Share News

అండర్-19 ఆసియా కప్ భారత్ సొంతం.. యువ క్రీడాకారులపై గంభీర్ ప్రశంసలు

ABN , Publish Date - Nov 15 , 2026 | 12:21 PM

అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత యువ క్రికెటర్లు అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఈ విజయంపై యువ ఆటగాళ్లను ప్రశంసిస్తూ గంభీర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది.

అండర్-19 ఆసియా కప్ భారత్ సొంతం.. యువ క్రీడాకారులపై గంభీర్ ప్రశంసలు
Gautam Gambhir

ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 15: పాకిస్థాన్‌పై భారత యువ క్రికెటర్లు అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. శనివారం జరిగిన అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్లో చివరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఈ పోరులో టీమిండియా ఒక్క వికెట్ తేడాతో గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ అద్భుత విజయంపై భారత సీనియర్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. యువ ఆటగాళ్లను ప్రశంసిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.


గంభీర్ ఎక్స్ పోస్ట్..

'భయమెరుగని ఆట.. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. పోరాట పటిమకు బ్యాటింగ్ ఆర్డర్‌తో సంబంధం లేదు..! ఆసియా ఛాంపియన్లుగా నిలిచారు. అద్భుతం కుర్రాళ్లూ!' అంటూ గౌతమ్ గంభీర్ తన సోషల్ మీడియా పోస్టులో యువ ఆటగాళ్లను అభినందించారు. కాగా, అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 338 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. ఛేదనలో భారత జట్టు ఒక దశలో 252 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే మనాల్ చౌహాన్, మొహిత్ ఉల్వా అద్భుతంగా పోరాడారు.


ముఖ్యంగా మొహిత్ ఉల్వా 26 బంతుల్లో అజేయంగా 49 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరి బంతికి బౌండరీ సాధించడంతో భారత్ 339 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. దీంతో భారత్ తొమ్మిదోసారి అండర్-19 ఆసియా కప్‌ను కైవసం చేసుకున్నట్లు అయ్యింది. ఈ సందర్భంగా చివరి వరకు పోరాడిన యువ ఆటగాళ్లను గంభీర్ ప్రశంసించడం క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మరోవైపు, సోషల్ మీడియాలో ఆయన ఎక్స్ పోస్టు వైరల్‌గా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి

లక్ష్యసేన్ చరిత్రాత్మక విజయం.. జపాన్ మాస్టర్స్ టైటిల్ కైవసం

పాక్‌ను పడగొట్టి.. ఆసియాను జయించి

Updated Date - Nov 15 , 2026 | 12:43 PM