Share News

ఫ్లైఓవర్ల కింద ఆధునిక విద్యుత్‌ సబ్‌స్టేషన్లు!

ABN , Publish Date - Jul 28 , 2026 | 06:42 AM

ఇప్పటివరకు ఫ్లైఓవర్ల కింద ఉన్న ఖాళీ స్థలాలను పూల మొక్కలు పెంచడానికి, చిన్నారులకు ఆటస్థలాలుగా లేదా వాహనాల పార్కింగ్‌ కోసం వినియోగించడం చూశాం.

ఫ్లైఓవర్ల కింద ఆధునిక విద్యుత్‌ సబ్‌స్టేషన్లు!

  • స్థలాల కొరతకు టీజీఎస్పీడీసీఎల్‌ వినూత్న పరిష్కారం.. రూ. 10-12 కోట్ల ఆదా!

  • క్యూర్‌ పరిధిలో 8- 10 ప్రాంతాల్లో ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌

హైదరాబాద్‌ సిటీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ఇప్పటివరకు ఫ్లైఓవర్ల కింద ఉన్న ఖాళీ స్థలాలను పూల మొక్కలు పెంచడానికి, చిన్నారులకు ఆటస్థలాలుగా లేదా వాహనాల పార్కింగ్‌ కోసం వినియోగించడం చూశాం. ఇకపై ఆ స్థలాల్లో 33/11 విద్యుత్‌ ఉపకేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో విద్యుత్‌ డిమాండ్‌ రోజురోజుకూ పెరిగిపోతుండడంతో, కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు స్థలాల కొరత తీవ్రంగా మారడంతో దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌) వినూత్న నిర్ణయం తీసుకుంది. ఫ్లైఓవర్ల కింద ఉండే ఖాళీ స్థలాల్లోనే 33/11 కేవీ ‘మోడల్‌ కాంపాక్ట్‌ ఇండోర్‌ సబ్‌ స్టేషన’్ల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సాధారణంగా ఒక్కో సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి స్థలం కొనుగోలుకే రూ. 8 నుంచి రూ. 10 కోట్లు ఖర్చవుతుండగా, ఫ్లైఓవర్ల కింద ఖాళీ జాగాలను వాడుకోవడం వల్ల భారీగా నిధులు ఆదా అవుతాయని అధికారులు భావిస్తున్నారు. సబ్‌స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ, భద్రత, సాంకేతిక అనుకూలత అంశాలపై ఐదుగురు అధికారులతో కూడిన కమిటీ వేసింది. క్యూర్‌ పరిధిలో 8- 10 వరకు కంపాక్ట్‌ సబ్‌ స్టేషన్లు ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.


ముషీరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌!

ఈ ప్రతిపాదనలో భాగంగా ముషీరాబాద్‌లోని నాయిని నర్సింహారెడ్డి స్టీల్‌ ఫ్లైఓవర్‌ (పిల్లర్‌ నంబర్‌ 63-64) కింద ఏర్పాటు చేయనున్న ఇండోర్‌ సబ్‌స్టేషన్‌ స్థలాన్ని టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ జితేష్‌ వి పాటిల్‌, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వి.శివాజీలు సోమవారం పరిశీలించారు. రెండు 8 ఎంవీఏ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యంతో ఈ మోడల్‌ సబ్‌ స్టేషన్‌ ఏర్పాటుకు డిస్కమ్‌ ప్రణాళికలు రూపొందించింది. ఇది అందుబాటులోకి వస్తే ఐదు సబ్‌స్టేషన్లపై అదనపు లోడ్‌ భారం తగ్గి, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అవుతుందని అధికారులు సీఎండీకి తెలిపారు. ఐటీ కారిడార్‌లో భవిష్యత్‌ విద్యుత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గచ్చిబౌలి, కొత్తగూడ (పిల్లర్‌ నంబర్‌ 59-61), కొండాపూర్‌ 8వ బెటాలియన్‌(పిల్లర్‌ నంబర్‌ 2-3) ఫ్లైఓవర్ల కింద మూడు సబ్‌స్టేషన్లు సబ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని డిస్కమ్‌ నిర్ణయించింది. ఈ సబ్‌స్టేషన్లు బాక్సు తరహాలో ఉండటంతో ఫ్లై ఓవర్ల కింద ఏర్పాటు చేసుకునేందుకు అనువుగా ఉంటాయని సీనియర్‌ ఇంజనీర్లు చెబుతున్నారు. ఫ్లైఓవర్ల నిర్మాణాలకు ఎలాంటి విద్యుత్‌ ప్రభావం పడకుండా, పకడ్బందీగా ఎర్తింగ్‌ ఇన్సులేషన్‌, రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.

రక్షణ చర్యలకు అత్యంత ప్రాధాన్యం

‘‘స్థలాల కొరత ఉన్నందునే ఫ్లైఓవర్ల కింద ఆధునిక ఇండోర్‌ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాం. ముషీరాబాద్‌లో ప్రతిపాదించిన సబ్‌స్టేషన్‌ను మోడల్‌ ఇండోర్‌ సబ్‌స్టేషన్‌గా తీర్చిదిద్దేలా ముందుకు వెళ్తున్నాం. విద్యుత్‌ లీకేజీ, షార్ట్‌ సర్యూట్‌ ప్రమాదాలకు అవకాశం లేకుండా.. సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో పూర్తిస్థాయి భద్రతా పరీక్షలు నిర్వహించిన తర్వాతే వీటిని అందుబాటులోకి తెస్తాం.’’

- సీఎండీ జితేష్‌ వి పాటిల్‌

Updated Date - Jul 28 , 2026 | 06:44 AM