చమురు, గ్యాస్‌కు..మరో 6 నెలలు కష్టాలే!
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:01 AM
పశ్చిమాసియాలో యుద్ధం ఆగిపోయినా చమురు, గ్యాస్ సరఫరాలు పూర్వస్థితికి చేరాలంటే కనీసం ఆరు నెలలు పడుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ ...
పశ్చిమాసియాలో వ్యవస్థలకు తీవ్ర నష్టం
రాజకీయ నేతలు గుర్తించడం లేదు: ఐఈఏ
ఏప్రిల్‌లో బ్యారెల్ 180 డాలర్లకు : సౌదీ
శుక్రవారం చమురు ధర 119 డాలర్లు
దుబాయ్/వాషింగ్టన్/న్యూఢిల్లీ, మార్చి 20: పశ్చిమాసియాలో యుద్ధం ఆగిపోయినా చమురు, గ్యాస్ సరఫరాలు పూర్వస్థితికి చేరాలంటే కనీసం ఆరు నెలలు పడుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) చీఫ్ ఫతీ బిరోల్ పేర్కొన్నారు. చమురు, గ్యాస్ వ్యవస్థలకు జరిగిన నష్టం తీవ్రస్థాయిలో ఉందని.. దీనిని రాజకీయవర్గాలు, మార్కెట్లు సరిగా గుర్తించడం లేదని చెప్పారు. ప్రజలు పెట్రోలియం ఉత్పత్తులను పొదుపుగా వాడుకునేలా చర్యలు చేపట్టాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఇక ప్రస్తుత పరిస్థితి కొనసాగితే ఏప్రిల్ చివరికల్లా చమురు ధరలు బ్యారెల్‌కు 180 డాలర్లు దాటిపోతాయని సౌదీ అరేబియా అధికారులు స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థ అయిన సౌదీ ఆరామ్‌కో ఏప్రిల్ 2వ తేదీన తమ చమురు విక్రయ ధరను సవరించినున్నట్టు వెల్లడించారు. శుక్రవారం చమురు ధర ఏకంగా 119 డాలర్లను తాకింది. గల్ఫ్‌లోని చమురు రిఫైనరీలపై ఇరాన్ దాడులు కొనసాగుతుండటంతో.. ఈ ధర మరింతగా పెరుగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఫ్యూచర్స్ మార్కెట్లో ఏప్రిల్ తొలివారం చమురు ధరలు 150 డాలర్ల వరకు చేరాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
ఇరాన్ చమురుపై ఆంక్షల ఎత్తివేత?
చమురు ధరలు చుక్కలను తాకుతున్న నేపథ్యంలో.. ఇప్పటికే ఉత్పత్తై, నౌకల్లో నింపి ఉన్న ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేయాలని యోచిస్తున్నట్టు అమెరికా ఆర్థిక మంత్రి బసెంట్ తెలిపారు. 140 మిలియన్ బ్యారెళ్ల చమురు సిద్ధంగా ఉంద న్నారు. గల్ఫ్ ప్రాంతంలోని మూడు కీలక రిఫైనరీల్లో ఒకటైన కువైట్‌లోని మినా అల్ అహ్మదీ చమురు రిఫైనరీపై ఇరాన్ మళ్లీ దాడులు చేసింది. సౌదీలోని రియాద్‌లో క్షిపణుల శకలాలు పడి మరొక భారతీయుడు మృతిచెందారు. దీనితో పశ్చిమాసియా ఘర్షణల్లో చనిపోయిన భారతీయుల సంఖ్య ఆరుకు చేరింది. జనవరిలో ఇరాన్‌లో జరిగిన ఆందోళనల్లో ఇద్దరు పోలీసు అధికారులను చంపిన ఆరోపణలపై.. ఆ దేశ రెజ్లింగ్ క్రీడాకారుడు సలే మొహమ్మదితోపాటు మరో ఇద్దరిని బహిరంగంగా ఉరితీశారు.