Share News

పాక్‌ను పడగొట్టి.. ఆసియాను జయించి

ABN , Publish Date - Nov 15 , 2026 | 05:07 AM

ఇండో-పాక్‌ సమరం మరోసారి అసలు సిసలు క్రికెట్‌ మజాను పంచింది. అత్యంత ఉత్కంఠగా సాగిన ఫైనల్‌ ఫైట్‌లో.. ఆఖరి బంతికి పాక్‌కు పంచ్‌ ఇచ్చిన యువ భారత్‌...

పాక్‌ను పడగొట్టి.. ఆసియాను జయించి

  • అండర్‌-19 ఆసియాకప్‌ విజేత భారత్‌

  • ఫైనల్లో పాకిస్థాన్‌ చిత్తు

  • ఆఖరి బంతికి అద్భుత విజయం

  • మోహిత్‌ ‘హీరో’చిత ఇన్నింగ్స్‌

ఇండో-పాక్‌ సమరం మరోసారి అసలు సిసలు క్రికెట్‌ మజాను పంచింది. అత్యంత ఉత్కంఠగా సాగిన ఫైనల్‌ ఫైట్‌లో.. ఆఖరి బంతికి పాక్‌కు పంచ్‌ ఇచ్చిన యువ భారత్‌, అండర్‌-19 ఆసియా కప్‌ను దక్కించుకుంది. 338 పరుగుల భారీ ఛేదనలో ఓ దశలో 252/8తో ఓటమి అంచున నిలిచిన భారత్‌కు.. మోహిత్‌ ‘హీరో’చిత పోరాటంతో ఆపద్భాందవుడయ్యాడు. ఇక, చివరి బంతికి 3 రన్స్‌ కావాల్సిన వేళ ఫోర్‌ బాది జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు.

అల్‌ అమీరత్‌ (ఒమన్‌): హోరాహోరీగా సాగిన థ్రిల్లింగ్‌ ఫైట్‌.. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఓటమి అంచున నిల్చున్న యువ భారత్‌.. మోహిత్‌ ఉల్వ (26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 నాటౌట్‌) ‘హీరో’చిత పోరాటంతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌కు ఝలక్‌ ఇస్తూ అండర్‌-19 ఆసియా కప్‌ను ఎగరేసుకుపోయింది. గత ఏడాది టైటిల్‌ ఫైట్‌లో ఎదురైన ఓటమికి కసిగా బదులుతీర్చుకొంది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్‌ ఒక వికెట్‌ తేడాతో డిఫెండింగ్‌ చాంప్‌ పాక్‌పై అద్భుత విజయం సాధించింది. తొలుత పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 337/9 స్కోరు చేసింది. ఉస్మాన్‌ ఖాన్‌ (107) శతకంతో అదరగొట్టగా, అబ్దుల్‌ ఖాదిర్‌ (80), కెప్టెన్‌ ఫర్హాన్‌ యూసఫ్‌ (63) అర్ధ సెంచరీలతో రాణించారు. పేసర్లు కావ్య పరేష్‌ పటేల్‌ నాలుగు, చిగురుపాటి వెంటక మూడు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో భారత్‌ 50 ఓవర్లలో 339/9 స్కోరు చేసి గెలిచింది. లక్ష్య రాయ్‌చందానీ (80), ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ (58), మనల్‌ చౌహాన్‌ (47) రాణించారు. రిజ్వానుల్లా 3 వికెట్లు దక్కించుకొన్నాడు. మోహిత్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా, ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచారు.

4-sports.jpg


ఆఖర్లో హైడ్రామా ఇలా..

భారీ ఛేదనలో భారత్‌ 42 ఓవర్లలో 252/8తో పీకల్లోతు కష్టాల్లో పడింది. చివరి 8 ఓవర్లలో విజయానికి 86 పరుగులు.. 2 వికెట్లు మాత్రమే చేతిలో ఉండడంతో ఇక ఓటమి లాంఛనమేనని అనిపింది. ఈ దశలో మనల్‌, మోహిత్‌ తొమ్మిదో వికెట్‌కు 57 రన్స్‌ జోడించడంతో.. లక్ష్యం చివరి మూడు ఓవర్లలో 30 పరుగులకు దిగొచ్చింది. కానీ, 48వ ఓవర్‌లో మనల్‌ను అవుట్‌ చేసిన నికాబ్‌ ఒత్తిడి పెంచాడు. చివరి 12 బంతుల్లో 25 రన్స్‌ అవసరం కాగా.. చిగురుపాటి వెంకట (11 నాటౌట్‌)తో కలసి మోహిత్‌ అద్భుతం చేశాడు. ఆఖరి ఓవర్‌లో గెలుపునకు 8 పరుగులు కావాల్సి ఉండగా.. తొలి 5 బంతుల్లో స్పిన్నర్‌ హుస్సేన్‌ 5 పరుగులే ఇచ్చాడు. దీంతో చివరి బంతికి నెగ్గాలంటే భారత్‌కు 3 రన్స్‌ కావాల్సిన తరుణంలో.. మోహిత్‌ బౌండ్రీ బాది భారత్‌ను సంబరాల్లో ముంచెత్తాడు. అంతకుముందు ఓపెనర్లు లక్ష్య, సెహ్వాగ్‌ తొలి వికెట్‌కు 95 పరుగులతో నిలకడైన ఆరంభాన్నిచ్చినా.. స్కోరు బోర్డుకు ఆశించిన ఊపు నివ్వలేక పోయారు. ధాటిగా ఆడే ప్రయత్నంలో వినీత్‌ (24), అర్జున్‌ (16), యశ్‌బర్దన్‌ (9) పెవిలియన్‌ చేరారు. లక్ష్యను అలీరెజా క్యాచవుట్‌ చేయగా.. అన్వయ్‌ ద్రవిడ్‌ (19) రనౌట్‌ కావడంతో అంతటా నైరాశ్యం. కానీ, లోయరార్డ్డర్‌ బ్యాటర్లు మనల్‌, మోహిత్‌, వెంకట అనూహ్యంగా జట్టును ఓటమి కోరల్లోంచి బయటకు లాగారు.

రాణించిన టాపార్డర్‌..: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న పాకిస్థాన్‌కు ఓపెనర్లు ఉస్మాన్‌, హయం ఖాన్‌ (21) తొలి వికెట్‌కు 62 పరుగులతో శుభారంభం అందించారు. హయంను కావ్య అవుట్‌ చేసినా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఖాదిర్‌ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఖాదిర్‌ను అర్జున్‌ అవుట్‌ చేయగా.. సెంచరీ పూర్తి చేసుకొన్న ఉస్మాన్‌ను కూడా కావ్య వెనక్కిపంపాడు. అప్పటికి పాక్‌ 36 ఓవర్లలో 240/3తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఫర్హాన్‌ ధాటిగా ఆడుతూ 300 మార్క్‌ దాటించాడు. డెత్‌ ఓవర్లలో కావ్య, వెంకట వికెట్లు పడగొట్టినా.. అప్పటికే పాక్‌ భారీ స్కోరు చేసింది.


స్కోరు బోర్డు

పాకిస్థాన్‌: ఉస్మాన్‌ (సి) అర్జున్‌ (బి) కావ్య పరేష్‌ 107, హయమ్‌ (సి) ద్రవిడ్‌ (బి) కావ్య పరేష్‌ 21, ఖాదిర్‌ (సి) వినీత్‌ (బి) అర్జున్‌ 80, ఫర్హాన్‌ (సి) ఆర్యన్‌ (బి) వెంకట 63, అహ్మద్‌ (సి) ఆర్యవీర్‌ (బి) వెంకట 17, హమ్జా (సి) మోహిత్‌ (బి) కావ్య పరేష్‌ 10, హస్నైన్‌ (సి) చౌహాన్‌ (బి) వెంకట 2, సయ్యామ్‌ (రనౌట్‌) 7, నిఖబ్‌ (బి) కావ్య పరేష్‌ 11, రిజ్వానుల్లా (నాటౌట్‌) 4, అలీ రజా (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 50 ఓవర్లలో 337/9; వికెట్ల పతనం: 1-62, 2-197, 3-240, 4-299, 5-305, 6-311, 7-317, 8-332, 9-336; బౌలింగ్‌: మోహిత్‌ 8-0-57-0, కావ్య పరేష్‌ 10-0-68-4, చిగురుపాటి వెంకట 5-0-40-3, మనల్‌ చౌహాన్‌ 3-0-40-0, ఆర్యన్‌ 7-0-36-0, యశ్‌వర్దన్‌ 6-0-35-0, అర్జున్‌ 7-0-43-1, వినీత్‌ 4-0-14-0.

భారత్‌: లక్ష్య (సి) దర్‌ (బి) అలీ 80, ఆర్యవీర్‌ (సి) ఉస్మాన్‌ (బి) నిఖబ్‌ 58, వినీత్‌ (సి) ఉస్మాన్‌ (బి) రిజ్వానుల్లా 24, అర్జున్‌ (సి) హమ్జా (బి) రిజ్వానుల్లా 16, యశ్‌వర్దన్‌ (సి) ఉస్మాన్‌ (బి) దర్‌ 9, అన్వయ్‌ (రనౌట్‌) 19, మనల్‌ (సి) ఉస్మాన్‌ (బి) నిఖబ్‌ 47, ఆర్యన్‌ (సి) హయమ్‌ (బి) రిజ్వానుల్లా 9, కావ్య పరేష్‌ (సి) హమ్జా (బి) సయ్యామ్‌ 0, మోహిత్‌ (నాటౌట్‌) 49, వెంకట (నాటౌట్‌) 11, ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: 50 ఓవర్లలో 339/9; వికెట్ల పతనం: 1-95, 2-146, 3-172, 4-186, 5-217, 6-217, 7-251, 8-252, 9-309; బౌలింగ్‌: అలీ 10-0-65-1, సయ్యామ్‌ 10-0-79-1, రిజ్వానుల్లా 10-0-53-3, నిఖబ్‌ 10-0-57-2, అహ్మద్‌ హుస్సేన్‌ 5-0-38-0, హస్నైన్‌ అబ్బాస్‌ దర్‌ 5-0-39-1.

‘ప్లేయర్‌ ఆప్‌ ది సిరీస్‌’ ఆర్యవీర్‌ సెహ్వాగ్‌

10-sports.jpg

9

భారత్‌కిది తొమ్మిదో ఆసియా కప్‌ టైటిల్‌. ఇక, రెండుసార్లు రన్నరప్‌గా నిలిచింది.

ఈ వార్తలనూ చదవండి:

జెన్సన్ హువాంగ్ రీఎంట్రీకి ప్రయత్నాలు.. మద్దతుగా మస్క్

ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో కమ్యూనికేషన్ సమస్య.. అమెరికాలో విమాన సేవల నిలిపివేత..

Updated Date - Nov 15 , 2026 | 05:07 AM