కూడా కార్పొరేట్ న్యాయవాదికి ఉన్నంత డిజిటల్ వనరులు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు.
సాధారణ పౌరుడు కూడా ఈ డిజిటల్ న్యాయ వ్యవస్థను ఉపయోగించుకునేలా సాధికారిత కల్పించాలని సూచించారు. సాంకేతికతను ఆచరణాత్మకంగా ఉపయోగించి వర్ధమాన న్యాయవాదులను సిద్ధం చేయడం ద్వారా న్యాయ కళాశాలలు కూడా ఆధునికతను సంతరించుకోవాలని చెప్పారు. ఏయూ వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ, ఏయూలో చదువుకున్న జస్టిస్ కె.రామస్వామి అత్యున్నత న్యాయ స్థానాల్లో చారిత్రక తీర్పులను అందించిన న్యాయమూర్తిగా ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు.
జస్టిస్ రామస్వామి కుమారుడు, సీనియర్ ఐఏఎస్ అధికారి, భారత ప్రభుత్వ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. కోవింద్ ఉపన్యాసం ఆంధ్ర వర్సిటీకి, పూర్వ, ప్రస్తుత విద్యార్థులకు, అధ్యాపకులకు గౌరవప్రదమైన విషయమన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ పులిపాటి కింగ్, రిజిస్ర్టార్ ప్రొఫెసర్ కె.రాంబాబు, అవుట్‌రీచ్ విభాగ డీన్ ప్రొఫెసర్ కె.రమాసుధ, ప్రిన్సిపాల్స్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఏయూ న్యాయ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించే ప్రో బోన్ క్లబ్ (న్యాయ బంధు)ను రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు.
ఈ వార్తలనూ చదవండి:
జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం