ఇరాన్‌పై దాడులకు స్వస్తి చెప్పే యోచనలో ట్రంప్
ABN , Publish Date - Mar 21 , 2026 | 09:33 AM
ఇరాన్‌పై సైనిక చర్యకు ముగింపు పలికే యోచనలో తాను ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమ లక్ష్యాలకు చేరువయ్యామని అన్నారు.
ఇరాన్‌పై దాడులను ముగించే యోచనలో తాను ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం తెలిపారు. ఇరాన్ ముడి చమురుపై విధించిన ఆంక్షలను ఇటీవలే అమెరికా తాత్కాలికంగా తొలగించిన నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు సరఫరాకు ఎదురవుతున్న ఆటంకాలు సంక్షోభ స్థాయికి చేరుకుంటున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ట్రంప్ తాజా ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఈ కామెంట్స్ చేశారు. అమెరికా తన లక్ష్యాలకు చేరువ అయ్యిందని ట్రంప్ చెప్పారు. మిలిటరీ చర్యలకు ముగింపు పలికే యోచనలో ఉన్నామని అన్నారు.
శ్వేత సౌధం ప్రెస్ సెక్రెటరీ కెరొలైన్ లెవిట్ కూడా ఈ విషయమై కీలక ప్రకటన విడుదల చేశారు. నాలుగు నుంచి ఆరు వారాల్లో తమ లక్ష్యాన్ని చేరుకుంటామని పెంటగాన్ అంచనా వేసినట్టు పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ పోస్టు అనంతరం ఆమె ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘అమెరికా సాయుధ దళాలు తమ బాధ్యతలను అద్భుతంగా నిర్వహిస్తున్నాయి. రోజులు గడిచేకొద్దీ ఇరాన్ పాలకులు బలహీనమవుతున్నారు. అమెరికాపై వారు ఇక బెదిరింపులకు దిగలేరు’ అని ఆమె పోస్టు పెట్టారు
ఇటీవలే అమెరికా ట్రెజరీ శాఖ ఇరాన్ ముడి చమురుపై ఆంక్షలను తొలగించింది. మార్చ్ 20కి ముందే రవాణా నౌకల్లోకి చేర్చిన ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులకు ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది. ఏప్రిల్ 19 వరకూ ఇది అమల్లో ఉంటుందని యూఎస్ ట్రెజరీ పేర్కొంది. ఈ చర్యలతో 140 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు అంతర్జాతీయ మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుందని ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. ఇక పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం బ్రెంట్ క్రూడ్ ధర 112.19 డాలర్లకు చేరింది.
ఈ వార్తలూ చదవండి:
చమురు, గ్యాస్‌కు..మరో 6 నెలలు కష్టాలే!