Share News

పెళ్లాడింది జీవిత భాగస్వామిని.. పనిమనిషిని కాదు...

ABN , Publish Date - Mar 21 , 2026 | 05:49 AM

కుటుంబ బాధ్యతలు, భార్యాభర్తల సంబంధాలపై శుక్రవారం సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంటి పనుల్లో భర్తకు కూడా సమాన భాగస్వామ్యం ఉంటుందని తెలిపింది.

పెళ్లాడింది జీవిత భాగస్వామిని.. పనిమనిషిని కాదు...

  • భర్త ఇంటి పనులు చేయాల్సిందే

  • సుప్రీంకోర్టు వ్యాఖ్య

న్యూఢిల్లీ, మార్చి 20: కుటుంబ బాధ్యతలు, భార్యాభర్తల సంబంధాలపై శుక్రవారం సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంటి పనుల్లో భర్తకు కూడా సమాన భాగస్వామ్యం ఉంటుందని తెలిపింది. ‘పెళ్లి చేసుకున్నది పనిమనిషిని కాదు..జీవిత భాగస్వామిని’ అని వ్యాఖ్యానించింది. విడాకుల కోసం కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. భార్య ‘క్రూరత్వానికి’ పాల్పడుతుండడంతో విడాకులు మంజూరు చేస్తున్నట్టు తొలుత ట్రయల్‌ కోర్టు ప్రకటించింది. దీన్ని కర్ణాటక హైకోర్టు పక్కనపెట్టింది. దాంతో ఆయన సుప్రీంకోర్టులో అప్పీలు చేశాడు. భర్త తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆ జంటకు 2017 మే నెలలో వివాహం జరిగిందని, 2019 నుంచి విడివిడిగా ఉంటున్నారని చెప్పారు. పలువురు మధ్యవర్తిత్వం జరిపినా ఫలితం లేకపోయిందని అన్నారు. ‘క్రూరత్వం’ అన్న కారణం కింద ట్రయల్‌ కోర్టు విడాకులు మంజూరు చేసిందని చెప్పారు. ‘క్రూరత్వం’ అంటే ఏమిటని ప్రశ్నించగా భార్య ప్రవర్తన సరిగ్గా లేదని, వంట చేయడం లేదని తెలిపారు. దీనిపై జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌ స్పందిస్తూ ‘‘కుటుంబ పనులను భర్త పంచుకోవాలి. వంట, అంట్లుతోమడం, బట్టలు ఉతకడం అన్ని పనులు చేయాలి. ప్రస్తుతం రోజులు మారాయి’’ అని అన్నారు. జస్టిస్‌ మెహతా స్పందిస్తూ ‘‘వివాహం చేసుకున్నది పనిమనిషిని కాదు.. జీవిత భాగస్వామిని’’ అని అన్నారు. వంట చేయకపోవడం క్రూరత్వం కిందకు రాదని భావించే హైకోర్టు సరయిన నిర్ణయం తీసుకొందని, విడాకులు మంజూరు చేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టిందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్నారని చెప్పడంతో వారిని ప్రత్యక్షంగా కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది.

Updated Date - Mar 21 , 2026 | 05:50 AM