కళాకారుల కష్టాలు తీర్చేలా..!
ABN , Publish Date - Jul 28 , 2026 | 07:12 AM
టీటీడీ ఆధ్వర్యంలో నడిచే అన్ని హిందూ ధార్మిక ప్రాజెక్టుల్లో పనిచేసే కళాకారుల కష్టాలు తీర్చేలా బోర్డు ఇటీవల తీసుకొన్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
18 ఏళ్ల తర్వాత గౌరవ వేతనాలు పెంచిన టీటీడీ
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు
బోర్డు ఆమోదంపై కళాకారులు, పండితుల్లో హర్షం
(తిరుపతి - ఆంధ్రజ్యోతి)
టీటీడీ ఆధ్వర్యంలో నడిచే అన్ని హిందూ ధార్మిక ప్రాజెక్టుల్లో పనిచేసే కళాకారుల కష్టాలు తీర్చేలా బోర్డు ఇటీవల తీసుకొన్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. 18 ఏళ్ల తర్వాత వారి గౌరవ వేతనాలు పెంచేందుకు ఆమోదం తెలిపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళాకారులను ఆదుకునేందుకు టీటీడీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఉన్నతాధికారులు వేతన సవరణ కోసం అదనపు ఎఫ్‌ఏ అండ్ సీఏవో, డిప్యూటీ ఈవో (హెచ్‌ఆర్), హెచ్‌డీపీపీ కార్యదర్శి, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి, ఎస్వీ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్‌లతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మార్చిలో సమావేశమైంది. వివిధ వర్గాల కళాకారులకు, పండితులు, స్వామీజీలు, రుత్వికులకు ఇచ్చే సంభావనలను సమీక్షించి చేసిన ప్రతిపాదనలను టీటీడీ బోర్డు ఇటీవల ఆమోదించింది.
అమల్లోకి రానున్న గౌరవ వేతనాలు ఇలా...
ధార్మిక ఉపన్యాసాలు/పురాణ ప్రవచనాలు చెప్పే పండితులు ఒకరికి రోజుకు స్థానికులైతే రూ.3 వేలు, స్థానికేతరులకు రూ.5 వేలు, 250 కిలోమీటర్లు దాటి వచ్చే వారికి రూ.6500 చెల్లించనున్నారు.
అనుగ్రహ భాషణం చేసే స్వామీజీలకు ఒకరికి (దేవదాయశాఖ అధికారికంగా గుర్తించిన జాబితాలో ఉన్నవారికి) రోజుకు రూ.15,116, టీటీడీ జీయర్ స్వామీజీలు, అధికారిక గుర్తింపు లేకపోయినా ఆధ్యాత్మికంగా విశిష్టత కలిగిన స్వామీజీలకు ఒక్కొక్కరికీ రోజుకు రూ.10,116 ఇవ్వనున్నారు.
ప్రత్యేక సదస్సుల్లో పాల్గొనే పండితులు స్థానికులైతే ఒకరికి రోజుకు రూ.5 వేలు, స్థానికేతరులకు రూ.7 వేలు ఇవ్వనున్నారు.
ధనుర్మాసంలో తిరుప్పావై చెప్పే వారికి రూ.15 వేలతో పాటు పారాయణదారుకు పట్టు వస్త్రం కోసం రూ.7 వేలు చెల్లించనున్నారు. అలాగే తిరుప్పావై ఇన్‌స్పెక్టర్లుగా ఉన్న వారికి రూ.25 వేలతో పాటు పారాయణదారుకు పట్టు వస్త్రం కోసం రూ.7 వేలు, తిరుప్పావై పాటల సంగీత కళాకారులకు రూ.15 వేలు ఇవ్వనున్నారు.
విచార గోష్ఠి సదస్సులో రోజుకు ఒకరికి రూ.4 వేలు ఇవ్వనున్నారు. విశ్వశాంతి/యజ్ఞం/యాగాలు నిర్వహించే ఒక్కొక్క ముఖ్య రుత్విక్/అర్చకులకు రోజుకు రూ.4 వేలు, సహాయ రుత్విక్‌కు రూ.3 వేలు చెల్లించనున్నారు.
హరికథ/సంగీతం (టీటీడీ ఆలయంలో) ముఖ్య కళాకారుడికి రోజుకు రూ.3 వేలు, సహాయ వాయిద్యకారులకు ఒక్కొక్కరికీ రూ.1500 ఇస్తారు. అలాగే టీటీడీయేతర కార్యక్రమాల్లో పాల్గొనే వారికి ముఖ్య కళాకారుడికి రూ.2 వేలు, సహాయ వాయిద్యకారులకు రూ.1500 చొప్పున చెల్లిస్తారు.
బుర్రకథ/ఒగ్గుకథ (బృందంలో ఐదుగురు సభ్యులు ఉంటారు) కళాకారులకు 250 కిలోమీటర్ల లోపు నుంచి వచ్చే వారికి రూ.10 వేలు, 250 కి.మీ దాటి వచ్చే స్థానికేతరులకు రూ.13 వేలు ఇవ్వనున్నారు.
సంగీత కార్యక్రమాలను మూడు గ్రేడ్లుగా విభజించారు. ఏ గ్రేడ్ స్థానిక బృందానికి రోజుకు రూ.15 వేలు, స్థానికేతరులకు రూ.25 వేలు ఇస్తారు. బీ గ్రేడ్ బృందానికి స్థానికమైతే రూ.10 వేలు, స్థానికేతరమైతే రూ.15 వేలు ఇవ్వనున్నారు. గ్రేడ్ లేని సంగీత కళాకారులకు ఒక్కో బృందానికి స్థానికులైతే రూ.6 వేలు, స్థానికేతర బృందానికి రూ.10 వేలు చెల్లించనున్నారు.
నృత్య రూపకాల్లో ఏ గ్రేడ్ కళాకారులకు రోజుకు రూ.20 వేలు, బీ గ్రేడ్ కళాకారులకు రూ.15 వేలు, గ్రేడ్ లేని కళాకారులకు రూ.10 వేలు ఇస్తారు. నృత్య రూపకం ఏ గ్రేడ్ రూ.35 వేలు, బీ గ్రేడ్ రూ.30 వేలు ఇవ్వనున్నారు. గ్రేడ్ లేని ఇతరుల నృత్య రూపకాలకు రూ.25 వేలు ఇస్తారు. సమూహ నృత్యం ఏ గ్రేడ్ కళాకారులకు రూ.25 వేలు, బీ గ్రేడ్ రూ.20 వేలు, గ్రేడ్ లేని ఇతరులకు రూ.15 వేలు చెల్లిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News