Share News

కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం

ABN , Publish Date - Nov 15 , 2026 | 12:33 AM

Municipal battle in Srikakulam after 16 years అధికారమంతా తమ గుప్పిట్లోనే ఉండాలన్న స్వార్థంతో గత పాలకులు శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీనియర్‌ మంత్రిగా చెప్పుకున్న వ్యక్తి శ్రీకాకుళం నగర అభివృద్ధిని గాలికి వదిలేశారని మండిపడ్డారు.

కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం
ఏపీఎన్జీవో రాష్ట్ర మాజీ సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తం, వైసీపీ నాయకులను టీడీపీలోకి ఆహ్వానిస్తున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శంకర్‌

గత ప్రభుత్వ పాలనలో స్వప్రయోజనాల కోసం ఎన్నికల అడ్డగింపు

16 ఏళ్ల తర్వాత శ్రీకాకుళానికి మునిసిపల్‌ పోరు

అఖండ విజయాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కు కానుకగా ఇద్దాం

పార్టీ శ్రేణులకు మంత్రి అచ్చెన్నాయుడు పిలుపు

టీడీపీలో చేరిన 400 వైసీపీ కార్యకర్తలు

శ్రీకాకుళం, నవంబర్‌ 14(ఆంధ్రజ్యోతి): అధికారమంతా తమ గుప్పిట్లోనే ఉండాలన్న స్వార్థంతో గత పాలకులు శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీనియర్‌ మంత్రిగా చెప్పుకున్న వ్యక్తి శ్రీకాకుళం నగర అభివృద్ధిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. ‘16ఏళ్ల తర్వాత జరగనున్న శ్రీకాకుళం కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూటమి జెండాను ఎగురేద్దాం. కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, బీజేపీ నాయకత్వానికి కానుకగా అందించాల’ని శ్రేణులకు మంత్రి అచ్చెన్న పిలుపునిచ్చారు. శనివారం శ్రీకాకుళంలోని టీడీపీ కార్యాలయంలో కార్పొరేషన్‌ ఎన్నికల.. ఎన్డీఏ కూటమి సన్నాహక సమావేశం నిర్వహించారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘గత వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను సైతం పక్కదారి పట్టించారు. నగరంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ ఆటంకాలు సృష్టించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే శ్రీకాకుళం నగర రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. శ్రీకాకుళాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతాం. రహదారుల విస్తరణతోపాటు, రూ.40 కోట్లతో నగరంలో మోడల్‌ సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఇంటికీ 24 గంటలపాటు స్వచ్ఛమైన తాగునీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్‌’ పథకం ద్వారా మంజరైన రూ.100 కోట్లతో అరసవల్లి ఆలయాన్ని నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో అభివృద్ధి చేస్తాం. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ముంపు సమస్యకు పీపీపీ మోడల్‌ ద్వారా శాశ్వత పరిష్కారం చూపుతామ’ని తెలిపారు.

కూటమి ఐక్యతతో..

‘శ్రీకాకుళం కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్‌కు ముగ్గురు, నలుగురు ఆశావహులు ఉన్నారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం, అర్హతలను బట్టి అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎవరిని ప్రకటించినా కూటమి శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి అభ్యర్థులను గెలిపించాల’ని మంత్రి అచ్చెన్న కోరారు. నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని దిశానిర్దేశం చేశారు. కేంద్ర, రాష్ట్ర మంత్రుల సమక్షంలో వైసీపీకి చెందిన సుమారు 400 మంది కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తామని మంత్రులు భరోసా ఇచ్చారు. టీడీపీలో చేరిన వారిలో ఏపీఎన్జీవో మాజీ రాష్ట్ర సహాధ్యక్షులు చౌదరి పురుషోత్తమనాయుడు, వైసీపీ నాయకులు గురుగుబెల్లి లోకనాథం, చౌదరి సతీష్‌, డాక్టర్‌ పైడి మహేశ్వరరావు, పి.రమణ, రాజారావు తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 15 , 2026 | 12:33 AM