Share News

4 వేల కిలోమీటర్ల దూరంలోని యూఎస్ స్థావరంపైకి ఇరాన్ మిసైల్స్‌!

ABN , Publish Date - Mar 21 , 2026 | 11:56 AM

ఇరాన్ దూకుడు పెంచింది. 4 వేల కిలోమీటర్ల దూరంలో యూఎస్-యూకే సైనిక స్థావరంపై దాడికి యత్నించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

4 వేల కిలోమీటర్ల దూరంలోని యూఎస్ స్థావరంపైకి ఇరాన్ మిసైల్స్‌!
Iran missiles target Diego Garcia

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ తన దాడులను తీవ్రతరం చేసినట్టు తెలుస్తోంది. ఏకంగా 4 వేల కిలోమీటర్ల దూరంలోని యూఎస్, యూకేల సంయుక్త సైనిక స్థావరమే లక్ష్యంగా రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

హిందూ మహాసముద్రంలోని డియేగో గార్సియా దీవిలోగల సైనిక స్థావరంపై ఇరాన్ ఈ మిసైల్స్‌ను ప్రయోగించిందని సమాచారం. చాగోస్ ద్వీపసముదాయంలో ఇదొక భాగం. మీడియా కథనాల ప్రకారం, ఇరాన్ ప్రయోగించిన తొలి మిసైల్ మార్గమధ్యంలోనే విఫలమైంది. మరో మిసైల్‌పై ఒక అమెరికా యుద్ధ నౌక క్షిపణి విధ్వంసక రాకెట్‌ను ప్రయోగించింది. ఈ దాడిలో రెండో మిసైల్ ధ్వంసమైందా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వార్తలపై అమెరికా ఇంకా స్పందించలేదు.

US UK military base attack


ఇప్పటివరకూ ఇరాన్ మిసైల్ దాడులు పశ్చిమాసియాకే పరిమితమయ్యాయి. తాజాగా హిందూ మహాసముద్రంలోని దీవిని ఇరాన్ టార్గెట్ చేసిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇదే నిజమైతే ఐరోపా ఖండంలోని పలు యూఎస్ సైనిక స్థావరాలు ఇరాన్ దాడుల పరిధిలోకి వచ్చినట్టు అవుతుందని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.

ఇటీవల శ్రీలంకకు దక్షిణాన హిందూ మహాసముద్ర జలాల్లో ఒక ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా సబ్‌మెరైన్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. టార్పిడో ప్రయోగంతో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్ నౌక నీట మునిగిపోయింది. ఈ ఘటనలో సుమారు 85 మంది మరణించారు. భారత్‌లో జరిగిన మిలన్-2026 నావికాదళ విన్యాసాల్లో పాల్గొన్న ఇరాన్ నౌక తిరిగి వెళుతున్న సమయంలో అమెరికా దాడి చేసింది. ఇరాన్ నావికా దళాన్ని నిర్వీర్యం చేయడం తమ ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటని అమెరికా అప్పట్లో పేర్కొంది.


ఈ వార్తలూ చదవండి:

చమురు, గ్యాస్‌కు..మరో 6 నెలలు కష్టాలే!

ఇరాన్‌పై దాడులకు స్వస్తి చెప్పే యోచనలో ట్రంప్

Updated Date - Mar 21 , 2026 | 12:52 PM