టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం.. పాలకమండలి నిర్ణయాలివే..
ABN , Publish Date - Feb 28 , 2026 | 03:41 PM
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తిరుమల, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Temple) ధర్మకర్తల మండలి సమావేశం ఇవాళ(శనివారం) తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. ఈ సమావేశానికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మొత్తం 87 కీలక అంశాలపై ధర్మకర్తల మండలి సభ్యులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సుమారు నాలుగు గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో ప్రధానంగా టీటీడీ వార్షిక బడ్జెట్, భక్తులకు అందించే సేవలు, ఆలయ అభివృద్ధి పనులు, పరిపాలన అంశాలు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు.
విద్యాసంస్థల ఆధునీకరణకు రూ.118.8 కోట్లు..
2026 - 2027వ సంవత్సర వార్షిక బడ్జెట్‌ను ఆమోదించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. రూ.5,456.26 కోట్లతో వార్షిక బడ్జెట్ ఆమోదం తెలిపినట్లు వివరించారు. ఈ సందర్భంగా టీటీడీ పాలకమండలి నిర్ణయాలను బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో సబ్ కమిటీ సిపారస్సు మేరకు టీటీడీలోని విద్యా సంస్థల ఆధునీకరణకు రూ.118.8 కోట్ల నిధులు కేటాయించామని వివరించారు. భక్తుల కోరిక మేరకు శ్రీవారి ముడుపు పథకం ప్రారంభిస్తున్నామని తెలిపారు.
రూ.125 కోట్లతో అధునాతన అన్నదాన సముదాయం..
రిలయన్స్ సంస్థ సహకారంతో రూ.125 కోట్లతో అధునాతన అన్నదాన సముదాయన్ని నిర్మిస్తామని బీఆర్ నాయుడు తెలిపారు. హుండీ ద్వారా రూ.1880 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామని అన్నారు. వడ్డీల ద్వారా రూ.1205 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.650 కోట్లు, దర్శన టికెట్ల విక్రయం ద్వారా రూ.310 కోట్లు, జీతాల చెల్లింపునకు రూ.1859.75 కోట్లు, ముడిసరుకుల కొనుగోలుకు రూ.974.50 కోట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు రూ.700 కోట్లు, ఇంజనీరింగ్ పనులకు రూ.475 కోట్లు కేటాయింపులు చేశామని ప్రకటించారు.
70 వేల లడ్డూల ఉచిత పంపిణీ..
శ్రీవాణి ట్రస్టులోని నిబంధనలను సడలించి ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని బీఆర్ నాయుడు చెప్పుకొచ్చారు. ఒంటిమిట్టలో 128 అడుగుల జాంబవంతుడు విగ్రహాన్ని నిర్మిస్తామని వెల్లడించారు. పాట్నా, గౌహతితో పాటు పలు చోట్ల నూతనంగా వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తామని తెలిపారు. ‘అక్షర గోవిందం’ పేరుతో వకుళమాత ఆలయంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని వివరించారు. ఏప్రిల్ 1వ తేదీన శ్రీరాముని కల్యాణం నాడు 70 వేల శ్రీవారి లడ్డూలను ఉచితంగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. రూ.4.25 కోట్లతో ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
రీల్స్ చేసే వారిపై కఠిన చర్యలు..
తిరుపతి, తిరుమలలో 727 మంది భద్రతా సిబ్బందిని నియమిస్తామని బీఆర్ నాయుడు చెప్పుకొచ్చారు. రూ.8 కోట్లతో అలిపిరి తనిఖీ కేంద్రంలో నూతనంగా స్కానింగ్ యంత్రాలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రూ.11.28 కోట్లతో టీటీడీలోని గోశాలల ఆధునికీకరణ చేస్తున్నామని అన్నారు. 51 మంది టీటీడీ పరిచారకులకు అర్చకులుగా పదోన్నతికి ప్రతిపాదన చేస్తున్నామని అన్నారు. పార్వతీపురంలో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ.14.25 కోట్ల నిధులు మంజూరు చేశామని తెలిపారు. గోవిందరాజ స్వామి ఆలయం వద్ద అభివృద్ధి పనులకు నిధులు కేటాయించామన్నారు. రూ.10.73 కోట్లతో తిరుపతిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రీల్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బీఆర్ నాయుడు హెచ్చరించారు. అంతకుముందు తిరుమల వరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని, ఒంటిమిట్ట బ్రహ్మోత్సవం పోస్టర్‌ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విడుదల చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ హయాంలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయింది: సీఎం చంద్రబాబు
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌దత్‌తో మంత్రి నారా లోకేశ్ కీలక భేటీ.. ఎందుకంటే..
Read Latest Telangana News And AP News And Telugu News