Share News

పొగాకు రైతులకు శుభవార్త..!

ABN , Publish Date - Jul 28 , 2026 | 05:43 AM

పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ధర లోటు భర్తీ కింద కిలోకి రూ.20 చొప్పున పొగాకు రైతులకు అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

పొగాకు రైతులకు శుభవార్త..!

  • ధర లోటు భర్తీ కింద కిలోకు రూ.20 చెల్లింపు

  • అంగీకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

  • రైతుల్ని ఆదుకునే విషయంలో రాజీ ప్రసక్తే లేదు

  • అధికారులతో సీఎం చంద్రబాబు

అమరావతి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ధర లోటు భర్తీ కింద కిలోకి రూ.20 చొప్పున పొగాకు రైతులకు అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.188 కోట్లు భరించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో 9.4 కోట్ల కిలోల పొగాకును కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. పొగాకు ధరల స్థిరీకరణ, రైతులను ఆదుకునే అంశంపై వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, పొగాకు బోర్డు, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ అధికారులు, బయ్యర్లతో సీఎం చంద్రబాబు సోమవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ... పొగాకు కొనుగోళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతిచ్చేందుకు అంగీకరించినట్టు చెప్పారు. బ్రైట్‌ రకం పొగాకు ధర కిలో రూ.240, మీడియం రకం రూ.190, లోగ్రేడ్‌ రూ.110 కన్నా తగ్గకుండా చూడాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని పొగాకు బోర్డు, మార్కెటింగ్‌ శాఖ అధికారులకు ఆదేశించారు. పొగాకు మార్కెట్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, రైతులకు మెరుగైన ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.


రైతు ప్రయోజనాలే లక్ష్యం: అచ్చెన్న

పొగాకు రైతులకు మెరుగైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు సమస్యపై కేంద్ర ప్రభుత్వంతో సీఎం చంద్రబాబు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. రెండు రోజుల క్రితం కేంద్ర వాణిజ్య శాఖ ప్రతినిధులతో చర్చించారని గుర్తు చేశారు. పొగాకు రైతుల్ని ఆదుకునే విషయంపై బయ్యర్లతోనూ కేంద్ర ప్రతినిధులు చర్చలు జరిపారన్నారు. పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

Updated Date - Jul 28 , 2026 | 05:43 AM