Share News

ఆజాద్‌-ఒవైసీ పొత్తుతో ఎవరికి నష్టం?

ABN , Publish Date - Nov 15 , 2026 | 03:18 AM

వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న యూపీలో.. అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం, చంద్రశేఖర్‌ ఆజాద్‌ సారథ్యంలోని ఆజాద్‌ సమాజ్‌ పార్టీ..

ఆజాద్‌-ఒవైసీ పొత్తుతో ఎవరికి నష్టం?

  • వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. పొత్తుతో బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలే అవకాశం

  • ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమికి 15-20 సీట్లలో నష్టం?

న్యూఢిల్లీ, నవంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న యూపీలో.. అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం, చంద్రశేఖర్‌ ఆజాద్‌ సారథ్యంలోని ఆజాద్‌ సమాజ్‌ పార్టీ (కాన్షీరామ్‌) మధ్య కుదిరిన పొత్తు కీలకమైన రాజకీయ పర్యవసానాలకు దారితీయవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పొత్తు వల్ల మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ కొత్తగా నష్టపోయేది ఏమీ లేనప్పటికీ సమాజ్‌వాదీపార్టీ-కాంగ్రెస్‌ కూటమికి నష్టం వాటిల్లవచ్చని అభిప్రాయపడుతున్నాయి. ఒవైసీ-ఆజాద్‌ పొత్తు వల్ల బీజేపీ వ్యతిరేక పార్టీలకు 15-25 సీట్లలో నష్టం కలగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

పశ్చిమ, తూర్పు యూపీలో ప్రభావం

యూపీలో మాయావతి పలుకుబడి గణనీయంగా క్షీణించినందున.. బీఎస్పీకి బలమైన దన్నుగా ఉన్న దళితులు ఆజాద్‌వైపు మొగ్గు చూపవచ్చంటున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని నగీనా నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన చంద్రశేఖర్‌ ఆజాద్‌కు దళితులు, ముస్లింలు కలిసికట్టుగా ఓటు వేశారు. ఇదే ఫార్ములాను ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఒవైసీతో చేతులు కలిపారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆజాద్‌ సమాజ్‌ పార్టీ (కాన్షీరామ్‌), ఎంఐఎంలకు కలిపి 0.62 శాతం ఓట్లు మాత్రమే రాగా ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీల ఫ్రంట్‌ 5 శాతానికిపైగా ఓట్లను సాధించవచ్చన్న అంచనాలున్నాయి. ముఖ్యంగా ముస్లింలు అధికంగా ఉన్న పశ్చిమ, తూర్పు యూపీల్లో ఈ ఇరుపార్టీల కూటమి పలు నియోజకవర్గాల్లో ప్రభావం చూపించే అవకాశం ఉంది. బిహార్‌లోని సీమాంచల్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 5 సీట్లను గెల్చుకుంది. యూపీలోనూ ఈ తరహా ఫలితాలు సాధించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.


పట్టుదలగా అఖిలేశ్‌ యాదవ్‌

పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న అఖిలేశ్‌ యాదవ్‌.. ఈసారి ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం-యాదవ్‌ ఓటర్లపై ఎక్కువగా దృష్టి పెట్టిన ఎస్పీ.. ఈసారి అన్ని వర్గాలనూ కలుపుకొని పోయేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలనిచ్చిన ‘బీసీ, ఎస్సీ, మైనారిటీల ఐక్యత’ అన్న వ్యూహాన్నే తిరిగి అనుసరించటానికి యత్నిస్తోంది. అదే సమయంలో అగ్రకులాల ఓటర్లను కూడా ఆకర్షించేందుకు ఆ సామాజికవర్గాలకు చెందిన నేతలకు అఖిలేశ్‌ యాదవ్‌.. ఎస్పీలో కీలకమైన పదవులు కట్టబెట్టారు. ఆజాద్‌, ఒవైసీ పొత్తుతో ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమికి నష్టం వాటిల్లుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, ఆజాద్‌-ఒవైసీలతో చేతులు కలపటానికి అఖిలేశ్‌ ససేమిరా అంటున్నారు. కాగా, పోటీ హోరాహోరీగా మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు ఎన్ని ఎక్కువ సీట్లు కేటాయిస్తే ఎస్పీకి అంత భారం కావచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి యూపీలో కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్న నియోజకవర్గాల్లో కూడా పెద్దగా ఓట్లు పడలేదు. కేవలం మూడు సీట్లలోనే 10-15 శాతం మధ్య ఓట్లు రాగా, 75 సీట్లలో ఒక్క శాతం కంటే తక్కువ ఓట్లు పడ్డాయి. దాదాపు 58 సీట్లలో మజ్లిస్‌ పార్టీయే కాంగ్రెస్‌ కంటే ఎక్కువ ఓట్లు సాధించింది.

Updated Date - Nov 15 , 2026 | 03:19 AM