‘టెన్’షన్ వద్దు..!
ABN , Publish Date - Mar 02 , 2026 | 08:44 AM
విద్యార్థి దశలో కీలకమైన ఘట్టం పదోతరగతి పరీక్షలు. మార్చి 16వ తేదీ నుంచి పదోతరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలయింది.
16 నుంచి పదోతరగతి పరీక్షలు
జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు
ప్రతి సబ్జెక్టుపై సాధన చేయాలి: ఉపాధ్యాయులు
కొత్తచెరువు, మార్చి 1(ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశలో కీలకమైన ఘట్టం పదోతరగతి పరీక్షలు. మార్చి 16వ తేదీ నుంచి పదోతరగతి పబ్లిక్ పరీక్షలు (AP SSC Exams) ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలయింది. పరీక్షల సమయంలో విద్యార్థులు అధిక ఒత్తిడికి లోనవుతుంటారు. అధిక మార్కులు సాధించాలన్న తపనతో విద్యార్థులు శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతూ, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు.
ఒత్తిడితో చదివితే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పరీక్షల సమయంలో చదవడం ఎంత ప్రధానమో ఆరోగ్యంపై కూడా అంతేదృష్టి సారించాలని చెబుతున్నారు. చిన్నపాటి ఆరోగ్య సమస్య తలెత్తితే దాని ప్రభావం పరీక్షలపై పడుతుందని అంటున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడితే పరీక్షలకు సైతం వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు. విద్యార్థులు మంచి ఆహారం తీసుకుని, రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు. అప్పుడే మెదడు చురుకుగా పనిచేస్తుంది. నిద్రలేమి చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పరీక్షా కాలంలో పోషకాహారంతో పాటు నీళ్లు, మజ్జిగ తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
విద్యార్థులు మంచి ద్రవపదార్థాలు తీసుకోవాలి..
విద్యార్థులకు పరీక్షల సమయం ఎంతో కీలకమైనది. వేసవి కాలం కూడా ప్రారంభమయింది. ఎండలు మరింత పెరుగుతున్నాయి. అందువల్ల శరీరం త్వరగా డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు రోజుకు 3 నుంచి 4 లీటర్ల మంచి నీటిని విరామం ఇస్తూ తీసుకోవాలి. కొబ్బరి నీరు, నీళ్ల మజ్జిగ తాగడం వల్ల శరీరం శక్తివంతంగా పనిచేస్తుంది.
- డాక్టర్ ఆశ్వత్థకుమార్, మెడికల్ ఆఫీసర్, కొత్తచెరువు
భయాన్ని వీడాలి..
పరీక్షల సమయంలో విద్యార్థులు ప్రశాంతంగా ఉంటూ భయాన్ని వీడాలి. ప్రతి సబ్జెక్టులోని పాఠ్యాంశాలను క్షుణ్ణంగా చదువుకుంటే సులభంగా ఉత్తీర్ణత సాధించవచ్చు. పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి విద్యాబోధన చేస్తున్నాం. విద్యార్థులు మొదట పరీక్షా పత్రాన్ని చదవాలి. తొలుత వచ్చే ప్రశ్నలకు జవాబులను రాయాలి. చేతిరాత బాగుండేలా చూసుకోవాలి.
- గోపాల్, హెచ్ఎం, బాలుర హైస్కూల్, కొత్తచెరువు
పరీక్షాకాలంలో తీసుకోవాల్సిన ఆహారం..
తేలికగా జీర్ణమయ్యే ఆహారంతో పాటు సీజనల్ పండ్లను తినాలి.
మెదడు చురుకుగా పనిచేయడానికి ప్రోటీన్లు, విటవిన్లు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
పరీక్షలు పూర్తయ్యే వరకు బయటి ఫుడ్, మాంసాహారం, మసాలాతో చేసిన ఆహార పదార్థాలు తినకపోవడం మంచిది.
కారం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, వేపుళ్లకు దూరంగా ఉండాలి.
జంక్ ఫుడ్, చిరుతిళ్లు, రాత్రివేళల్లో నిద్రపోయే సమయంలో టీ, కాఫీ తీసుకోరాదు.
ప్రణాళిక ప్రకారం చదవాలి..
పరీక్షల్లో అధిక మార్కులు సాధించాలంటే ప్రతి సబ్జెక్టును ప్రణాళిక ప్రకారం చదవాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు సైతం గత ఏడాది ఉత్తీర్ణత కంటే ఈ ఏడాది వందశాతం ఉత్తీర్ణతపై దృష్టి పెట్టారు. ప్రభుత్వం వందరోజుల యాక్షన్ ప్లాన్‌తో విద్యార్థులను గ్రేడ్లుగా విభజించింది. విభజన ప్రకారం విద్యార్థులకు ప్రత్యేక క్లాసుల ద్వారా సబ్జెక్టుల వారిగా బోధిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బహ్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. తెలుగువారి భద్రతపై అయ్యన్నపాత్రుడు ఆరా
హ్యాపీ బర్త్ డే నితీశ్ జీ.. ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలి: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And Telugu News