ఇది ట్రైలర్ మాత్రమే.. మెయిన్ పిక్చర్ చూడాలని ఆశపడొద్దు
ABN , Publish Date - Apr 17 , 2026 | 09:53 AM
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ముసాయిదా చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎన్ని రకాల ఆందోళనలు జరపటానికైనా తాను సిద్ధమేనని, తమిళుల రక్తం వేడి తగ్గిపోయిందని, వీధుల్లో ఆందోళనలకు దిగరని భావిస్తే కేంద్రంలోని బీజేపీకి చుక్కెదురవటం ఖాయమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ హెచ్చరించారు.
బీజేపీ పాలకులకు స్టాలిన్ హితవు
చెన్నై: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ముసాయిదా చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎన్ని రకాల ఆందోళనలు జరపటానికైనా తాను సిద్ధమేనని, తమిళుల రక్తం వేడి తగ్గిపోయిందని, వీధుల్లో ఆందోళనలకు దిగరని భావిస్తే కేంద్రంలోని బీజేపీకి చుక్కెదురవటం ఖాయమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ హెచ్చరించారు. గురువారం సాయంత్రం నామక్కల్‌లో డీఎంకే కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఏర్పాటైన సభలో ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా గురువారం ఉదయం నిర్వహించిన నల్లజెండాల ఆవిష్కరణ, బిల్లు నకళ్ల దగ్ధం వంటివి ట్రైలర్ మాత్రమేనని, మెయిన్ పిక్చర్ చూడాలని కేంద్రంలోని బీజేపీ పాలకులు ఆశపడద్దన్నారు.
తమిళులనే ఓజాతి ఉంది, ఆ తమిళులకు ప్రత్యేక గుణం ఉందనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా నల్లజెండాలు ఎగరేసి డీలిమిటేషన్‌కు తమ నిరసన తెలిపామన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు కలిగించే నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకంగా జరిపే ఆందోళనల వల్ల తనకు ఎలాంటి కష్టాలు ఎదురైనా భరించగలనని, వెయ్యి ఎమర్జెన్సీలు విధించినా తాను భయపడే ప్రసక్తే లేదని స్టాలిన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో డీఎంకే ఎంపీలంతా పునర్విభజన బిల్లును నిరోధించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు.
డీఎంకే నేతలయినా, కార్యకర్తలైనా వారికి రాష్ట్ర హక్కులు మాత్రమే ముఖ్యమన్నారు. కరుణానిధి రూపొందించిన నామక్కల్‌జిల్లాలో ప్రసంగించడం సంతోషంగా ఉందన్నారు. ద్రావిడ మాడల్ ప్రభుత్వం ప్రతి జిల్లాకు, ప్రతియూనియన్‌కు, ప్రతి పంచాయతీకి ఆయా ప్రాంతాలకు అవసరమైన పథకాలను ఎంచి అమలు చేశామన్నారు. ఈ సభలో రాశిపురం అభ్యర్థి డాక్టర్ మదివేందన్, తిరుచెంగోడు అభ్యర్థి ఈశ్వరన్ (కొంగునాడు) నామక్కల్ అభ్యర్థి కేపీ రాణి, సేందమంగళం అభ్యర్థి పూమలర్, కుమారపాళయం అభ్యర్థి ఎస్ బాలు, పరమత్తివేలూరు అభ్యర్థి కేఎస్ మూర్తికి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గోల్డ్ రేట్స్.. కొనసాగుతున్న ధరలు పెరుగుదల
నోయిడా అల్లర్లు.. ఇద్దరి అరెస్టు, మరొకరు పరారీ..
Read Latest Telangana News and National News