Share News

‘బుల్లెట్‌’కు రైట్‌ రైట్‌!

ABN , Publish Date - Jun 13 , 2026 | 04:23 AM

రాష్ట్రంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ బైక్‌ల తయారీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. బుల్లెట్‌ బండ్ల తయారీ సహా మొత్తం రూ.14,493 కోట్ల పెట్టుబడులకు..

‘బుల్లెట్‌’కు రైట్‌ రైట్‌!

  • రాష్ట్రంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ల తయారీకి ఎస్‌ఐపీసీ గ్రీన్‌సిగ్నల్‌

  • తిరుపతిలో యూనిట్‌ స్థాపనకు అనుమతి

  • ఐటీ, పర్యాటకం, పరిశ్రమల రంగాల్లో 14,493 కోట్ల పెట్టుబడులకు ఆమోదముద్ర

  • 23,572 మందికి ఉద్యోగాలకు అవకాశం

  • పలు సంస్థలకు భూకేటాయింపునకు నిర్ణయం

అమరావతి, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ బైక్‌ల తయారీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. బుల్లెట్‌ బండ్ల తయారీ సహా మొత్తం రూ.14,493 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 36 ప్రతిపాదనలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) ఆమోద ముద్ర వేసింది. ఐటీ, పర్యాటకం, పరిశ్రమలు తదితర రంగాల్లో పెట్టుబడుల ద్వారా 23,572 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో రూ.3436.66 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలను ఎస్‌ఐపీసీ ఆమోదించింది. దీని ద్వారా 16,019 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇంకా, పర్యాటక రంగంలో రూ.240 కోట్ల పెట్టుబడులతో 625 మందికి, పరిశ్రమలు, వాణిజ్య విభాగాల్లో రూ.7786.20 కోట్ల పెట్టుబడులతో 1668 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఏపీఐఐసీ ద్వారా రూ.3030.83 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలతో 2860 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి.


వివిధ కంపెనీల ప్రతిపాదనలు ఇలా..

ఎక్లాత్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: విశాఖలో రూ.50 కోట్లతో 1000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రతిపాదన చేసింది. ఈ కంపెనీకి లిఫ్ట్‌ పథకం కింద భూమి కేటాయించాలని నిర్ణయించారు.

ఇప్యాక్‌ డ్యూరబుల్‌ అండ్‌ మాన్యుఫాక్చరర్స్‌: రూ.1084.31 కోట్లతో 1600 మందికి ఉద్యోగాలను కల్పించే సంస్థను తిరుపతి జిల్లా నాయుడుపేటలో స్థాపించనున్నారు.

సత్త్వా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: విశాఖపట్నంలో రూ.1200 కోట్లతో పది వేల మందికి ఉద్యోగాలను కల్పించే ప్రతిపాదనకు ఆమోదం దక్కింది. ఈ సంస్థకు 8.82 ఎకరాలు కేటాయించాలని నిర్ణయం.

అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఇండియా: శ్రీసిటీలో రూ.445 కోట్లతో 1250 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం.

మెక్‌నెక్స్‌ ఇండియా: శ్రీసిటీలో రూ.347 కోట్లతో 1633 ఉద్యోగాల కల్పన ప్రతిపాదనలకు అంగీకారం.

ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌: విశాఖపట్నంలో గతంలో ఇచ్చిన అనుమతుల మేరకు కేటాయించిన భూవిక్రయ పత్రాల్లో మార్పులకు ఆమోదం.

సెంటర్‌ ఫర్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ టెలిమెట్రిక్స్‌ (సీ-డాట్‌): అమరావతిలో పది కోట్ల రూపాయలతో ఐదుగురికి ఉపాధి.

క్యూబిట్‌ఫోర్స్‌: అమరావతిలో రూ.100 కోట్లతో 100 మందికి ఉద్యోగాలను కల్పించే ఇంటిగ్రేటెడ్‌ హార్డ్‌వేర్‌, క్వాంటం ఇన్‌ఫ్రోకు ఆమోదం.

అటోమియనిక్స్‌: అమరావతిలో రూ.79.8 కోట్లతో 190 మందికి ఉద్యోగాలను కల్పించే క్వాంటం పరిశోధన, అభివృద్ధికి గ్రీన్‌సిగ్నల్‌.


క్యూరిప్ట్‌షికెట్‌: అమరావతిలో పది కోట్ల రూపాయలతో 20 మందికి ఉద్యోగాలను కల్పించే ప్రతిపాదనలకు ఓకే.

ఫ్రాగల్‌ ఏఐ: అమరావతిలో రూ.2.6 కోట్లతో ఆరుగురికి ఉద్యోగాలను కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం.

క్వారియమ్‌: అమరావతిలో రూ.0.45 కోట్లతో ఐదుగురికి ఉద్యోగాలను కల్పించే ప్రతిపాదనలకు ఎస్‌ఐపీసీ ఆమోదం.

క్యూక్రిషి: అమరావతిలో రూ.25 కోట్లతో 100 మందికి ఉద్యోగ ప్రతిపాదనకు సమ్మతి.

క్యూట్‌: అమరావతిలో రూ.60 కోట్లతో 100 ఉద్యోగాలను కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం.

విజయనగర్‌ ఇన్వస్ట్‌మెంట్స్ అనకాపల్లిలో రూ.53.35 కోట్లతో 225 మందికి ఉద్యోగాలను కల్పించే ప్రతిపాదనలకు అమోదం.

డావిక్‌ హోటల్స్‌: తిరుపతిలో రూ.186.64 కోట్లతో 400-500 ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్‌.

ఆమ కోస్టల్‌ రిసార్ట్స్‌: బాపట్లలో స్థాపనకు ఆమోదం

ప్రొటేరియల్‌ ఇండియా: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో రూ.2250 కోట్లతో 530 మందికి ఉద్యోగాల కల్పన ప్రతిపాదనలకు ఓకే.

నాన్‌ మాగ్నేటెక్‌: తిరుపతిలో రూ.1250 కోట్లతో 400 మందికి ఉద్యోగాలను కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం.

రెనాలస్‌ ప్రొడక్ట్స్‌: తిరుపతిలో రూ.350 కోట్ల పెట్టుబడితో 100 మందికి ఉద్యోగాలను కల్పించే ప్రతిపాదనలకు సమ్మతి.

ప్రీమియర్‌ ఎనర్జీస్‌: తిరుపతిలో రూ.3936 కోట్లతో 40 మందికి ఉద్యోగాలు కల్పించే ఇన్‌గాట్‌-వాటర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాపనకు సమ్మతి.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌: తిరుపతిలో మోటారు సైకిల్‌ తయారీ యూనిట్‌ స్థాపనకు అనుమతి.

అదాపి విలఖవర్‌ లిమిటెడ్‌: నెల్లూరులో యూనిట్‌ స్థాపనకు ఆమోదం.

శ్యామ్‌మెటాలిక్స్‌: నెల్లూరులో యూనిట్‌ స్థాపనకు ఆమోదం.

ఎవరాన్‌: చిత్తూరు జిల్లా గుడిపల్లెలో రూ.1123 కోట్లతో 1200 మందికి ఉద్యోగాలు కల్పన ప్రతిపాదనకు అంగీకారం.

ఇకోమ్‌ టెలి లిమిటెడ్‌: కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో రూ.330 కోట్లతో 40 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం.

Updated Date - Jun 13 , 2026 | 04:24 AM