Share News

అందంగా రాద్దాం.. మార్కులు కొట్టేద్దాం..

ABN , Publish Date - Mar 11 , 2026 | 11:59 AM

పరీక్షల వేళ జవాబు పత్రాలు దిద్దే ఉపాధ్యాయులకు అందంగా కనిపించేలా జవాబులు రాస్తే చాలు ఇక అదనపు మార్కులు సాధించవచ్చని వేరే చెప్పక్కర్లేదు.

అందంగా రాద్దాం.. మార్కులు కొట్టేద్దాం..

  • జవాబు పత్రాల్లో చేతిరాత ఆకర్షణీయంగా ఉండాలి

  • అలా ఉంటే మూల్యాంకనంలో అదనపు మార్కులు పొందే అవకాశం

  • సాధనతో అందమైన చేతిరాత సొంతం అవుతుంది

  • విద్యార్థులు దృష్టి పెట్టాలంటున్న విద్యా నిపుణులు

వర్ధన్నపేట(వరంగల్): పరీక్షల వేళ జవాబు పత్రాలు దిద్దే ఉపాధ్యాయులకు అందంగా కనిపించేలా జవాబులు రాస్తే చాలు ఇక అదనపు మార్కులు సాధించవచ్చని వేరే చెప్పక్కర్లేదు. ఇందుకోసం విద్యార్థులు నిరంతరం సాధన చేస్తేనే అందమైన చేతి రాత సాధ్యమవుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రతి విద్యార్థి.. చేతి రాతకు ఉన్న గుర్తింపు గురించి తెలుసుకుని, అందుకు అనుగుణంగా మార్చుకుంటేనే భవిష్యత్తులో అన్నింటికి ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఇంటర్మీడియట్‌ ఎగ్జామ్స్‌ ప్రారంభం కాగా, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల వేళ చేతి రాతపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.


పరీక్ష సమయంలో తడబాటు..

పరీక్షల గంట మోగింది. ఈ నెల 14 నుంచి ఏప్రిల్‌ 13 వరకు పది పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు అంటే విద్యార్థులకు తెలియని భయం. ఆ భయంతో పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలకు జవాబులను రాసే క్రమంలో చేతి రాత వంకరటింకరగా వస్తుంది. ఇంకొందరు విద్యార్థులు ముందుగా అందంగానే మొదలు పెట్టినప్పటికీ, పోనుపోను అందంగా రాయలేక ఇష్టం వచ్చినట్లు రాస్తుంటారు. దీంతో ప్రశ్నలకు, జవాబులు సరిగా రాసినప్పటికి చేతి రాత సరిగా లేకపోవడంతో పేపర్లు దిద్దే వారికి సరిగా అర్ధం కాకపోవడం వల్ల మార్కులు కూడా తగ్గే ఆస్కారం ఉంది. కాబట్టి ముందు నుంచే విద్యార్థులు చేతి రాతపై దృష్టి పెట్టాలి. అక్షరాలను పొందికగా ముత్యాల్లాగా పేర్చి ఆకర్షించే విధంగా జవాబులు రాయడం వల్ల పేపర్లు దిద్దే వారికి రాసిన జవాబులు అందంగా కనిపిండడంతో అదనపు మార్కులు పొందే అవకాశాలుంటాయి.


exam1.jpg

పాటించాల్సిన జాగ్రత్తలు...

  • విద్యార్థులు పరీక్షల్లో జవాబులు రాసేటపుడు అక్షరాలు పొందికగా, ముత్యాల్లాగా పేర్చినట్లు అందంగా కనిపించాలి. అదేవిధంగా స్పష్టంగా రాయాలి.

  • ఒక్క పేజీలో కేవలం 16 నుంచి 18 లైన్లు మాత్రమే వచ్చే విధంగా రాయడం మంచిది.

  • సమాధాన పత్రం పైకి, కిందికి పక్కలకు బార్డర్లకు వదిలి సమానంగా రాయాలి.

  • పరీక్ష రాసేటపుడు ఒద్దికగా పూర్తిగా అనుకూలంగా కూర్చొని రాయాలి.


  • తెలుగు, హిందీ, అక్షరాలను నాలుగు మి.మీ.లే, ఇంగ్లీష్‌ అక్షరాలను మూడు మి.మీ.లు ఉండే విధంగా చూసుకోవాలి.

  • అక్షరాలు, పదాలు, లైన్‌ల మధ్య తగినంత గ్యాప్‌ ఉండేలా చూసుకోవాలి.

  • అక్షరాలను ఒత్తిపెట్టి రాయకూడదు. అలా రాయడం వల్ల పేజీ వెనుక భాగం వైపు కనిపిస్తుంది. దీని వల్ల వెనక వైపు ఉన్న రాత కూడా కనిపించకుండా పోయి నష్టపోవాల్సి వస్తుంది.

  • గణితంలో సమీకరణాలు, సైన్స్‌లో పటాలు, పోటీభాగాలు అందంగా కనిపించే విధంగా రాయాలి.

  • జవాబులు రాసేటపుడు వాటికి సైడ్‌ హెడ్డింగ్‌లు రాయాలి. పేరాలుగా విడగొట్టాలి.


అందమైన రాత చాలా ముఖ్యం

  • కరుణశ్రీ, ఎస్‌వో, ఇల్లంద కేజీబీవీ

చదవడంలో ఎన్ని మార్పులు వచ్చినా చేతి రాతకు ఉండే ప్రాముఖ్యత ఎన్నటికీ తగ్గదు. ప్రతి విద్యార్థికి అందమైన చేతి రాత అనేది చాలా ముఖ్యం. పరీక్షల్లో రాసే జవాబులు అందంగా కనిపిస్తే, పేపర్లు దిద్దే వారు గుర్తించి అదనపు మార్కులు వేసే అవకాశాలున్నాయి. విద్యార్థులు చదువుతో పాటు చేతి రాతకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలి.


నిరంతర సాధన అవసరం

  • వనం భారతి, తెలుగు ఉపాధ్యాయురాలు, ఇల్లంద

నేటి ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్‌లు వచ్చి చేతి రాతకు పెద్దగా పనిలేకుండా చేశాయి. చదువు మీద పెట్టిన శ్రద్దను విద్యార్థులు చేతి రాతపై పెద్దగా పెట్టడం లేదు. పరీక్షల్లో జవాబులు అన్నీ సరిగానే రాసినప్పటికీ అందమైన చేతి రాత లేక మార్కులు తగ్గిపోయి విద్యార్థులు నష్టపోతున్నారు. ఒక్కసారి అందంగా రాయడం నేర్చుకుంటే జీవితాంతం అందంగానే రాయవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి:

తవ్వుకో.. అమ్ముకో..!

పరిగి బీజేపీ సారథి ఎవరు?

Read Latest Telangana News and National News

Updated Date - Mar 11 , 2026 | 11:59 AM