ఢిల్లీ ఆధిపత్య కూటమిని అనుమతించరు
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:56 PM
రాష్ట్ర ప్రజలు ఢిల్లీ అధిపత్య కూటమిని అంగీకరించరని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు.
ఈపీఎస్ ఢిల్లీ పర్యటనపై స్టాలిన్ విసుర్లు
చెన్నై: రాష్ట్ర ప్రజలు ఢిల్లీ అధిపత్య కూటమిని అంగీకరించరని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం డీఎంకే కార్యకర్తలకు లేఖ రాశారు. ద్రావిడ మోడల్ 2.0 పాలనకు 206 ఎన్నికలు దోహదపడనున్నాయని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకునేవారికి ఇది సువర్ణ అవకాశమని స్టాలిన్ అందులో పేర్కొన్నారు. త్వర లో జరుగనున్న ఎన్నికల్లో లౌకిక పార్టీలతో కూడిన కూటమి ఘనవిజయం సాధించి, ద్రావిడ మోడల్ 2.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
‘‘మీలో ఒకడిగా ఉంటున్న నాకు గెలుపు తథ్యమని తెలుస్తోంది. అందుకు కారణం ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు ఎదురైనా నిర్ణయించిన లక్ష్యం చేరుకోనేలా మీరు పడే శ్రమ. ఈ నెల 17 నుంచి అన్నా అరివాలయంలో ఆశావహులకు ఇంటర్వ్యూ చేస్తున్నాను. పార్టీ కార్యకర్తల్లో ఉండే అంకిత భావం, తపన దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రత్యక్షంగా చూస్తున్నాను. 2021 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు కొత్త పథకాలు కూడా అమలుచేశాం’’ అని స్టాలిన్ పేర్కొన్నారు.
దీర్ఘకాలిక లక్ష్యంతో ఎన్నికల మేనిఫెస్టో...
దీర్ఘకాలిక లక్ష్యంతో తమ ఎన్నికల మేనిఫెస్టో వుంటుందని, ప్రజావసరాలు, ఆకాంక్షలకనుగుణంగా ఇది రూపొందుతోందని స్టాలిన్ స్పష్టం చేశారు. ఐదేళ్ల పాలన పూర్తిచేసుకున్నా, అంతా సజావుగా సాగిందని చెప్పలేమని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూపించిన పక్షపాత ధోరణి, నిధులు విడుదల చేయకపోవడం, కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టకపోవడంతో పాటు ప్రజాస్వామ్యానికి భంగం కలిగించేలా చేపట్టిన చర్యలు నడుమ ద్రావిడ మోడల్ పాలన దిగ్విజయంగా పూర్తిచేశామన్నారు.
2026 ఎన్నికలు తమిళనాడు జట్టుకు ఢిల్లీ జట్టు మధ్య జరిగేవని పునరుద్ఘాటించారు. ఢిల్లీలో కూటమి ఏర్పాటు, సీట్ల సర్దుబాటు జరుగుతున్నాయన్నారు. ప్రతిపక్ష నేత, ఆయన సహచరులు ఢిల్లీలో మకాం వేయడానికి కారణమేంటని ప్రశ్నించారు. రాష్ట్రానికి నిధులు సాధించేందుకా? రాష్ట్రంలో అమలుకాని పథకాలు, ప్రాజెక్ట్‌లు పూర్తిచేసేందుకా? సిలిండర్ కొరత తీర్చేందుకా? రాష్ట్ర హక్కులు కాపాడేందుకా.. ఎందుకని ప్రశ్నించారు. కానీ వీటికి సమాధానం ఏమీ రాదని తెలిపారు.
ఢిల్లీ ఆధిపత్యానికి బానిసలుగా మారే చర్యలను రాష్ట్ర ప్రజలు అనుమతించరని తెలిపారు. ప్రతిపక్షాలు తీసుకునే నిర్ణయాలు ఢిల్లీతో ముడి పడి ఉంటాయని రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకున్నారన్నారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణ, అభివృద్ధి డీఎంకే నేతృత్వంలోని లౌకిక పార్టీల కూటమితో సాధ్యమవుతుందని ప్రజలు నమ్మకంతో ఉన్నారన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, 2026 ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధించి తీరుతామని సీఎం స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పెళ్లాడింది జీవిత భాగస్వామిని.. పనిమనిషిని కాదు...
అమలులోకి నేషనల్ డెంటల్ కమిషన్
Read Latest Telangana News and National News