Share News

లక్ష్యసేన్ చరిత్రాత్మక విజయం.. జపాన్ మాస్టర్స్ టైటిల్ కైవసం

ABN , Publish Date - Nov 15 , 2026 | 10:32 AM

భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ మరోసారి తన సత్తా చాటాడు. జపాన్ గడ్డపై అద్భుతమైన ఆటతీరుతో చరిత్ర సృష్టించాడు. జపాన్ మాస్టర్స్-2026 సూపర్ 500 టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుని, ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు.

లక్ష్యసేన్ చరిత్రాత్మక విజయం.. జపాన్ మాస్టర్స్ టైటిల్ కైవసం
Japan Masters 2026

కుమామోటో: భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ మరోసారి తన సత్తా చాటాడు. జపాన్ గడ్డపై అద్భుతమైన ఆటతీరుతో చరిత్ర సృష్టించాడు. జపాన్ మాస్టర్స్-2026 సూపర్ 500 టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుని, ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో జపాన్ ఆటగాడు కోకి వతనాబేపై 13-21, 21-18, 21-14 తేడాతో లక్ష్యసేన్ విజయం సాధించాడు.


తొలి గేమ్‌లో కోకి వతనాబే చెలరేగిపోయాడు. వేగవంతమైన షాట్లతో ఆధిపత్యం ప్రదర్శించాడు. 13-21తో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే, ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోని భారత షట్లర్ రెండో గేమ్‌లో అద్భుతంగా పుంజుకున్నాడు. కీలక పాయింట్ల వద్ద సంయమనం పాటిస్తూ, ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చాడు. చివరకు 21-18తో రెండో గేమ్‌ను గెలుచుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక మలుపు తిప్పాడు. మూడో గేమ్‌లో లక్ష్యసేన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ వతనాబేపై ఒత్తిడి పెంచాడు. వరుస పాయింట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తూ 21-14తో మూడో గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో 13-21, 21-18, 21-14తో మ్యాచ్‌ను గెలిచి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.


జపాన్ మాస్టర్స్ విజయం లక్ష్యసేన్‌కు టైటిల్‌తో పాటు కీలక ర్యాంకింగ్ పాయింట్లనూ అందించనుంది. ఈ గెలుపుతో అతని ఖాతాలో 9,200 ర్యాంకింగ్ పాయింట్లు చేరనున్నాయి. ఈ పాయింట్లు బీడబ్ల్యూఎఫ్ (BWF) వరల్డ్ టూర్ స్టాండింగ్స్‌లో 12వ స్థానం నుంచి ఆరో స్థానానికి చేరుకోవాలన్న లక్ష్యసేన్ ఆశలకు బలాన్ని ఇవ్వనున్నాయి. కాగా, ఇటీవలే హైలో ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్న లక్ష్యసేన్.. జపాన్ మాస్టర్స్‌లోనూ అదే జోరును కొనసాగించాడు.


ఈ వార్తలు కూడా చదవండి

బ్యాటర్లదే భారం

పాక్‌ను పడగొట్టి.. ఆసియాను జయించి

Updated Date - Nov 15 , 2026 | 10:50 AM