Share News

మెటాకు భారీ షాకిచ్చిన ఇటలీ.. రూ.7,400 కోట్ల జరిమానా..

ABN , Publish Date - Nov 15 , 2026 | 09:18 AM

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటాకు ఇటలీలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వినియోగదారుల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను యాక్సెస్ చేసినట్లు ఆరోపణలు రావడంతో మెటాకు ఇటలీ డేటా పరిరక్షణ సంస్థ భారీ జరిమానా విధించింది.

మెటాకు భారీ షాకిచ్చిన ఇటలీ.. రూ.7,400 కోట్ల జరిమానా..
Italy Meta Fine

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటాకు ఇటలీలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వినియోగదారుల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను యాక్సెస్ చేసినట్లు ఆరోపణలు రావడంతో మెటాకు ఇటలీ డేటా పరిరక్షణ సంస్థ భారీ జరిమానా విధించింది. ఏకంగా 805 మిలియన్ యూరోలు (సుమారు రూ.7,400 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. ఆండ్రాయిడ్ యాప్‌లోని ఓ ప్రత్యేక ఫీచర్ ద్వారా ఈ ఉల్లంఘన జరిగినట్లు అధికారులు వెల్లడించారు (Italy Meta Fine).


ఫేస్‌బుక్ ఆండ్రాయిడ్ యాప్‌లో 2023 నుంచి 'గెట్ సజెషన్స్ ఫ్రమ్ గ్యాలరీ వెన్ బ్రౌజింగ్ ఫేస్‌బుక్' అనే ఫీచర్ అందుబాటులో ఉంది. వినియోగదారులు ఫేస్‌బుక్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు వారి ఫోన్ గ్యాలరీలోని ఫొటోలు, వీడియోలను పోస్టులుగా పెట్టేందుకు ఈ ఫీచర్ సూచనలు ఇస్తుంది. అయితే ఈ ఫీచర్‌ను ఉపయోగించుకుని వినియోగదారుల ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలు, వాటికి సంబంధించిన ఇతర సమాచారాన్ని ప్రత్యేకమైన అనుమతి తీసుకోకుండానే యాక్సెస్ చేసినట్లు ఇటలీ అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని కూడా వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయలేదని పేర్కొన్నారు (FB Privacy Violation).


ఈ వ్యవహారంతో ఇటలీలో దాదాపు 2 కోట్ల మంది ఆండ్రాయిడ్ వినియోగదారులు ప్రభావితమై ఉండవచ్చని డేటా పరిరక్షణ సంస్థ అంచనా వేసింది (User Photo Access). ఈ ఉల్లంఘన నేపథ్యంలో మెటాకు ఇటలీ అధికారులు పలు ఆదేశాలు జారీ చేశారు. ఫోన్ గ్యాలరీ నుంచి ఫొటోలు, వీడియోలను సూచించే ఫీచర్‌ను ముందుగా నిలిపివేయాలని స్పష్టం చేశారు. దాన్ని ఉపయోగించాలనుకునే వారి నుంచి ప్రత్యేకంగా, స్పష్టంగా అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. ఈ మార్పులు చేసేందుకు మెటాకు 60 రోజుల గడువు ఇచ్చారు. ఇటలీ విధించిన జరిమానాపై మెటా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నియంత్రణ సంస్థ నిర్ణయంతో తాము ఏకీభవించడం లేదని, విధించిన జరిమానా అసమానంగా ఉందని పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

కాల్పుల భయం.. పాకిస్థాన్‌లోని రహస్య స్థావరాలకు హఫీజ్ సయీద్, మసూద్ అజర్‌..


ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 15 , 2026 | 09:35 AM