ఏపీ లాసెట్ - 2026 ఫలితాలు విడుదల.. 80 శాతం ఉత్తీర్ణత
ABN , Publish Date - May 18 , 2026 | 03:29 PM
ఏపీ లాసెట్ / పీజీ లాసెట్ - 2026 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ పరీక్షలకు మొత్తం 23,996 మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 19,197 మంది అర్హత సాధించారు. దీంతో ఈ ఏడాది ఏపీ లాసెట్‌లో సుమారు 80 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి): ఏపీ లాసెట్ / పీజీ లాసెట్ - 2026 ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 30,021 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 23,996 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 19,197 మంది అర్హత సాధించగా.. మొత్తం 80 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మే 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 100 పరీక్షా కేంద్రాల్లో ఏపీ లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలను నిర్వహించారు. ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఫలితాలను విడుదల చేశారు. ఈసారి ప్రాథమిక కీపై ఎలాంటి అభ్యంతరాలు తెలపకపోవడంతో అదే ఫైనల్ కీగా ప్రకటించారు.
లాసెట్ మూడేళ్ల కోర్సుకు మొత్తం 22,284 మంది నమోదు చేసుకోగా, 17,533 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 13,863 మంది అర్హత సాధించారు. ఈ కోర్సులో ఉత్తీర్ణత శాతం 79.07శాతంగా నమోదైంది. లాసెట్ మూడేళ్ల కోర్సులో తిరుపతికి చెందిన ఎస్ అఫ్రిద్ బాషా తొలి ర్యాంక్ సాధించారు. లాసెట్ ఐదేళ్ల కోర్సుకు 5,502 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 4,559 మంది పరీక్షలకు హాజరయ్యారు. అందులో 3,582 మంది అర్హత సాధించారు. ఈ కోర్సులో ఉత్తీర్ణత శాతం 78.57శాతంగా నమోదైంది. లాసెట్ ఐదేళ్ల కోర్సులో గుంటూరుకు చెందిన ముప్పా స్నేహ టాప్ ర్యాంక్ సాధించారు. పీజీ లాసెట్‌కు మొత్తం 2,235 మంది నమోదు చేసుకోగా, 1,904 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 1,752 మంది అర్హత సాధించారు. పీజీ లాసెట్‌లో అత్యధికంగా 92.02 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పీజీ లాసెట్‌లో ఉత్తరాఖండ్‌కు చెందిన గౌరవ్ రాజ్ ఆర్య తొలి ర్యాంక్ సాధించారు.
ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in/LAWCETలో అందుబాటులో ఉంచారు. అదేవిధంగా విద్యార్థుల సౌకర్యార్థం వాట్సాప్ ద్వారా కూడా ర్యాంక్ కార్డులు పొందే అవకాశం కల్పించారు. ఇందుకోసం 9552300009 నంబర్‌ను ప్రకటించారు. పరీక్షల నిర్వహణ బాధ్యతను ఎస్పీఎంవీవీకి.. ఏపీఎస్‌సీహెచ్‌ఈ అప్పగించింది. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. త్వరలో కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. బార్ కౌన్సిల్ అనుమతుల అనంతరం సీట్ల సంఖ్య ఖరారు చేయనున్నట్లు తెలిపారు. దీంతో లా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంది.
విద్యార్థులకు మంత్రి లోకేశ్ అభినందనలు..
ఫలితాల విడుదల అనంతరం అర్హత సాధించిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అభినందనలు తెలిపారు. విద్యార్థుల కృషి, పట్టుదల ఫలితంగా మంచి ఫలితాలు వచ్చాయని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో న్యాయ విద్యలో రాణించాలని ఆకాంక్షించారు. మంత్రి లోకేష్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో #APECET2026, #AndhraPradesh హ్యాష్‌ట్యాగ్‌లతో ట్వీట్ చేస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు
పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడిని: రజనీకాంత్
హైబ్రిడ్ మోడల్‌లో మహానాడు నిర్వహిస్తాం: పల్లా శ్రీనివాసరావు
Read Latest AP News And Telangana News And International News And Telugu News