నోయిడా అల్లర్లు.. ఇద్దరి అరెస్టు, మరొకరు పరారీ..
ABN , Publish Date - Apr 17 , 2026 | 08:28 AM
ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఏప్రిల్ 13న జరిగిన కార్మికుల అల్లర్ల కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పథకం ప్రకారం కార్మికులను నిరసనలు, హింసాకాండకు ప్రేరేపించినందుకు గాను అరెస్టు చేసినట్లు గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనర్ లక్ష్మీసింగ్ తెలిపారు.
ఉత్తరప్రదేశ్: నోయిడాలో ఏప్రిల్ 13న జరిగిన కార్మికుల అల్లర్ల కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పథకం ప్రకారం కార్మికులను నిరసనలు, హింసాకాండకు ప్రేరేపించినందుకు గాను అరెస్టు చేసినట్లు గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనర్ లక్ష్మీసింగ్ తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితులను బిహార్‌లోని చప్రాకు చెందిన ఆటోడ్రైవర్ రూపేశ్ రాయ్, జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన ఆదిత్య ఆనంద్, బిహార్‌లోని గోపాల్‌గంజ్‌కు చెందిన మనీషా చౌహాన్‌గా గుర్తించినట్లు ఆమె తెలిపారు. రాయ్, చౌహాన్‌లను అరెస్టు చేయగా.. ఆనంద్ పరారీలో ఉన్నట్లు సీపీ లక్ష్మి వెల్లడించారు.
వివిధ రాష్ట్రాల్లో జరిగిన నిరసనలతోనూ వీరికి సంబంధాలు ఉన్నట్లు సీపీ లక్ష్మీసింగ్ చెప్పారు. తాజాగా ఫ్యాక్టరీ కార్మికుల నిరసనలను ప్రేరేపించినట్లు తేలడంతో అరెస్టు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ మేరకు పలు ఫొటోలు, సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించి నిందితులను గుర్తించామన్నారు. ఢిల్లీ, హైదరాబాద్, హర్యానాలోని మనేసర్ నిరసనతో సహా పలు రాష్ట్రాల నిరసనల్లో వారి ప్రమేయం ఉన్నట్లు లక్ష్మీసింగ్ తెలిపారు. మరోవైపు నోయిడా సెక్టార్ 20 పోలీస్ స్టేషన్‌లో రెండు ఎక్స్ హ్యాండిల్స్‌పైనా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ హ్యాండిల్స్ వివరాలపై ఎక్స్‌ను కోరగా.. ఆ రెండు ఖాతాలను భారత్‌లోనే సృష్టించారని, కానీ మూడు నెలలుగా వాటిని పాకిస్థాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు వెల్లడైందని సీపీ లక్ష్మీసింగ్ తెలిపారు.
ఈ రెండు ఖాతాలను నోయిడాలో అల్లర్లు సృష్టించేందుకు వినియోగించినట్లు సీపీ చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 9, 10 తేదీల్లో హర్యానాకు చెందిన కంపెనీల వాట్సాప్ గ్రూపుల నుంచి డేటా సేకరించిన నిందితులు.. ఆ తర్వాత క్యూఆర్ కోడ్‌లను పంపి నోయిడా ఫ్యాక్టరీ కార్మికులతో వాట్సాప్ గ్రూపులను సృష్టించారని చెప్పారు. అన్ని గ్రూపులలో సుమారు 1,000 మందికి పైగా సభ్యులు ఉన్నారని.. డిమాండ్లు సాధించేందుకు రోడ్లను దిగ్బంధించాలని ఈ ముగ్గురు రెచ్చగొట్టారని సీపీ లక్ష్మీసింగ్ తెలిపారు. ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీ వరకూ నిరసనలు కొంతమేర ప్రశాంతంగా జరగ్గా.. ఏప్రిల్ 13న హింసాత్మకంగా మారాయన్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా కార్మికులు 100కు పైగా ఫ్యాక్టరీలను ధ్వంసం చేశారని.. పలు వాహనాలకు నిప్పుపెట్టారని పేర్కొన్నారు. ఏప్రిల్ 11న అధికారులతో జరిగిన చర్చలతో కార్మికులు సంతృప్తి చెందారని.. కానీ, పోలీసులు, అధికారులకు వ్యతిరేకంగా రాయ్, చౌహాన్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని తెలిపారు.
ఏప్రిల్ 11 రాత్రి వారిని నోయిడాలో అరెస్టు చేశామని.. ఆనంద్ మాత్రం పారిపోయాడని సీపీ లక్ష్మి తెలిపారు. అయితే, ఏప్రిల్ 13న రెండు 'ఎక్స్' ఖాతాల్లో తప్పుడు పోస్టులు పెట్టారని చెప్పారు సీపీ. ఓ పోస్టులో నిరసనల్లో 'ఆరుగురు కార్మికులు మృతి, 67 మంది గాయపడ్డారని.. మరో దాంట్లో నోయిడా నిరసనల్లో పోలీసులు కాల్పులు జరిపారని.. 14 మంది మృతి, 32 మంది గాయపడ్డారని ఉందన్నారు. దీంతో అల్లర్లు చెలరేగి హింసాత్మకంగా మారాయని సీపీ లక్ష్మీసింగ్ వెల్లడించారు. ఘటనపై మరింతగా లోతైన విచారణ జరుగుతోందని చెప్పుకొచ్చారు. కాగా, ఇప్పటివరకూ నోయిడా అల్లర్లకు సంబంధించి 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అవ్వగా.. 62 మందిని అరెస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
భీమిలి సమీపంలో రోడ్డు ప్రమాదాలు.. ఒకరి మృతి, పలువురికి గాయాలు
అందుకు ఇరాన్ ఒప్పుకుంది.. త్వరలో మా మధ్య డీల్: ట్రంప్