Share News

అందుకు ఇరాన్ ఒప్పుకుంది.. త్వరలో మా మధ్య డీల్: ట్రంప్

ABN , Publish Date - Apr 17 , 2026 | 08:18 AM

శుద్ధి చేసిన యూరేనియంను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య త్వరలో డీల్ కుదరవచ్చని చెప్పారు.

అందుకు ఇరాన్ ఒప్పుకుంది.. త్వరలో మా మధ్య డీల్: ట్రంప్
Donald Trump on Deal With Iran

ఇంటర్నెట్ డెస్క్: శుద్ధి చేసిన యూరేనియంను అమెరికాకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం పేర్కొన్నారు. త్వరలో రెండు దేశాల మధ్య డీల్ కుదరవచ్చని చెప్పారు. శ్వేతసౌధంలో జరిగిన పత్రికా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

‘శుద్ధి చేసిన యూరేనియంను అప్పగించేందుకు వారు అంగీకరించారు. త్వరలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరే ఛాన్స్ ఉంది. ఇరాన్‌, అమెరికా సంబంధాలు చాలా వరకూ మెరుగుపడ్డాయి. దీన్ని చాలా మంది నమ్మలేకపోవచ్చు. నాలుగు వారాల పాటు సాగిన బాంబు దాడులు, దిగ్బంధనం వంటివి ఫలితాన్ని ఇచ్చాయని నేను అనుకుంటున్నాను’ అని ట్రంప్ అన్నారు.


రెండు దేశాల మధ్య ఈ వారాంతంలోనే మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉందని కూడా ట్రంప్ అన్నారు. అయితే, కాల్పుల విరమణను మరోసారి పొడిగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కూడా చెప్పారు. పొడిగింపు అవసరం ఉండదనే అనుకుంటున్నట్టు చెప్పారు. ఇరాన్ గతంలో కంటే సానుకూలంగా యూఎస్‌తో వ్యవహరిస్తోందని అన్నారు. అయితే, చర్చలు విఫలమైతే మరోసారి దాడులు మొదలు కావొచ్చని కూడా హెచ్చరించారు. వచ్చే వారం కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసిపోనున్న విషయం తెలిసిందే. గతంలో బెట్టు చేసిన ఇరాన్ ప్రస్తుతం అనేక విషయాల్లో రాజీ ధోరణితో ఉందని కూడా చెప్పుకొచ్చారు.


ఇస్లామాబాద్ వేదికగా యూఎస్, ఇరాన్ మధ్య డీల్‌ కుదిరితే తాను పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశం ఉందని కూడా ట్రంప్ చెప్పారు. ఈ సందర్భంగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై ప్రశంసలు కురిపించారు. మునుపటి వేదికగానే మరోసారి చర్చలు జరుగుతాయని శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ కెరొలైన్ లెవిట్ కూడా ఇటీవల పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇజ్రాయెల్‌-లెబనాన్‌ మధ్య కాల్పుల విరమణ

ఆ రూ.9 లక్షల కోట్ల కోసం ఇరాన్ డిమాండ్.. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి..

Updated Date - Apr 17 , 2026 | 09:01 AM