‘మిట్టీ కేఫ్’... కూసింత ‘స్పెషల్’!
ABN , Publish Date - Nov 15 , 2026 | 10:35 AM
ఓ వ్యాపార నమూనాను కేవలం లాభార్జన కోసమే కాకుండా, దానికి సేవా దృక్పథం జోడిస్తే... ఈ ఆలోచనతోనే యువ కెరటం అలీనా ఆలం ‘మిట్టీ కేఫ్’ స్థాపించింది.
ఓ వ్యాపార నమూనాను కేవలం లాభార్జన కోసమే కాకుండా, దానికి సేవా దృక్పథం జోడిస్తే... ఈ ఆలోచనతోనే యువ కెరటం అలీనా ఆలం ‘మిట్టీ కేఫ్’ స్థాపించింది. అదిప్పుడు ఆత్మన్యూనతతో బతికే మనుషుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే గొప్ప వేదికగా నిలుస్తోంది!
బెంగళూరుకు చెందిన అలీనా ఆలం అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో మాస్టర్స్ చేసింది. కాలేజీ రోజుల్లోనే సమాజంలో దివ్యాంగుల పట్ల వివక్షను గమనించారు. వాళ్లు సానుభూతిని కోరుకోవడం లేదనీ, తమ కాళ్లపై తాము నిలబడే ఆత్మగౌరవాన్నీ, గౌరవ మర్యాదలనూ కోరుకుంటున్నారనీ గుర్తించారు. దివ్యాంగులను వ్యాపారంలో భాగస్వాములను చేస్తూ కేఫ్ నడపాలనే ఆలోచన చేశారామె.
కొందరు ఆత్మీయుల ఆర్థిక సహకారంతో హుబ్లి (కర్ణాటక)లోని బీవీబీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ క్యాంపస్‌లో 2017లో చిన్న రేకుల షెడ్డులో ‘మిట్టీ కేఫ్’ను ప్రారంభిం చారు. అప్పటికి ఆమె వయసు 23 ఏళ్లే! అది విజయవంతమైన కేఫ్‌గానే కాకుండా... దివ్యాంగుల హక్కులకు సంబంధించిన అవగాహన కేంద్రంగానూ ఎదిగింది. నాలుగేళ్లలో కర్ణాటలోని వివిధ ప్రాంతాల్లో 17 బ్రాంచీలు ఏర్పడ్డాయి.
దివ్యాంగులు, మానసిక సమస్యలతో సత మతమవుతున్నవారికి ధైర్యం చెప్పి, తగిన శిక్షణ ఇచ్చి ఈ కేఫ్‌లలో ఉపాధి కల్పించడం ప్రారంభించారు అలీనా. నలుగురిలోకి రావ డానికి భయపడిన వ్యక్తులు కొన్ని నెలల్లోనే బిల్లింగ్ కౌంటర్ల వద్ద వినియోగదారులతో ధైర్యంగా మాట్లాడటం ఆమె గమనించిన అతి పెద్ద మార్పు.
దేశవ్యాప్త విస్తరణ
క్రమంగా ‘మిట్టీ కేఫ్’ శాఖలు విస్తరించాయి. బెంగళూరు, ముంబయి, లక్నో విమానాశ్ర యాల్లో, సుప్రీంకోర్టు ఆవరణలో, రాష్ట్రపతి భవన్, గుజరాత్ హైకోర్టు, ఐఐఎం బెంగళూరుల్లో, యాక్సెంచర్, గూగుల్, ఇన్ఫోసిస్ లాంటి బహుళజాతి సంస్థల్లో శాఖలు ఏర్పాటయ్యాయి. దేశ వ్యాప్తంగా 47 అవుట్‌లెట్లతో పెద్ద గొలుసుకట్టు సంస్థగా వృద్ధి చెందింది. వాటిల్లో వందలాది దివ్యాంగులకు గౌరవప్రదమైన ఉద్యోగాలు లభించగా, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా దక్కింది. గత ఏడాదిఅక్టోబరులో నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడి మిట్టీ కేఫ్‌ను సందర్శించారు. సిబ్బంది వృత్తి నైపుణ్యం, సాధికారతలను ఆయన ప్రశంసించారు.
దివ్యాంగులకే పూర్తి బాధ్యతలు
ఈ కేఫ్‌ను అన్ని శాఖల్లో కలిపి ప్రత్యేక అవసరాలున్న 250 మందికి పైగా వ్యక్తుల బృందం నడుపుతోంది. ఇప్పటివరకూ కోటికి పైగా భోజనాలను అందించడం, రెండు లక్షల గిఫ్ట్ బాక్సులను రూపొందించడం... సిబ్బంది అంకిత భావానికీ, నిబద్ధతకూ నిదర్శనం.
వంటశాల నుంచి బిల్లింగ్ కౌంటర్ వరకూ.. చెఫ్‌లూ, సర్వర్లూ, మేనేజర్లూ అందరూ శారీరక, మేధాపరమైన సమస్యలున్నవారే. దృష్టిలోపం ఉన్నవారు స్పర్శ ద్వారా, వినికిడి సమస్య ఉన్నవారు సంజ్ఞల ద్వారా కస్టమర్లతో అనుసంధానమయ్యే తీరు కేఫ్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది. బ్రెయిలీ లిపిలో మెనూ కార్డులు, వినికిడి లోపం ఉన్నవారితో సంభాషించడానికి ప్రత్యేక సైన్ లాంగ్వేజ్ బోర్డులు, రంగుల ఆధారంగా వస్తువులను గుర్తించే కోడింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఈ చొరవ ప్రత్యేక అవసరాలున్న వ్యక్తుల పట్ల సమాజ దృక్పథాన్ని మార్చడానికి దోహదపడుతోంది. వారికి సమాన అవకాశాలూ, గౌరవం లభించాలనే భావనను ప్రోత్సహిస్తోంది.
ప్రతిష్ఠాత్మక అవార్డులు
‘మిట్టీ కేఫ్’ ప్రగతి వెనకున్న చోదక శక్తి అలీనా ఆలం. దివ్యాంగులను సమాజంలో కలుపుకుపోవడానికీ, వారి ఉపాధిని ప్రోత్సహించడానికీ ఆమె చేసిన అద్భుత కృషికి గానూ ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకుంది. సమాజంపై ఈ కేఫ్ చూపిన సానుకూల ప్రభావాన్ని ప్రస్తుతిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత ఏడాది కేఫ్ ఉద్యోగులను సత్కరించారు. ‘ఫోర్బ్స్ అండర్ 30 ఆసియా’ జాబితాలో స్థానం దక్కటంతో అలీనా ఆలం గ్లోబల్ గుర్తింపు పొందారు.
నీతి అయోగ్ -విమెన్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా అవార్డు, యునైటెడ్ నేషన్స్ ఇంటర్ కల్చరల్ ఇన్నొవేషన్ అవార్డు లాంటివి లభించాయి. ‘‘దివ్యాంగులు ఎవరి దయాదాక్షిణ్యాల కోసమో ఎదురు చూడటం లేదు. వారికి కావాల్సింది... గౌరవంతో కూడిన అవకాశం. వారికి సరైన శిక్షణ, పనికి తగ్గ వాతావరణం కల్పిస్తే.. వారు ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తారు’’ అని ఆమె అనుభవపూర్వకంగా చెబుతున్నారు. వ్యాపార విజయం బ్యాంకు బ్యాలెన్స్‌లో మాత్రమే కాకుండా... ఎందరి జీవితాల్లో ఆత్మగౌరవాన్ని నింపామనే దానిపై కూడా ఆధారపడి వుంటుందనడానికి అలీనా ప్రస్థానమే గొప్ప ఉదాహరణ.
ఈ వార్తలు కూడా చదవండి:
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News