Share News

సర్కారు బడులు సన్నద్ధం

ABN , Publish Date - Jun 13 , 2026 | 09:34 AM

రాష్ట్రంలోని విద్యాసంస్థలు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో మన్సూరాబాద్‌, నాగోల్‌, జీఎస్ఐ డివిజన్ల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ముస్తాబవుతున్నాయి.

సర్కారు బడులు సన్నద్ధం
Hyderabad government schools

  • 15 నుంచి ప్రారంభమవుతున్న స్కూళ్లు

  • ఇంటింటికీ తిరిగి పిల్లలను చేర్పించాలంటూ పేరెంట్స్‌కు టీచర్ల అవగాహన

హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యాసంస్థలు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో మన్సూరాబాద్‌, నాగోల్‌, జీఎస్ఐ డివిజన్ల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ముస్తాబవుతున్నాయి. ఇందులో భాగంగా తమ పాఠశాలల పరిధిలో విద్యార్థుల సామర్థ్యం పెంచడమే లక్ష్యంగా కొన్ని రోజులుగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సహా ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి బడి ఈడు పిల్లలను స్కూలులో చేర్పించాలని సూచిస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించే సదుపాయాలు, సౌకర్యాలను వారికి వివరిస్తూ ‘బడి బాట’ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. సోమవారం నుంచి బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ బడుల్లో నెలకొన్న సమస్యలు, శుభ్రత పనులపై ప్రత్యేక కథనం.


city3.2.jpgపాఠ్య పుస్తకాలొచ్చేశాయ్‌..

మన్సూరాబాద్‌, నాగోల్‌, జీఎస్ఐ డివిజన్ల పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులందరికీ అందించేందుకు ఇప్పటికే పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. పాఠశాలలు ప్రారంభమైన వారంరోజుల్లోపు విద్యార్థులందరికీ పుస్తకాలు అందించేందుకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు యోచిస్తున్నారు.


city3.3.jpgసౌకర్యాలు, సదుపాయాలిలా..

ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు, సౌకర్యాల విషయానికొస్తే జీఎస్ఐ డివిజన్‌ బండ్లగూడ గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులు శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. పాఠశాలకు కేటాయించిన స్థలం వివాదంలో ఉండటంతో ఆ పనులు ముందుకు సాగలేదు. దీంతో శిథిలావస్థలోని భవనంలోనే భయం భయంగా కొనసాగించాల్సిన దుస్థితి ఉండేది. గ్రామస్థులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న జూనియర్‌ ఛాంబర్‌ ఇంటర్నేషనల్‌ (జేసీఐ) అనే స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్‌ దక్కన్‌ విభాగం సభ్యులు పాఠశాల ఆవరణలో రూ.3లక్షలు వెచ్చించి షెడ్డు నిర్మించి రెండు తరగతి గదులు, ఓ హాలు ఉచితంగా నిర్మించి విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహకారాన్ని అందించారు.


మజీద్‌పూర్‌లో ‘బడిబాట’

అబ్దుల్లాపూర్‌మెట్‌(హైదరాబాద్): అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం మజీద్‌పూర్‌ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. మజీద్‌పూర్‌, గుంతపల్లి, నెర్రపల్లి, గండి చెరువు గ్రామాల్లో తిరిగి బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాల్లోనే నాణ్యమైన విద్యాభోదన ఉంటుందని తెలిపారు. మజీద్‌పూర్‌ ప్రభుత్వ స్కూల్‌లో కార్పొరేట్‌ స్థాయిలో సౌకర్యాలు ఉన్నాయని తల్లిదండ్రులకు వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

నేటి నుంచి 15 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు 50 వేల జరిమానా

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 13 , 2026 | 09:34 AM