Share News

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు 50 వేల జరిమానా

ABN , Publish Date - Jun 13 , 2026 | 07:00 AM

హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు రూ.50 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు 50 వేల జరిమానా

  • ఆ సొమ్ము చెల్లిస్తేనే కౌంటర్‌ అఫిడవిట్‌ను అంగీకరించండి

  • రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు రూ.50 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ జరిమానా మొత్తాన్ని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రిలీఫ్‌ ఫండ్‌కు చెల్లించాలని సూచించింది. ఈ మొత్తాన్ని చెల్లించిన తర్వాతే భూవివాదానికి సంబంధించిన కేసులో హైడ్రా సమర్పించే కౌంటర్‌ అఫిడవిట్‌ను అంగీకరించాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీచేసింది. ఓ భూవివాదంలో యథాతథస్థితి (స్టేటస్‌ కో) ఉత్తర్వులు ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యక్తుల స్థలంలో ప్రహరీ గోడ కూల్చివేయడమే కాకుండా అక్కడ కంచె వేసి, బోర్డు ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ జిల్లా ఖైరతాబాద్‌ మండలం యూస్‌ఫగూడ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్‌ 45 లో (మోతీనగర్‌ ప్రధాన రహదారిలో హనుమాన్‌ టెంపుల్‌ వెనుక) ఉన్న రెండు ఎకరాలపై మహ్మద్‌ షఫాహతుల్లా దాఖలు పిటిషన్‌పై ఈ ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ మరోసారి విచారణ చేపట్టింది. కౌంటర్‌ దాఖలు చేయడానికి చివరి అవకాశం ఇచ్చినప్పటికీ హైడ్రా కౌంటర్లు దాఖలు చేయకుండా స్టేటస్‌ కో ఉత్తర్వులు ఉల్లంఘించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated Date - Jun 13 , 2026 | 07:01 AM