Share News

అల వైభోగాపురములో!

ABN , Publish Date - Jul 28 , 2026 | 05:16 AM

ఒకప్పుడు శంషాబాద్‌ అంటే... హైదరాబాద్‌-బెంగళూరు హైవే పక్కన ఉన్న చిన్న ఊరు! ఇప్పుడు శంషాబాద్‌ అంటే గుర్తుకొచ్చేది... అంతర్జాతీయ విమానాశ్రయం! ఒకప్పుడు భోగాపురం అంటే...

అల వైభోగాపురములో!

  • రెక్కలు విచ్చుకుంటున్న ‘విమానం’

  • మారుమూల ఊరికి అంతర్జాతీయ సొబగులు

  • మెగాసిటీగా మారుతున్న భోగాపురం

  • గేమ్‌ చేంజర్‌గా గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు

  • ఆ పరిసరాల్లోనే గూగుల్‌ డేటా సెంటర్‌

  • రిలయన్స్‌ డేటా సెంటర్‌ కూడా..

  • పర్యాటక, ఆతిథ్య అనుబంధ పరిశ్రమలూ..

  • 2015-16కు ముందు ఎకరా స్థలం 50-60 లక్షలే.. నేడు రియల్‌ రెక్కలు

  • జోరుగా విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, టౌన్‌షి్‌పలు

  • ఉత్తరాంధ్రలో 3 జిల్లాలపైనా ప్రభావం

అప్పుడెప్పుడో 2008లో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌ శివార్లలో ‘శంషాబాద్‌’ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. అక్కడ ఆ స్థాయిలో, అన్ని హంగులతో, అంత భారీ ఎయిర్‌పోర్టు.. అందులోనూ ‘గ్రీన్‌ ఫీల్డ్‌’ విమానాశ్రయం అద్భుతంగా సాక్షాత్కరించింది. ఇప్పుడు, ఇన్నేళ్లకు, అదీ నవ్యాంధ్ర వాణిజ్య రాజధానిగా పేరొందిన విశాఖ కూడా అదే ఘన కీర్తిని సొంతం చేసుకుంటోంది. అదీ.. ‘భోగాపురం’ రూపంలో! నవ్యాంధ్రలో ప్రారంభమవుతున్న తొలి అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ఇదే! ఉత్తరాంధ్రకే తలమానికంగా, సీమాంధ్రకే గర్వకారణంగా, తెలుగు వారి సంస్కృతికి అద్దంపట్టేలా నిర్మితమైన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ఆగస్టు 1న అధికారికంగా రెక్కలు విచ్చుకుంటుంది!

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

ఒకప్పుడు శంషాబాద్‌ అంటే... హైదరాబాద్‌-బెంగళూరు హైవే పక్కన ఉన్న చిన్న ఊరు! ఇప్పుడు శంషాబాద్‌ అంటే గుర్తుకొచ్చేది... అంతర్జాతీయ విమానాశ్రయం! ఒకప్పుడు భోగాపురం అంటే... విజయనగరం జిల్లాలోని ఒక చిన్న మండల కేంద్రం! ఇకపై భోగాపురం అంటే, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చిరునామా! అది మాత్రమే కాదు! అదే ప్రాంతంలో వస్తున్న ప్రముఖ డేటా సెంటర్లు, ఇతర పరిశ్రమలు! రూపు రేఖలు మార్చుకుంటూ కొత్త రెక్కలు విచ్చుకుంటున్న ‘భోగాపురం’ కథ ఇది...


భోగాపురం.. పదేళ్ల క్రితం ఈ పేరు పెద్దగా రాష్ట్ర ప్రజలకు తెలియదు. విజయనగరం జిల్లాలోని ఓ సా ధారణ మండలం. ఈ మండలంలో 17 గ్రామ పంచాయతీలు, 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. విజయనగరం జిల్లా కేంద్రానికి 23 కిలోమీటర్ల దూరంలో.. విశా ఖ, శ్రీకాకుళం నగరాలకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 2015-16కు ముందు అక్కడ ఎకరా స్థలం సుమారు రూ.50-60 లక్షలు ఉండేది. పారిశ్రామికంగా కానీ రియల్‌ ఎస్టేట్‌ పరంగా కానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. అలాంటి ‘భోగాపురం’ పేరు ఒక్కసారిగా రాష్ట్రమంతటికీ పరిచయమైంది. కారణం... 2019 ఫిబ్రవరి 14న అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన జరిగింది. విమానాశ్రయం నిర్మాణం కో సం 2708 ఎకరాలు భూసేకరణ చేశారు. అంచనా వ్యయం రూ.4,750 కోట్లు. ఇది ఈ ప్రాంతానికే ‘గేమ్‌ చేంజర్‌’! కానీ.. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును గాలి కొదిలేసింది. రెండేళ్ల క్రితం కూ టమి ప్రభుత్వం ఏర్పడింది. మళ్లీ ఆశల రెక్కలు విచ్చుకున్నాయి. ఎయిర్‌పోర్టు పనులు పట్టాలెక్కాయి. ఇప్పు డు ప్రారంభోత్సవ వేడుకకు రంగం సిద్ధమైంది.


ఎకనామిక్‌ హబ్‌ దిశగా...

ఇప్పటి వరకూ ఒక ఎత్తు.. ఇక నుంచి మరో ఎత్తు అన్నట్టుగా భోగాపురం పరిస్థితి మారింది. రియల్‌ ఎస్టేట్‌కు సంబంధించి సాధారణ వెంచర్ల సంఖ్య తగ్గిపోయి... వాటి స్థానంలో సరికొత్తగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విల్లా ప్రాజెక్టులు, లగ్జరీ గేటెడ్‌ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. ఎయిర్‌పోర్టు కారిడార్‌ కు ఆనుకుని వందల ఎకరాల్లో ఆధునిక టౌన్‌షి్‌పల నిర్మాణాలు ఊపందుకున్నాయి. విమానాశ్రయం కార్యకలాపాలు మొదలైతే అనతికాలంలోనే ఈ ప్రాంతం ఒక పెద్ద ఎకనామిక్‌ హబ్‌గా మారుతుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో ప్రీమియం నివాస గృహాలకు, కమర్షియల్‌ స్పేస్‌కు డిమాండ్‌ ఏర్పడుతోంది.

ముందుగానే బుకింగ్‌..

విమానాశ్రయ కారిడార్‌లో సాగుతున్న ప్రగతిని చూసి విదేశాల్లో స్థిరపడిన ఉత్తరాంధ్ర ప్రజలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికా, యూరప్‌, గల్ఫ్‌లో స్థిరపడిన ఉత్తరాంధ్ర వాసుల తో పాటు కోస్తాంధ్ర ప్రజలు భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ పరిసర ప్రాంతాల్లో గేటెడ్‌ కమ్యూనిటీ విల్లాలు, కమర్షియల్‌ ప్లాట్లను ముందుగా బుక్‌ చేసుకుంటున్నారు. సొంత గడ్డపై అంతర్జాతీ య విమానాశ్రయం పక్కనే స్థిరాస్తి ఉంటే దీర్ఘకాలంలో భారీ లాభాలను ఇస్తుందని భావిస్తున్నా రు. ఇదే మండలంలో రిలయన్స్‌ డేటా సెంటర్‌ నిర్మాణం కానుంది. ఇది పూర్తయితే ఐటీ రంగనిపుణులు ఇక్కడే నివాసం ఉంటారు. ఇక చట్టుపక్కల ప్రాంతాల్లో అద్దె ఇళ్లు, షాపులకు డిమాండ్‌ పెరిగింది. ఇదివరకు రూ.5వేలకు దొరికే ఇళ్లను ఇప్పుడు రూ.10వేలకు పైగా చెబుతున్నారు. అలాగే చిన్న చిన్న వ్యాపారాలకు పనికి వచ్చే షాపులకు సైతం అద్దెలను అమాంతం పెంచేశారు.


మూడు జిల్లాలపైనా ప్రభావం..

అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో ఒక్క భోగాపురంలో మాత్రమే కాదు.. విజయనగరం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే విశాఖ జిల్లాలో రియల్‌ భూమ్‌ ఉంది. అటు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎచ్చెర్ల నియోజకవర్గంపై కూడా కనిపిస్తోంది. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు నిత్యం రద్దీగా కనిపిస్తున్నాయి. వారం వారం ఇక్కడ చదరపు గజం భూమి ధర మారుతోంది. స్థానిక రైతులతోపాటు భూ యజమానులకు ఊహించని రీతిలో ఆర్థిక ప్రయోజనం కలుగుతోంది.

మారుతున్న రూపురేఖలు

భోగాపురం గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటైంది. అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయంతో మండలం రూపురేఖలే మారిపోతున్నాయి. పరిసర ప్రాంతంలోనే గూగుల్‌ డేటా సెంటర్‌ రాకతో పాటు ఇక్కడ రిలయన్స్‌ డేటా సెంటర్‌ సైతం ఏర్పాటు చేయనుంది. అంతేగాక పర్యాటక, ఆతిథ్య అనుబంధ పరిశ్రమలు పెద్ద ఎత్తున తరలివస్తున్నాయి. దీంతో విజయనగరం సరిహద్దులతో పాటు భోగాపురం చుట్టుపక్కల 20 కిలోమీటర్ల వరకూ ల్యాండ్‌ మార్కెట్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. 2025-26 నుంచి రియల్‌ ఎస్టేట్‌ భూమ్‌ అమాంతం పెరిగింది. ఎకరా రూ.10 కోట్ల వరకు పలుకుతోంది. కమర్షియల్‌ విల్లా ప్రాజెక్టులు, లగ్జరీ గేటెడ్‌ కమ్యూనిటీలు, ఆధునిక టౌన్‌షి్‌పలు వెలుస్తున్నాయి. వెరసి.. పల్లె నుంచి మెగా సిటీగా భోగాపురం అభివృద్ధి చెందుతోంది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచీ రియల్టర్లు పెట్టుబడి పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు.


స్థానికులకు ఉద్యోగావకాశాలు కావాలి...

ఎయిర్‌పోర్టు మా ప్రాంతంలో నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. అయితే మాలాంటి చదువుకొన్న వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయనుకున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. దీనిపై ప్రభుత్వం చేసే ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాం. ఏదిఏమైనా మా ప్రాంతంలో ఎయిర్‌పోర్టు రావడం అన్నివిధాలా మంచిదే.

- ఎస్‌.మునేష్ రెడ్డి, రెడ్డికంచేరు

ఎయిర్‌పోర్టు రాకతో ఆనందం

అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు రావడంతో భూముల ధరలు అమాంతంగా పెరిగాయి. ఎయిర్‌పోర్టుతో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే ఈ ప్రాంతానికి భవిష్యత్తులో ఐటీ కంపెనీలు వస్తాయని చెబుతున్నారు. అవి వస్తే ఈప్రాంతం చాలా విలువైన కీలకంగా తయారవుతుంది. చుట్టుపక్కలున్న గ్రామాలకు ప్రభుత్వ పరంగా మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తే ఈ ప్రాంతం వైభోగాపురంగా విరాజిల్లుతుంది.

- బి.సాయి, గూడెపువలస

Updated Date - Jul 28 , 2026 | 05:18 AM