Share News

12వ తరగతి వరకు స్కూల్లోనే!

ABN , Publish Date - Mar 21 , 2026 | 05:20 AM

జాతీయ విద్యావిధానాన్ని అన్వయించుకొని దానికి అనుగుణంగా రాష్ట్ర విద్యావిధానంలో సంస్కరణలు తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

12వ తరగతి వరకు స్కూల్లోనే!

  • రాష్ట్రంలో ఇకపై ‘ప్లస్‌ టూ’ విద్యావిధానం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు

  • విద్యాకమిషన్‌ నివేదిక ఫైనల్‌ కాదు.. అభ్యంతరాలు కేశవరావు కమిటీకి చెప్పొచ్చు.. రేషన్‌కార్డు ఉన్నోళ్లకు కుటుంబ జీవిత బీమా

  • భూముల అమ్మకానికి కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదు.. ఆ డబ్బును క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌ చేయడమే మా విధానం.. మాది ఫ్యూచరిస్టిక్‌ బడ్జెట్‌

  • లీకేజీలను అరికట్టి ఆదాయం పెంచుకుంటాం.. అందరం కలిసి తెలంగాణ పిత ఎవరో నిర్ణయిద్దాం

  • అజార్‌, కోదండరాంల ఎమ్మెల్సీ అంశం గవర్నర్‌ కోర్టులో.. ప్రణాళిక ప్రకారమే గ్యారెంటీల అమలు

  • మూసీ ప్రక్షాళన విషయంలో ముందుకే వెళతాం.. బీఆర్‌ఎస్‌ అబద్ధాల మాయలో పడ్డ గాంధీ మనుమడు

  • డ్రగ్స్‌ కేసుపై బీజేపీ నేతలెందుకు స్పందించలేదు?.. మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): జాతీయ విద్యావిధానాన్ని అన్వయించుకొని దానికి అనుగుణంగా రాష్ట్ర విద్యావిధానంలో సంస్కరణలు తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి స్కూల్‌ ఎడ్యుకేషన్‌లో ‘ప్రీ ప్రైమరీ టు ప్లస్‌ టూ’ విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు చెప్పారు. దేశంలోని అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఈ విధానం అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. పదో తరగతి తర్వాత డ్రాపౌట్లు పెరుగుతున్న కారణంగా కూడా ఈ ఆలోచన చేసినట్లు తెలిపారు. శుక్రవారం శాసనమండలి హాల్లో మీడియాతో ముఖ్యమంత్రి చిట్‌ చాట్‌గా మాట్లాడారు. తెలంగాణ విద్యావిధానం రూపకల్పనలో విద్యా కమిషన్‌ సిఫారసులు ఫైనల్‌ కాదని, ఆ నివేదికను అధ్యయనం, విస్తృత అభిప్రాయ సేకరణ కోసం కె.కేశవరావు కమిటీకి అప్పగించామని అన్నారు. ఎవరికైనా అభ్యంతరాలుంటే ఆ కమిటీకి చెప్పుకోవచ్చని సూచించారు. కేశవరావు కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత దానిని అమలు చేయాలా, వద్దా అన్నది తాము నిర్ణయిస్తామన్నారు. ‘ఇందిరా కుటుంబ జీవిత బీమా’ పథకానికి రేషన్‌ కార్డు కలిగి ఉండటమే అర్హత అని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలకు రేషన్‌ కార్డులు ఉన్నాయని, ఆయా కుటుంబాల యజమానులందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను తాము ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ఫ్యూచరిస్టిక్‌ బడ్జెట్‌ అని అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. సకాలంలో రుణాలు చెల్లించిన 65 లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.57 వేల కోట్ల రుణం ఇచ్చామన్నారు. కోర్‌ అర్బన్‌ రీజియన్‌లోని వారిని ఈ సంఘాల పరిధిలోకి తీసుకువచ్చి సహాయం చేస్తామన్నారు.


మేం చేసిన అప్పు.. గత అప్పులకే సరిపోయాయి..

తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.3.47 లక్షల కోట్ల మేరకు అప్పులు చేస్తే.. అందులో రూ.3.30 లక్షల కోట్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పులకు వడ్డీలు, వాయిదాలు చెల్లించడానికే అయ్యాయని సీఎం రేవంత్‌ అన్నారు. కేవలం రూ. 17 వేల కోట్లు మాత్రమే ఇతర కార్యక్రమాలకు ఖర్చు చేయగలిగామని చెప్పారు. ఒక్క కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారా చేసిన అప్పుకే వడ్డీలు, వాయిదాల రూపంలో రూ.44 వేల కోట్ల దాకా చెల్లించాల్సి వచ్చిందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్క చుక్క నీరు రాకున్నా.. ఇంత పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు. బడ్జెట్లో పెట్టిన సంక్షేమ కార్యక్రమాల అమలుకు.. ఆదాయ మార్గాలను పెంచుకుంటామన్నారు. ప్రధానంగా జీఎస్టీ, మైనింగ్‌లలో లీకేజీలను వీలైనంత మేరకు తగ్గించడంతో ఆదాయం పెరుగుతోందని చెప్పారు. అప్పులను రీస్ట్రక్చర్‌ చేయడం ద్వారా వడ్డీ, వాయిదాల చెల్లింపుల భారం తగ్గించామన్నారు. భూముల అమ్మకానికి కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే ఆ భూముల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌ చేయాలన్నదే తమ విధానమన్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా కూడా ఆదాయాన్ని సమకూర్చుకోనున్నట్లు చెప్పారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఏ గ్యారెంటీ ఎప్పుడు అమలు చేయాలన్నదానిపై తమకు ఓ ప్రణాళిక ఉందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తాము ప్రతి విషయాన్నీ పబ్లిక్‌ డొమైన్‌లో పెడుతున్నామన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో తమను సచివాలయానికే రానివ్వలేదని తెలిపారు.

మూసీపై ముందుకే..!

మూసీ నది అభివృద్ధి విషయంలో ముందుకే వెళ్లనున్నట్లు ముఖ్యమంత్రి పురుద్ఘాటించారు. మూసీ ప్రక్షాళన వల్ల నష్టపోయేవారికి మేలు చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన అని చెప్పారు. గండిపేట నుంచి లంగర్‌ హౌస్‌ వరకు నదీగర్భం నుంచి ఇరువైపులా 50 మీటర్లు హద్దులను నిర్ణయించామని, హిమాయత్‌ సాగర్‌ నుంచి లంగర్‌హౌస్‌ వరకు రెండువైపులా 130 మీటర్ల చొప్పున ఉంటుందని అన్నారు. కిలోమీటర్‌ వరకు హద్దులు నిర్ణయించినట్లుగా బీఆర్‌ఎస్‌ పార్టీ తన మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తాము ప్రజలకు జవాబుదారీ తప్ప.. కేసీఆర్‌, కేటీఆర్‌లకు కాదన్నారు. గాంధీ సరోవర్‌ ప్రాజెక్టును గాంధీ మనుమడు తప్పుబట్టడంపై రేవంత్‌ స్పందిస్తూ.. బీఆర్‌ఎస్‌ పార్టీ అబద్ధపు ప్రచారాల మాయలో ఆయన పడి ఉంటారని వ్యాఖ్యానించారు. డీపీఆర్‌ పూర్తయిన తర్వాత కేంద్రానికి సమర్పిస్తామని, కేంద్రం గ్రాంటు ఇస్తుందా, గ్యారెంటీ ఇస్తుందా అన్నది అప్పుడు తేలుతుందన్నారు. కేంద్రం నుంచి వివిధ పథకాలకు నిధులు అడగడానికి నామోషీ అవసరంలేదన్నారు. ఫ్యూచర్‌ సిటీకి ఏజెన్సీని అపాయింట్‌ చేశామని, ఆఫీసు కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.


‘టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు రద్దు కావు’

రాష్ట్రంలో ‘ప్లస్‌ టూ’ విద్యావిధానం అమలుతో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రద్దవుతాయన్న ప్రచారం అవాస్తవమని విద్యా కమిషన్‌ ఓఎస్డీ జీనత్‌ అన్నారు. ఎస్సెస్సీ బోర్డు పరీక్షలను రద్దు చేయాల్సిందిగా విద్యా కమిషన్‌ ఎక్కడా సిఫారసు చేయలేదని స్పష్టం చేశారు. కేవలం 11వ తరగతి (ఇంటర్‌ మొదటి సంవత్సరం) పరీక్షల రద్దుకే ప్రతిపాదన చేశామన్నారు. ఎస్సెస్సీ బోర్డు, ఇంటర్మీడియట్‌ బోర్డులను విలీనం చేయాల్సిందిగా సూచించామన్నారు.

గవర్నర్‌ కోర్టులో అజారుద్దీన్‌ ఎమ్మెల్సీ అంశం..

మంత్రి అజారుద్దీన్‌, కోదంరామ్‌ల ఎమ్మెల్సీ అంశం.. ప్రస్తుతం గవర్నర్‌ కోర్టులో ఉందని సీఎం చెప్పారు. గవర్నర్‌ను సంప్రదించాల్సిందిగా సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. తమ ప్రతిపాదనను ఆమోదించాల్సిందిగా గవర్నర్‌ను కోరుతూ వచ్చే క్యాబినెట్‌ భేటీలో తీర్మానం చేయనున్నట్లు తెలిపారు. గవర్నర్‌ అంగీకరించకపోతే మాత్రమే హైకోర్టును ఆశ్రయిచాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించిందన్నారు. కేసీఆర్‌ అసెంబ్లీకి రాకుండా కేటీఆర్‌, హరీశ్‌రావు కలిసి గృహనిర్బంధం చేసి ఉంటారని ఆరోపించారు. తెలంగాణ జాతిపిత ఎవరన్నది తెలంగాణ జాతి మొత్తం చర్చించి నిర్ణయిస్తుందన్నారు. ‘‘హిల్ట్‌, టీడీఆర్‌ పాలసీల్లో రూ.లక్షల కోట్ల అవినీతి అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ వాళ్లు మాట్లాడుతున్నారు. 2014 జూన్‌ 2 నుంచి ఇప్పటివరకు జరిగిన భూ బదలాయింపులపై కేటీఆర్‌, హరీశ్‌రావు ఏ విచారణ అడిగినా జరిపిస్తా. దీనికి వారు సిద్ధమా?’’ అని రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. జోన్‌ కన్వర్షన్‌ చేస్తున్నది కేవలం 9 వేల ఎకరాలేనని, ఇందులో మౌలిక వసతులు పోను మిగిలేది 4 వేల ఎకరాలేనని అన్నారు. ఆ 4వేల ఎకరాలు అమ్మినా రూ.లక్ష కోట్లు కూడా రావని, అలాంటిది బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తున్నట్లు రూ.5 లక్షల కోట్ల అవినీతి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పోన్‌ ట్యాపింగ్‌పై చక్రధర్‌గౌడ్‌ వేసిన కేసులో హరీశ్‌రావుకు సాంకేతిక కారణాలతో ఊరట లభించిందని తెలిపారు. సిట్‌ విచారణ చేస్తున్న కేసులో కాదన్నారు. ఇక ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసులో కేంద్రం అనుమతి ఇటీవలే లభించిందని, అరవింద్‌కుమార్‌ను సస్పెండ్‌ చేశామని చెప్పారు. పోలీసులు చార్జిషీట్‌ ఫైల్‌ చేయాల్సి ఉందన్నారు. జీహెచ్‌ఎంసీని 300 డివిజన్లు, 12 జోన్లుగా విభజించి డిసెంబర్‌ 31కి ముందే కేంద్రానికి సమర్పించామని, దాని ప్రకారమే జనాభా లెక్కల సేకరణ జరుగుతోందని తెలిపారు.


డ్రగ్స్‌ కేసుపై బీజేపీ నేతలెందుకు స్పందించలేదు?

మొయినాబాద్‌లో బీఆర్‌ఎస్‌ నేత సొంత ఫాంహౌస్‌లో డ్రగ్స్‌తో పట్టుబడితే.. దానిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ సహా ఆ పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడూ ఎందుకు స్పందించలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిని బట్టి బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య సమన్వయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. ఆ రెండు పార్టీల మధ్య అలయన్స్‌ కుదురుతుందా.. లేక విలీనం జరుగుతుందా అని తాను ఇప్పుడు చెప్పలేనని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. క్యాబినెట్‌ విస్తరణ చేస్తే చెప్పే చేస్తామని, తాను ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ విస్తరణ అనే చర్చను మీడియానే పెడుతోందని అన్నారు. జీవన్‌రెడ్డి వ్యవహారాన్ని టీపీసీసీ చీఫ్‌, మీనాక్షీ నటరాజన్‌ చూసుకుంటారన్నారు. గొర్రె కసాయిని నమ్మినట్లుగా హరీశ్‌రావును కేటీఆర్‌ నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు.

Updated Date - Mar 21 , 2026 | 05:20 AM