హైదరాబాద్‌లో కుండపోత
ABN , First Publish Date - 2023-09-28T04:02:37+05:30 IST
భారీ వర్షం హైదరాబాద్ నగరాన్ని వణికించింది. బుధవారం సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు గంటన్నర వ్యవధిలోనే సుమారుగా 10 సెంటీమీటర్ల వర్షం పడింది.
గంటన్నరలో 10 సెంటీమీటర్ల వర్షం
రోడ్లను ముంచిన వరద.. ట్రాఫిక్ జామ్
మరో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): భారీ వర్షం హైదరాబాద్ నగరాన్ని వణికించింది. బుధవారం సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు గంటన్నర వ్యవధిలోనే సుమారుగా 10 సెంటీమీటర్ల వర్షం పడింది. కుండపోత వానతో రహదారులపై మోకాళ్లలోతు వరద నిలిచిపోయింది. ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, మాదాపూర్, కొండాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌తోపాటు రాజేంద్రనగర్, గోల్కొండ, లంగర్‌హౌస్, అల్వాల్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎర్రగడ్డ, సికింద్రాబాద్ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఐటీకారిడార్‌తో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, లకిడికపూల్, అమీర్‌పేట ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లంగర్‌హౌ్‌సలో అత్యధికంగా 9.5, రాజేంద్రనగర్‌లో 7.3, అల్వాల్‌లో 7.1, జూబ్లీహిల్స్‌లో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, చింతలబస్తీ నాలాలో ఓ మొసలి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. డీఆర్‌ఎఫ్ బృందం సభ్యులు, ఫారెస్టు అధికారులు నాలాను జల్లెడ పట్టి మొసలిని బంధించితీసుకెళ్లారు. కాగా, నగరంలో మరో రెండురోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కృష్ణా ప్రాజెక్టులకు స్వల్పంగా వరద
కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు స్వల్పంగా వరద వచ్చిచేరుతోంది. జూరాల ప్రాజెక్టుకు 14,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... ఔట్‌ఫ్లో 8,340 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద 9,328 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 91.40 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. మరోవైపు.. గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 61వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... 13 గేట్లు ఎత్తడం ద్వారా 61వేల క్యూసెక్కులను కిందకు వదిలారు. కడెం ప్రాజెక్టుకు 1,565 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... 15వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 14వేల క్యూసెక్కులు, సుందిళ్లకు 16 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఇక, మేడిగడ్డకు 2.38 లక్షల క్యూసెక్కులు, తుపాకులగూడెం(సమ్మక్క సాగర్) బ్యారేజీకి 3.72 లక్షల క్యూసెక్కులు, సీతమ్మసాగర్‌కు 4.19లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... అంతే దిగువకు వదిలిపెట్టారు.