గుండెలోని బాధకు ఓ టెలిఫోన్ బూత్
ABN , Publish Date - Nov 15 , 2026 | 11:19 AM
నీకు గుర్తుందా? ఆ రాత్రి మనిద్దరికీ పెద్ద గొడవైంది. నువ్వు రాత్రంతా బాధపడుతూనే ఉన్నావ్. నేను గమనించినప్పటికీ సారీ చెప్పలేకపోయా, పప్పులో కారం ఎక్కువైందని పెద్ద రభస చేసిన మరుగుజ్జుని నేను.
‘నీకు గుర్తుందా? ఆ రాత్రి మనిద్దరికీ పెద్ద గొడవైంది. నువ్వు రాత్రంతా బాధపడుతూనే ఉన్నావ్. నేను గమనించినప్పటికీ సారీ చెప్పలేకపోయా, పప్పులో కారం ఎక్కువైందని పెద్ద రభస చేసిన మరుగుజ్జుని నేను. నన్ను క్షమించవూ...’
‘మనం ఎన్ని కలలు కన్నాం... ఓ చిన్న పొదరింటిలో గువ్వల్లా జీవితాంతం ఉండిపోవాలని అనుకున్నాం కదా. నువ్వు ఇలా మధ్యలో ఒంటరిగా నన్ను వదలి వెళ్లిపోతే నేనేమైపోవాలి. ఈ ప్రపంచాన్ని ఎలా ఎదుర్కోవాలి?’
‘అయిదో తరగతి నుంచి ప్రాణస్నేహితులం. ఎక్కడికైనా కలిసే వెళ్లేవాళ్లం. మొన్నే కదా సంబరంగా నీ అరవయ్యో పుట్టినరోజు చేసుకున్నాం. దేవుడు అప్పుడే నిన్ను తీసుకెళ్లిపోయాడంటే నమ్మలేకపోతున్నా. రోజూ ఉదయం ఫోన్ చేసేదెవరూ, వాకింగ్‌కి వచ్చేదెవరూ... నిన్ను తలచుకోని క్షణం లేదురా... మిస్ యూ రా...’
ఈ టెలిఫోన్ బూత్‌లో గుండెను బరువెక్కించే ఇలాంటి సంభాషణలే జరుగుతుంటాయి. వాస్తవానికి ఆ ఫోన్‌కు ఏ కనెక్షన్ ఉండదు. ఎవరికీ ఫోన్ చేయలేం, మాట్లాడలేం. కానీ జనాలు మాత్రం క్యూ కడుతుంటారు. లోపలికి వెళ్లి ఫోన్ తీసుకుని గంటల తరబడీ తమ బాధను తీర్చుకుంటారు. అదే ‘విండ్ ఫోన్’. ప్రస్తుతం 17 దేశాల్లోని 400 ప్రాంతాల్లో ఈ ఫోన్లను ఏర్పాటుచేశారు. ఆకస్మికంగా మరణించిన సన్నిహితులకు మనసులోని బాధను తెలియజేయడానికి ఇదో సాధనంగా భావిస్తున్నారు.
జపాన్‌లోని ఓత్సూచీ నగరంలో తొలి విండ్‌ఫోన్‌ను ఇటారు ససాకి అనే వ్యక్తి తన తోటలో ఏర్పాటుచేసుకున్నారు. క్యాన్సర్ కారణంగా మరణించిన తన కజిన్‌తో మనసారా మాట్లాడాలన్నది ఆయన ఉద్దేశం. రోజూ అక్కడ కూర్చుని ఆ ఫోన్‌లో తన దుఃఖాన్నంతా తెలియజేసేవాడు. అక్కడి గాలి ఆ మాటలను పోగేసి, తన కజిన్‌కు చేరవేస్తుందనే ఆశ అతడిది. 2011లో వచ్చిన సునామీ వల్ల అక్కడ ఎంతో మంది మరణించారు. తనలా బాధపడుతోన్న మరెందరికో సాంత్వన కలిగించాలనే ఉద్దేశంతో తన విండ్‌ఫోన్ బూత్‌లోకి ఆ ఊరి వాళ్లకూ అనుమతి ఇచ్చాడు. క్రమక్రమంగా 30 వేల మంది ఈ ఫోన్‌ను వినియోగించుకున్నారట. మరణించినవారితో స్వయంగా మాట్లాడలేకపోయినా... తమ మనసులోని దుఃఖాన్ని తెలియజేస్తూ చాలామంది ఊరట చెందుతున్నారు. ఈ విషయం క్రమక్రమంగా ఇతర ప్రాంతాలకూ పాకి, ఈ తరహా విండ్‌ఫోన్‌లు ప్రాచుర్యంలోకి వచ్చాయి. కొత్తొక వింత అంటే ఇదే కదా!
ఈ వార్తలు కూడా చదవండి:
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News