అసెంబ్లీ @ 263
ABN , Publish Date - Apr 17 , 2026 | 07:08 AM
అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే, నియోజకవర్గాల పునర్ విభజనతో కూడిన మహిళా కోటా బిల్లు పార్లమెంటులో గట్టెక్కితే... ‘అధ్యక్షా’ అని పిలవాలనుకునే ఆశావహులకు పండగే! అసెంబ్లీలో...
బిల్లు గట్టెక్కితే ఆశావహులకు పండగే
భారీగా పెరగనున్న అసెంబ్లీ స్థానాలు
కొత్తగా 88 శాసనసభ నియోజకవర్గాలు
మొత్తంగా మూడో వంతు మహిళలకు
పెరిగేవన్నీ మహిళామణులకు ‘ప్రత్యేకం’
(అమరావతి - ఆంధ్ర జ్యోతి)
అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే, నియోజకవర్గాల పునర్ విభజనతో కూడిన మహిళా కోటా బిల్లు పార్లమెంటులో గట్టెక్కితే... ‘అధ్యక్షా’ అని పిలవాలనుకునే ఆశావహులకు పండగే! అసెంబ్లీలో మహిళామణుల వెలుగుల జిలుగులే! తాజా బిల్లు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాలు 50 శాతం పెరిగి... 25 నుంచి 38కి చేరుకుంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. అదే క్రమంలో... అసెంబ్లీ స్థానాలూ 50 శాతం పెరగనున్నాయి. అంటే, కొత్తగా 88 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడతాయి. ప్రస్తుతమున్న అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి 263కు చేరుకోనుంది. రాష్ట్ర విభజన చట్టంలో ఏపీలో మొత్తం అసెంబ్లీ స్థానాలను 225కు పెంచుతామని హామీ ఇచ్చారు. దీంతో పోల్చితే ఇప్పుడు మరిన్ని పెరగనున్నాయి. మొత్తం 263 స్థానాల్లో 33 శాతం... అంటే 88 సీట్లు మహిళలకే వెళ్లనున్నాయి. పునర్విభజన అనంతరం 13 అసెంబ్లీ సీట్లతో నెల్లూరు జిల్లా టాప్‌లో నిలవనుంది. ఇక 12 సీట్లతో 5 జిల్లాలు రెండోస్థానంలో ఉండనున్నాయి. అతి తక్కువగాపోలవరం జిల్లాలో రెండు స్థానాలు మాత్రమే ఉంటాయి. అందులో ఒకటి మహిళలకు కేటాయిస్తారు. ఆ తర్వాత అల్లూరి జిల్లాలో 3 సీట్లు ఉండనున్నాయి. అందులోనూ మహిళల కోటా కింద ఒక సీటు ఉంటుందని స్పష్టత వచ్చింది.
2016, 2017లోనే అసెంబ్లీ తీర్మానాలు
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ ఇప్పటిది కాదు. దీనిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2016లోనే ఏకగ్రీవ తీర్మానం చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2016 మార్చి 8న ఏపీ అసెంబ్లీలో, పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించి పార్లమెంటుకు పంపింది. ఆ తర్వాత 2017లోనూ మరోసారి మహిళా రిజర్వేషన్‌పై ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. 2017 నవంబరు 30న ‘మహిళా సాధికారత, బాలల హక్కుల పరిరక్షణ.. అమరావతి డిక్లరేషన్ పాత్ర’ అనే అంశంపై సభలో చర్చ జరుగుతున్న సమయంలో చంద్రబాబు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అప్పుడు కూడా సభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. టీడీపీ తొలి నుంచి మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ వచ్చింది. ఎన్టీఆర్ హయాంలోనే స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అదే స్ఫూర్తితో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల ప్రవేశాల్లోనూ మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఏ జిల్లాలో... ఎవరికి ఎన్ని?
డీ లిమిటేషన్ వ్యవహారాల నిపుణుడు ఇనగంటి రవికుమార్ అంచనా ప్రకారం... జిల్లాల వారీగా పెరిగే స్థానాలు, వాటిలో మహిళలకు దక్కే అవకాశమున్న సీట్లు ఇవి...
